హైదరాబాద్, వెలుగు: ‘వికసిత్ భారత్–2047’ లక్ష్య సాధనలో నషా ముక్త్ భారత్ అభియాన్ కీలక ప్రజా ఉద్యమమని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. ఆరోగ్యవంతమైన, చైతన్యవంతమైన యువతతోనే ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. మంగళవారం లోక్‌భవన్‌లో రాష్ట్ర యూనివర్సిటీల వీసీలతో సమావేశమైన ఆయన.. నషా ముక్త్ భారత్ కార్యక్రమాల్లో వర్సిటీలు కీలక పాత్ర పోషించాలని సూచించారు.
మై భారత్, రెడ్‌క్రాస్ నమోదుపై దృష్టి
మై భారత్ పోర్టల్‌లో యువత నమోదును మిషన్ మోడ్‌లో చేపట్టి రాష్ట్రానికి నిర్దేశించిన లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని వీసీలను ఆదేశించారు. ప్రతి యూనివర్సిటీలో రోజువారీ సమీక్షతో పాటు కాలేజీల్లో నోడల్ అధికారులు, స్టూడెంట్ అంబాసిడర్లను నియమించి నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు. తెలంగాణకు 14.90 లక్షల మంది యువత నమోదే లక్ష్యమని, ఇప్పటివరకు 4.04 లక్షల నమోదు పూర్తయిందన్నారు. నషా ముక్త్ భారత్ ప్రతిజ్ఞలో రాష్ట్రానికి 2.73 లక్షల లక్ష్యం ఉండగా ఇప్పటివరకు 91 వేలకుపైగా ప్రతిజ్ఞలు నమోదయ్యాయని తెలిపారు.
గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దానకిషోర్ మాట్లాడుతూ.. ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీలో మూడు నెలల్లో 60 వేలకుపైగా కొత్త సభ్యులు చేరారని, ఈనెల 15 నాటికి యూనివర్సిటీల నుంచి మరో 16 వేల మంది సభ్యుల నమోదే లక్ష్యమన్నారు. అనంతరం నషా ముక్త్ భారత్ ప్రచార పోస్టర్లను గవర్నర్ ఆవిష్కరించారు. కాగా, లోక్‌భవన్‌లో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. గవర్నర్ దంపతులు అమ్మవారికి బోనం, పట్టు వస్త్రాలు సమర్పించారు.
