- లోక్ భవన్‌లో జరిగిన బెంగాల్ అవతరణ వేడుకల్లో గవర్నర్ శుక్లా
హైదరాబాద్, వెలుగు: దేశమేధో, సాంస్కృతిక పునరుజ్జీవానికి బెంగాల్ కేంద్రబిందువని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా అన్నారు. లోక్ భవన్‌లో శనివారం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, తన భార్య జానకి శుక్లాతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం కేవలం ఒక రాష్ట్ర భౌగోళిక గుర్తింపునకు సంబంధించిన వేడుక మాత్రమే కాదని తెలిపారు.
దేశ మేధో సంపత్తి, సాంస్కృతిక పునరుజ్జీవనం, జాతీయ గౌరవానికి ప్రతీకగా నిలిచే సందర్భమని చెప్పారు. దేశానికి ఆధునిక ఆలోచనా విధానాలతో పాటు ఆధ్యాత్మిక చైతన్యాన్ని అందించిన పుణ్యభూమి పశ్చిమ బెంగాల్ అని గవర్నర్ కితాబిచ్చారు.రాజా రామమోహన్ రాయ్, స్వామి వివేకానంద, మహర్షి అరవిందో వంటి మహనీయులు దేశ సాంస్కృతిక పునరుజ్జీవనానికి పునాదులు వేశారని గుర్తు చేశారు.
