పీఈటీ పోస్టులన్నీ నింపాలె

పీఈటీ పోస్టులన్నీ నింపాలె

విద్యార్థులకు చదువుతోపాటు ఆటలూ ఉండాల్సిందే. అప్పుడే వారి ఆల్​రౌండ్​డెవలప్​మెంట్​సాధ్యమవుతుంది. కానీ రాష్ట్రంలో గురుకులాలు మినహా సాధారణ బడుల్లో క్రమంగా ఆటల ప్రాధాన్యత తగ్గుతూ వస్తోంది. ప్రభుత్వం కూడా ఫిజికల్​ఎడ్యుకేషన్​పై పెద్దగా దృష్టి పెట్టడం లేదు. దీంతో పీఈటీలు లేక స్కూళ్లలో పిల్లలకు ఆటలాడించే వారే లేకుండా పోతున్నారు. ఆటలు మానసిక ఉల్లాసాన్నే గాక విద్యార్థులకు గెలుపు ఓటములను సమానంగా తీసుకునే వ్యక్తిత్వాన్ని డెవలప్​చేస్తాయి. నాయకత్వ లక్షణాలు మెరుగుపరుస్తాయి. కాబట్టి ప్రతి స్కూలులో సరైన పద్ధతిలో ఆటలు ఆడిస్తూ.. మెరికల్లాంటి స్టూడెంట్లను రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడాకారులుగా తయారు చేసే పీఈటీలను నియమించాలె. ప్రస్తుత రిక్రూట్​మెంట్​డ్రైవ్​లో రాష్ట్రంలో ఉన్న అన్ని పీఈటీ ఖాళీ పోస్టులను భర్తీ చేయడంతోపాటు అన్ని స్కూళ్లలో వ్యాయామ విద్య ఉపాధ్యాయుడు ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అప్పుడే విద్యార్థులు విద్యతోపాటు ఆటల్లోనూ రాణించగలుగుతారు.

లక్షల సంఖ్యలో ఉద్యోగార్థులు
ప్రతి స్కూలులో పీఈటీ అవసరం ఉంటుందనే ఇప్పటికే లక్షలాది మంది అభ్యర్థులు ఫిజికల్​ఎడ్యుకేషన్ లో డిప్లొమాలు, బ్యాచిలర్​డిగ్రీలు కంప్లీట్​చేసి ఉన్నారు. అయితే ప్రభుత్వం అన్ని ఖాళీలను గుర్తించకపోవడంతోపాటు ఉన్న పోస్టులను కూడా సమయానికి నింపకపోతుండటంతో కోర్సు పూర్తి చేసిన వారికి అన్యాయం జరుగుతోంది. ఎంతో మంది మహిళా అభ్యర్థులు కూడా నోటిఫికేషన్​కోసం ఎదురు చూస్తున్నారు. పిల్లలను చిన్నప్పటి నుంచే దృఢంగా తయారు చేసి ఆర్మీ, పోలీస్​డిపార్ట్​మెంట్​లకు ఎంపిక చేయడంలో పాఠశాల స్థాయిలో పీఈటీల పాత్ర ఎంతో ఉంటుంది. నేటి విద్యార్థులను బలమైన భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే కీలక పోస్టులపై ప్రభుత్వ చిన్నచూపు సరికాదు. అకడమిక్​ఎడ్యుకేషన్​తోపాటు ఆటలు, ఇతర సహపాఠ్య కార్యక్రమాలపైనా ప్రభుత్వం దృష్టి సారించాలి. 

గ్రౌండ్​లు కూడా లేవు..
ఏపీతో పోలిస్తే తెలంగాణాలో పీఈటీలు, క్రీడా మైదానాలు లేని ప్రభుత్వ పాఠశాలలు చాలా ఎక్కువ. దాదాపు సగం ప్రభుత్వ పాఠశాలలకు ఆడుకోవడానికి సరైన మైదానాలు లేవు. దాదాపు 90 శాతం ప్రైవేటు పాఠశాలల్లోనూ గ్రౌండ్లు లేవు. ఉన్నత పాఠశాలల్లో మాత్రమే వ్యాయామ ఉపాధ్యాయులను నియమించాలన్న ఉమ్మడి రాష్ట్రంలోని నిబంధననే కొత్త రాష్ట్రాల్లోనూ కొనసాగిస్తున్నారు. దీంతో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల విద్యార్థులకు వ్యాయామ విద్య అందడం లేదు. వ్యాయామాన్ని అకడమిక్‌‌‌‌ సిలబస్‌‌‌‌లో భాగం చేయాలని 2002లో ఉమ్మడి ప్రభుత్వంలో ఉత్తర్వులు జారీ అయినా.. అమలుకు నోచుకోలేదు. పటిష్ట స్పోర్ట్స్‌‌‌‌ పాలసీ రూపొందించాలని జీవో వచ్చినా ఫలితం లేకుండా పోయింది. విద్యార్థి సక్రమ మార్గంలో నడిచేలా చేయడంలో కీలక పాత్ర పోషించే పీఈటీలపై ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయి. ఇప్పటికైనా బడుల్లో వ్యాయామానికి ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు విద్యార్థుల సంఖ్యను బట్టి పీఈటీలను నియమించాలి. తెలంగాణలో ప్రభుత్వ వ్యాయామ విద్యా కళాశాలలను ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది. 
- ముచ్కుర్ సుమన్ గౌడ్, సామాజిక కార్యకర్త