ఇయ్యాల చెంచు పేటల్లో గవర్నర్ పర్యటన

ఇయ్యాల చెంచు పేటల్లో గవర్నర్ పర్యటన
  • పైలట్ ప్రాజెక్టుగా రెండు పేటల ఎంపిక
  • సమస్యల పరిష్కారమే లక్ష్యం
  • కోళ్ల పెంపకం, హార్టికల్చర్ లో శిక్షణ

హైదరాబాద్: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నల్లమల చెంచు పేటల్లోపర్యటించబోతున్నారు. పేటలను దత్తత తీసుకున్న గవర్నర్ ... వారి సమస్యలపై మరింత ఫోకస్ పెట్టనున్నారు. అంతరించిపోతున్న ఆదిమ చెంచు జాతి పరిరక్షణ కోసం చెంచు పేటల్లో ప్రత్యేక కార్యక్రమాలు మొదలుపెట్టారు. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ప్రభుత్వ శాఖల సమన్వయంతో చెంచులకు అందించేందుకు రూపకల్పన చేసిన సంక్షేమ కార్యక్రమాల అమలుపై గవర్నర్ ఫోకస్ పెట్టనున్నారు.

నల్లమల చెంచు పేటల్లో గవర్నర్ తమిళిసై పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. నాగర్ కర్నూల్ జిల్లాలోని అప్పాపూర్ చెంచు పేటల్లో పర్యటించి, చెంచుల సమస్యలను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకోనున్నారు. పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. పోషకాహార లోపంతో బాధపడుతున్న నల్లమల చెంచులను కాపాడేందుకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దృష్టిపెట్టారు. పైలట్ ప్రాజెక్ట్ కింద నల్లమలలోని  అప్పాపూర్ , భౌరాపూర్  చెంచు పేటలను  దత్తత తీసుకున్నారు. 

చెంచు పేటలు... అనేక సమస్యలకు నిలయాలు
చెంచుల జీవన శైలి, ఆహారపు అలవాట్లు, అనారోగ్య సమస్యలు, ఉపాధి, ఆదాయ మార్గాలు, మహిళ – శిశు ఆరోగ్యం, సంరక్షణ ఇలా అనేక అంశాలపై జాతీయ పోషకార సంస్థ రీసెర్చ్ నిర్వహించింది. చెంచు పేటలు – చెంచులపై జరిగిన ఈ రీసెర్చ్ లో అనేక వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. పోషకాహార లోపం, అనారోగ్య సమస్యలు, చిన్న వయసులో పెళ్లిళ్లు, ప్రసవాలు,  అతి తక్కువ ఆయు ప్రమాణం, 40-50 ఏళ్ల మధ్యే మరణాలు సంభవించటం, మాతా శిశు మరణాలు వంటి సమస్యలు చెంచుజాతి ఉనికి ప్రశ్నార్థకం చేస్తున్నాయి. 

కోళ్ల పెంపకం, హార్టికల్చర్ లో శిక్షణ
చెంచుల సమస్యలకు సరైన పోషకాహారం లేకపోవటమే కారణమని ఎన్.ఐ.ఏ గవర్నర్ కు నివేదిక అందజేసింది. రెడ్ క్రాస్ సంస్థ సహకారం తో ప్రభుత్వ శాఖల చొరవతో చెంచు పేటల్లో వివిధ కార్యక్రమాలకు రూపకల్పన చేసారు. ఇందులో వెటర్నరీ ద్వారా కోళ్లు, హార్టికల్చర్ ద్వారా పండ్ల తోటల పెంపకం చేపట్టాలని భావిస్తున్నారు. అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని 10 పేటల్లో సుమారు 200 చెంచు కుటుంబాలు నివసిస్తున్నాయి. వీటిలో అప్పాపూర్, బౌరాపూర్, రాంపూర్, ఆగర్లపెంట, పుల్లయ్యపల్లి, మేడిమాకుల, ఈర్లపెంట, వేములపాయవాగు, సంగిడిగుండాల, లింగభేరి ఉన్నాయి. ఇందులో అప్పాపూర్, భౌరాపూర్ పెంటలను గవర్నర్ దత్తత తీసుకుని పైలట్ ప్రాజెక్ట్ కింద కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. ఒక్కో ఫ్యామిలీకి 10 రాజశ్రీ కోళ్లను పంపిణీ చేసారు. వీటి పెంపకంపై అవగాహన కల్పించి కావలసిన దాణా, మందులు వెటర్నరీ అధికారులు అందజేసారు. కోళ్లు పెంచుతూ వాటి ద్వారా రెగ్యులర్ గా వచ్చే గుడ్లను వారికి అందిస్తూ చెంచుల్లో పోషక విలువలు పెంచాలన్నది ఈ కార్యక్రమ ఉద్దేశం. మామూలు కోళ్ల కంటే రాజశ్రీ కోళ్ల ద్వారా రెగ్యులర్ గా గుడ్లు ఇవ్వడం, పోషకాలు ఎక్కువగా ఉండటం వల్ల వీటిని నల్లమల చెంచు కుటుంబాలకు అందించారు.

ఆరోగ్య వసతులు కరువు
చెంచుల ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోంది. సరైన ఆహారం లేకపోవటమే ఇందుకు ప్రధాన కారణం. ఆయు ప్రమాణం 40-45 మధ్యలో ఉంటోంది. ఒకప్పుడు బలిష్ఠంగా, దృఢంగా ఉండే చెంచులు, ఇపుడు పలుచబడిపోయారు. చెంచుల ఆహారపు అలవాట్లలో కాలక్రమేణ పోషక విలువలు లోపిస్తూ వచ్చాయి. జంతువుల వేట జీవనాధారంగా ఉండేది. అటవీ - వన్యప్రాణి సంరక్షణ చట్టాలతో జంతువుల వేట నిషేధించబడింది. అటవీ ఫల సేకరణ, వస్తు మార్పిడి ద్వారా వచ్చే చాలీచాలని రేషన్ సరుకులతో కుటుంబమంతా కాలం వెల్లదీయటం పరిపాటిగా మారింది. పోషకాలు, విటమిన్లు అందక బలహీనంగా మారిపోతున్నారు. ఐరన్, క్యాల్షియం లోపం తో మహిళలు, చిన్నారులు బాధపడుతున్నారు. రక్తహీనత, ఇతర దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. దీనికి తోడు సీజన్ మారిన ప్రతిసారి విషజ్వరాలు, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటి అనారోగ్య సమస్యలూ తోడవుతున్నాయి. అత్యవసర వైద్యం అందక ఎంతో మంది చెంచులు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు అనేకం. అడవి జంతువుల బెడద, విష సర్పాలు, క్రూర మృగాల బారిన పడి చెంచులు మరణిస్తున్నారు. దీనికి తోడు మద్యం వ్యసనంగా మారి చెంచులు అనారోగ్యాల బారిన పడుతున్నారు. అడవి కుచించుకుపోయి, ఉపాధి లేక ఇప్పటికే నల్లమలలో అనేక చెంచు పేటలు అంతరించిపోయాయి. చెంచు జనాభా క్రమంగా తగ్గిపోవటంతో మిగిలిన ఒకటి రెండు కుటుంబాలు సైతం ఇతర పేటల్లో స్థిరపడ్డారు. పందిబొర్రె లో మిగిలిన ఒకటో రెండో కుటుంబాలు మేడిమాకులకు, వేములపాయవాగు నుంచి ఈర్లపెంట కు, లింగబేరి నుంచి సంగిడిగుండాలకు, దోరాలపెంట నుంచి పుల్లయ్యపల్లి కి చెంచులు స్థిరపడ్డారు. పందిబొర్రె , వేములపాయవాగు , లింగబేరి , దోరాలపెంటలు ఖాళీ అయ్యాయి.

భవిష్యత్ లో మరిన్ని పేటల్లో...
చెంచులకు శిక్షణ ఇచ్చి సక్సెస్ సాధించేలా ప్రోత్సహించడం ద్వారా మిగతా పేటల్లో అమలు చేయాలన్నది ఈ పథకం ఉద్దేశం. ఇలాంటి కార్యక్రమాల ద్వారా అవసాన దశలో ఉన్న చెంచు జాతిని కాపాడేందుకు ప్రభుత్వ శాఖలను భాగస్వామ్యం చేస్తున్నారు. వీటి ద్వారా చెంచుల జీవితాల్లో మార్పు తేవాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఉద్దేశం. పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైతే కేంద్రానికి ప్రతిపాదనలు పంపి మిగతా అన్ని చెంచు పెంటల్లో ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించాలని భావిస్తున్నారు. గవర్నర్ పర్యటనతో చెంచు పేటల దుస్థితికి, చెంచుల సమస్యల పరిష్కారానికి ఓ అవకాశం ఏర్పడింది.

మరిన్ని వార్తలకోసం...

గ్రామపంచాయతీలకు కేంద్రం కొత్త అకౌంట్లు

పీఈటీ పోస్టులన్నీ నింపాలె