రోహిత్ వేముల, పాయల్ తాడివిల తల్లులు హయ్యర్ ఎడ్యుకేషన్ సంస్థలలో విద్యార్థులు చేసుకుంటున్న ఆత్మహత్యలను అడ్డుకోవడానికి యూనివర్సిటీల రెగ్యులేట్ చేసే వ్యవస్థను ఏర్పాటు చేయాలని 2019లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దాంతో 2012 యూజీసీ రెగ్యులేషన్స్ ఎఫెక్టివ్‌గా లేనందున సుప్రీంకోర్టు నిర్దేశానుసారం జనవరి 13, 2026న యూజీసీ ఈక్విటీ రెగ్యులేషన్స్‌ను తీసుకురావడం జరిగింది. రెండు రెగ్యులేషన్స్‌లో పెద్దగా తేడా లేదు. 2012 యూజీసీ నిబంధనలలో ఎస్సీ, ఎస్టీ, స్త్రీలు, దివ్యాంగులకు జరుగుతున్న అవమానాలతోపాటు 2026 యూజీసీ ఈక్విటీ నిబంధనలలో ఓబీసీలను చేర్చడం జరిగింది. దీంతో ఉత్తర భారతం భగ్గుమన్నది.
దీంతో రిజర్వేషన్ వర్గాలు మెజారిటీగా మారి వారి అధికారానికి పర్మినెంట్‌గా అడ్డుకట్ట వేస్తారని భావించి, నిబంధనలను వెనకకు తీసుకోవాలని కోరుతూ జైపూర్‌లో కర్ని సేన, బ్రాహ్మణ మహాసభ, కాయస్థ మహాసభ, బనియా సంఘటనలు, (ఎస్4) సంఘటితమై.. బీజేపీ నాయకత్వంతో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బిహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్లో వీధుల్లోకి రావడం జరిగింది. ముఖ్యంగా సవర్ణుల నాయకత్వంలో ప్రధానమంత్రి మోదీని, కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను అవమానపరుస్తూ వీధుల్లో పలు ప్రదర్శనలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వంపై తిరగబడడంతోపాటు కోర్టుకు వెళ్లడంతో సుప్రీంకోర్టు 2026 యూజీసీ రెగ్యులేషన్స్‌పై స్టే విధించింది. కానీ, 2012 యూజీసీ రెగ్యులేషన్స్‌ను కొనసాగించాలని ఆదేశాలను జారీ చేసింది.
దీంతో ఫూలే, అంబేద్కర్ వాదులైన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులు రోడ్ల మీదకు వస్తున్నారు. ముఖ్యంగా బిహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో యూనివర్సిటీల నుంచి జిల్లాస్థాయి వరకు విద్యార్థులు ప్లకార్డులు పట్టుకొని కదులుతున్నారు. విద్యార్థుల చేతుల్లో సోషలిస్టు/ సమాజ్‌వాది ఉద్యమ నాయకులైన కర్పూరి ఠాకూర్, జగదేవ్ ప్రసాద్ కుష్వాల ఫొటోలతో కులతత్వ నిలయాలుగా మారిన పాలనా సంస్థలను ప్రశ్నిస్తూ నినదిస్తున్నారు. 2026 యూజీసీ ఈక్విటీ రెగ్యులేషన్స్‌ను కొనసాగించాలని, సామాజిక న్యాయం కోసం, రాజ్యాంగ చైతన్యంతో ఉత్తర భారతం కదులుతోంది. ప్రోగ్రెసివ్ కేంద్రాలుగా ఉండాల్సిన యూనివర్సిటీలలో సవర్ణ విద్యార్థుల కులతత్వ ప్రవర్తనను ప్రశ్నిస్తున్నారు.
ఆత్మగౌరవం, సమానత్వం
రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లతో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులను 'కోటా' విద్యార్థులని అవహేళన చేస్తున్నారని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. సవర్ణ విద్యార్థులు స్నేహంలోనూ, ప్రేమించడంలోనూ కులతత్వాన్ని ప్రదర్శిస్తున్నారని ఢిల్లీ యునివర్సిటీ విద్యార్థులు చెబుతున్నారు. మేం ఎదిగిన కులంవారమని, మీ అంతు తేలుస్తామని ఎస్సీ, బీసీ విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. దళిత విద్యార్థులను చులకన చేసి మాట్లాడడం ఇకపై సహించమని సామాజిక న్యాయ యోధులుగా విద్యార్థులు ముందుకు వస్తున్నారు.
ముస్లింలను చూడగానే ముల్లాగా బ్రాండ్ వేయడం దురదృష్టకరంగా ఉందని విద్యార్థులు భావిస్తున్నారు. రాజ్యాంగ ఆర్టికల్ 15 లో భాగంగా కుల, స్త్రీ, పురుష భేద భావాలకు వ్యతిరేకంగా 2026 యూజీసీ ఈక్విటీ నిబంధనలను కొనసాగించాలని విద్యార్థులు ఉద్యమిస్తున్నారు. ఇలాంటి కించపరిచే భావజాలం విద్యార్థుల మనోభావాన్ని దెబ్బతీస్తుంది. సమానత్వం కోరుకునే విద్యార్థులు ఇకపై సహించమంటూ ఉత్తరభారతం ఉద్యమిస్తోంది.
డిస్క్రిమినేషన్‌కు వ్యతిరేకంగా పోరాటం
హిస్టారికల్‌గా ఒనగూడిన 'సోషల్ క్యాపిటల్' ఆధారంగా సామాజిక మార్పు కోరుకునే విద్యార్థులను అవమానించడం దురదృష్టకరం. అందుకే అంబేద్కర్ ఎక్స్క్లూషన్పై చేసిన పోరాటం ఆధారంగా 1990లో మండల్-1 ఉద్యమం దేశవ్యాప్తంగా జరిగితే ఓబీసీ గుర్తింపు వచ్చింది. అదేవిధంగా 27% రిజర్వేషన్లు ఉద్యోగాలలో ఓబీసీలు పొందారు. తరువాత 2006లో కేంద్ర విద్యా సంస్థలలో, ఐఐటీ, ఐఐఎంలలో కూడా రిజర్వేషన్లు పొందగలిగారు. ఆనాడు డిస్క్రిమినేషన్‌కు వ్యతిరేకంగా పోరాడి అంబేద్కర్ అందించిన చైతన్యాన్ని తీసుకొని ఈనాటి విద్యార్థులు వివక్ష వ్యతిరేక ఉద్యమాన్ని మండల్-2 గా చూడడం జరుగుతుంది.
కుల నిర్మూలన విద్యతోపాటు, కుల వ్యతిరేక పోరాటం జరిగినప్పుడే కుల నిర్మూలన సాధ్యమవుతుందని అంబేద్కర్ చెప్పడం ఈ ఉద్యమానికి పునాది అవుతుంది. భారత్ యూనిటీ సాధిస్తుంది. ఎస్-4 తీసుకువచ్చిన కులాధిపత్య స్పృహను హిందీ, ఇంగ్లిష్ టీవీ చానల్స్ యాంకర్లు 'హిందూ ఏకతా' పేరుమీద లొల్లి పెడుతున్నారు. పాలనావ్యవస్థను ప్రశ్నిస్తున్నారు. బీజేపీ చేసిన తప్పిదంగా ప్రచారం చేస్తున్నారు. సమానత్వ ఉద్యమాన్ని అవహేళన చేస్తున్నారు.
కులాల మధ్య సమానత్వాన్ని కులతత్వంగా చిత్రీకరిస్తున్నారు. రాజ్యాంగ లక్ష్యసాధనకు తీసుకువచ్చిన మండల్ కమిషన్ రిపోర్టును కులతత్వాన్ని పెంచేదిగా మాట్లాడుతున్నారు. అంబేద్కర్ కుల నిర్మూలనను వక్రీకరిస్తూ 24/7 మీడియాలో చర్చిస్తున్నారు. ఓబీసీల పట్ల ఇంత అసహనం సరైంది కాదు. రాజ్యాంగం కోరుకునే సమానత్వాన్ని వీరు కాలరాస్తున్నారు. మీడియాలో ఉన్న అగ్రకుల తత్వాన్ని మార్చకుండా దేశాన్ని మార్చడం సాధ్యం కాదేమో అనిపిస్తుంది.
కులతత్వంపై విద్యార్థుల ప్రశ్నలు
వికృతంగా విస్తరిస్తున్న కులతత్వంపై విద్యార్థులు పలు ప్రశ్నలను అడుగుతున్నారు. 79 సంవత్సరాల స్వాతంత్ర్యం ఎవరిని బలోపేతం చేసిందని అడుగుతున్నారు. రాజకీయ వ్యవస్థ పూర్తిగా అగ్రకుల వ్యవస్థగా మారడంతో న్యాయవ్యవస్థ, పాలనా వ్యవస్థ, అభివృద్ధి రంగాలు, సామాజిక చైతన్యం పూర్తిగా ఎదిగిన కుల నాయకుల కబ్జాలుగా మారాయి. 45 కేంద్ర విశ్వవిద్యాలయలలోని వీసీలను చూస్తే ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఏడుగురు బీసీలు తప్ప మిగిలినవారందరూ ఎదిగిన కులాలకే చెందడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నిస్తున్నారు. యూనివర్సిటీ టీచర్లను చూస్తే 85% ప్రొఫెసర్లు, 82% అసోసియేట్ ప్రొఫెసర్లు అగ్రకులాలకు చెందినవారే. మరి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు స్థానం లేదా.
'నాట్ ఫౌండ్ సూటబుల్'తో ఎన్నాళ్ళు ఎస్సీ, ఎస్టీ, బీసీలను అడ్డుకుంటారు? నియామకం చేసే వ్యవస్థలో మొత్తం అగ్రకులాలే ఉండడంతో ఈ ఘోరాలన్నీ జరుగుతున్నాయి. రీసెర్చ్ విద్యార్థుల పీహెచ్డీ టాపిక్ లు సరైనవికావు అంటూ వేధిస్తున్నారు. విద్యార్థులను ముందుకు నడిపించాల్సిన ప్రొఫెసర్లు కులం పేరుతో దూషిస్తూ అవమానపరుస్తూ రావడంతో ఆత్మహత్యలు, డ్రాపౌట్లు పెద్దఎత్తున పెరుగుతున్నాయి. హయ్యర్ జ్యుడీషియరీలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు ఎందుకు లేరని ప్రశ్నిస్తున్నారు. హయ్యర్ బ్యూరోక్రసీలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఐదు శాతం కూడా లేని దుస్థితికి ఈ దేశం ఎందుకు చేరిందని విద్యార్థులు వాదిస్తున్నారు.
కులగణనను అడ్డుకునే వ్యూహం
మైనింగ్, ఇండస్ట్రీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రియల్ ఎస్టేట్ లతోపాటు అన్ని వ్యవస్థలలో సవర్ణులే ఎందుకు ఉన్నారని ప్రశ్నిస్తున్నారు. మీడియా రంగంలోని ఉన్నత పదవులలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఎందుకులేరని వాదిస్తున్నారు. ఇది బలంగా ఉత్తర భారతదేశంలో జరుగుతున్న వ్యవహారమే కాదు. ఇది పెద్ద ఎత్తున వ్యాపించి అన్ని రాష్ట్రాలను ఈ కులతత్వ వ్యాధి కబలించింది. జాతీయస్థాయిలో బ్రాహ్మణ, బనియాల రూపంలో కులతత్వం ముందుకు వస్తుంటే, దక్షిణాన అగ్రవర్ణ శూద్రుల కేంద్రంగా మాత్రమే కనిపిస్తున్నది. కులతత్వం అనేది దేశాన్ని పీడిస్తున్న రుగ్మత.
రాజ్యాంగ స్పృహ, రాజ్యాంగవాదాన్ని జాతీయవాదంగా మార్చనిచో ఈ దేశంలోని ఎదిగిన కుల నాయకుల చేతులలో వెనుకబాటుతనాన్ని పెర్మనెంటుగా పెంచి పోషిస్తూనే ఉంటారా? రెండో అంశం కులగణనకు సంబంధించింది. ఒకవైపు కులగణనలో ఓబీసీ, జనరల్ కులాల వివరాలను ఇతరులుగా చేర్చి కులగణనను అడ్డుకునే వ్యూహం జరుగుతుంది. సవర్ణ సంఘాలు, ఆర్ఎస్ఎస్, బీజేపీ ప్రతి ఎన్నికల ముందు ఏదో ఒక వ్యూహంతో ఓబీసీలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. 2014 ఎన్నికల ముందు ఓబీసీ ప్రధానమంత్రి అనే నినాదంతో దేశ అధికారాన్ని చేపట్టారు.2019 ఎన్నికల ముందు ఈడబ్ల్యూఎస్ చట్టంతో రాజ్యాంగాన్ని సవరించి అగ్రకులాలను ఐక్యం చేసి రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు.
కులతత్వానికి విరుగుడు రాజ్యాంగవాదమే
2024 ఎన్నికల ముందు సామాజిక న్యాయం, కులగణన రిజర్వేషన్లను, రాజ్యాంగవాదాన్ని బలంగా రాహుల్, అఖిలేశ్ ఎంచుకోవడంతో అగ్రకులాలను బలోపేతం చేయడానికి బీజేపీ కులగణన మీద తిరగబడ్డారు. దుష్ప్రచారానికి తెరలేపారు. అందులో భాగంగా కులగణనను అవహేళన చేస్తూ ప్రచారం చేశారు. ప్రధానమంత్రి కులగణన చేస్తే మీ ఆస్తులు గుంజుకుంటారని, బర్రెలను ఎత్తుకుపోతారని, ప్లాట్లు ఉంటే తీసేసుకుంటారని, మంగళసూత్రాన్ని కూడా గుంజేస్తారనే ప్రచారాన్ని దేశం ముందుకు తీసుకొచ్చారు.
అయినప్పటికీ కులగణన ఇండియా అలయన్స్ ఎజెండాలో భాగంగా దేశాన్ని ప్రభావితం చేయడంతో వారు ఆశించిన మెజారిటీని పొందలేకపోయారు. ముఖ్యంగా రాజ్యాంగవాదన, కులగణన, రిజర్వేషన్ ప్రచారాలు ఉత్తర ప్రదేశ్ బహుజన బీసీ వర్గాలను ప్రభావితం చేయడంతో బీజేపీ మెజారిటీకి దూరంగా నిలిచిపోయింది. వారు ఎన్ని ఎత్తులు వేసినా చివరకు వారనుకున్న మెజారిటీతో కూడిన అధికారాన్ని సాధించలేకపోయారు.
కులతత్వానికి విరుగుడు రాజ్యాంగవాదమే
ఆర్టిఫిషియల్‌గా ముందుకు తీసుకువచ్చిన యూజీసీ ఈక్విటీ నిబంధనల వ్యతిరేక ఉద్యమం మళ్లీ అగ్రకులాలను ఐక్యం చేసేదిగా ఉన్నట్లు కనిపిస్తోంది. కులతత్వానికి విరుగుడు రాజ్యాంగవాదమే. రాజ్యాంగ జాతీయతను నిర్మించుకున్నప్పుడే అన్ని కులాలు ఐక్యతతో జాతిని నిర్మించుకోవచ్చు. భారతజాతిని బలోపేతం చేసుకోవచ్చు. అయినప్పటికీ అన్ని కులాలను సమంగా అధికారంలోకి నడిపించాల్సిన బాధ్యత ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, ఎదిగిన కుల ప్రజాస్వామికవాదులదే!
- ప్రొఫెసర్ సింహాద్రి సోమనబోయిన,
రాష్ట్ర అధ్యక్షుడు,
సమాజ్‌వాది పార్టీ, తెలంగాణ
