8 ఏళ్లుగా వర్సిటీల్లో రిక్రూట్మెంట్స్ ఎందుకు చేయలే: గవర్నర్

8 ఏళ్లుగా వర్సిటీల్లో రిక్రూట్మెంట్స్ ఎందుకు చేయలే: గవర్నర్

విశ్వవిద్యాలయాల్లో ఉద్యోగ నియామకాల భర్తీని పర్యవేక్షించే ‘కామన్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు’ ఏర్పాటుకు ఉద్దేశించిన బిల్లుపై  రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసై లేఖ రాశారు.  రాజ్ భవన్ కు వచ్చి ఈ బిల్లు గురించి తనతో చర్చించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రికి ఆమె సూచించారు. గత 8 సంవత్సరాలుగా వర్సిటీల్లో రిక్రూట్మెంట్స్ ఎందుకు చేయలేదో చెప్పాలని ప్రశ్నించారు. రిక్రూట్మెంట్స్ చేస్తే ఎలా చేస్తారు ? లోకల్ అభ్యర్థులకు ఎంతమేరకు ప్రాధాన్యత ఉంటుంది ? కేటగిరీల విభజన ఎలా ఉంటుంది ? అనే అంశాలపై రాష్ట్ర సర్కారును గవర్నర్ వివరణ కోరారు. యూజీసీ గైడ్ లైన్స్ ప్రకారం రిక్రూట్మెంట్స్ చేయాల్సిన అవసరం ఉందని లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.

మధ్యలో ఎన్నికల కోడ్ వస్తే వర్సిటీల్లో నియామక ప్రక్రియలు నిలిచిపోయే అవకాశం ఉందని గవర్నర్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘కామన్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు’ ఏర్పాటుకు సంబంధించిన అంశంపై గవర్నర్ తమిళిసై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ)కి కూడా లేఖ రాశారు.యూనివర్సిటీల ఉద్యోగ ఖాళీలను కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేయడం చెల్లుబాటు అవుతుందా ?  కాదా ?  అనే దానిపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) అభిప్రాయాన్ని కూడా గవర్నర్ కోరారు. 

వాస్తవానికి కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు బిల్లును వర్షాకాల సమావేశాల సందర్భంగా సెప్టెంబరు 13నే రాష్ట్ర శాసనసభ, శాసనమండలి ఏకగ్రీవంగా ఆమోదించింది.  ఆ తర్వాత దాన్ని అసెంబ్లీ సచివాలయం నుంచి గవర్నర్‌ ఆమోదానికి పంపారు.  సాధారణంగానైతే ఉభయసభలు ఆమోదించిన బిల్లులపై గవర్నర్‌ వారంలోగా సంతకం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపుతారు. అనంతరం న్యాయశాఖ గెజిట్లు విడుదల చేయగానే ఆ బిల్లులు అమల్లోకి వస్తాయి.