వెలుగు ఓపెన్ పేజ్: గవర్నర్ల వాకౌట్లు రాజ్యాంగబద్ధం కావు

వెలుగు ఓపెన్ పేజ్: గవర్నర్ల వాకౌట్లు రాజ్యాంగబద్ధం కావు

ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలలో శాసనసభని ఉద్దేశించి గవర్నర్​ చేసే  సంప్రదాయ  ప్రసంగం ఇటీవల కాలంలో ఏదో ఒక అనుచితమైన సంఘటన జరగకుండా పూర్తికావడం లేదు.  రాజ్​భవన్​కి, కాంగ్రెస్​ నేతృత్వంలోని కర్నాటక ప్రభుత్వం మధ్య జరిగిన తాజా ఘర్షణలో గవర్నర్​ థావర్​చంద్​ గెహ్లాట్..​ గత నెలలో  రాష్ట్ర అసెంబ్లీలో  చేసే  సంప్రదాయ  ప్రసంగంలోని కొన్ని భాగాలను  చదవడానికి  నిరాకరించి,   ప్రభుత్వం రూపొందించిన ప్రసంగంలో  ‘జీ రామ్​ జీ’ లా గురించి ప్రస్తావించడాన్ని వ్యతిరేకిస్తూ సభ నుంచి వాకౌట్​ చేశారు. 

తమిళనాడు గవర్నర్​ ఆర్ఎన్​ రవి ప్రసంగం చేయకుండానే సభ నుంచి వాకౌట్​ చేసిన ఒకరోజు తరువాత  జరిగిన  సంఘటన ఇది.  తన ప్రసంగ పాఠంలో  తప్పులు ఉన్నాయని ఆరోపిస్తూ ఆయన వాకౌట్​ చేశారు. ఇదేవిధంగా  కేరళ గవర్నర్​ రాజేంద్ర విశ్వనాథ్​ ఆర్లేకర్​ తన ప్రసంగ పాఠంలోని కొన్ని  భాగాలను  విస్మరించారు.  గవర్నర్​ సూచించిన మార్పులను  ప్రభుత్వం చేయలేదని రాజ్​భవన్​ నుంచి వివరణ వచ్చింది.  ఈ అందరి చర్యల వల్ల గవర్నర్​అధికార పరిధి చర్చ మళ్లీ మొదలైంది. 

రాజ్యాంగ నిబంధనలు

రాజ్యాంగ నిబంధనల ప్రకారం, సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం శాసనసభలని ఉద్దేశించి  గవర్నర్​ ప్రసంగించడం అనేది ఒక సంప్రదాయం. అయితే మంత్రిమండలి సలహామేరకు,  మంత్రిమండలి ఆమోదించిన  ప్రసంగాన్నే ఆయన చదవాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఆయనకు ఎలాంటి విచక్షణాధికారం లేదు.  రాజ్యాంగంలోని ఆర్టికల్​ 176  ప్రకారం ప్రతి సంవత్సరం మొదటి సెషన్​ ప్రారంభంలో ఉభయసభలను ఉద్దేశించి, శాసనసభని పిలవడానికి గల  కారణాలను  తెలియజేస్తూ  గవర్నర్​ ప్రసంగించాల్సి ఉంటుంది. ఈ విధంగా స్పందించడం గవర్నర్​ రాజ్యాంగ విధి. 

ఎన్నికైన ప్రభుత్వం తన పాలసీని ఈ ప్రసంగం ద్వారా తెలియజేస్తుంది.  ఆర్టికల్​ 175 ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించడాన్ని,  బిల్లులుకు  సంబంధించి తన సందేశాలను  పంపడానికి గవర్నర్​కి అధికారం ఇస్తుంది. ఈ విషయంలో కూడా  గవర్నర్​కు  విచక్షణాధికారం  ఉండదు.  మంత్రిమండలి  సలహాకు లోబడి  ఉండాల్సి ఉంటుంది.  ఆర్టికల్​ 163 ప్రకారం  రాజ్యాంగం  ప్రత్యేకంగా చెప్పిన విషయాలలో తప్ప మిగతా అన్ని విషయాలలో గవర్నర్​ మంత్రిమండలి  సలహామేరకే  తన విధులను నిర్వర్తించాల్సి ఉంటుంది.  గవర్నర్​కి  నిరంకుశ అధికారం లేదు. రాజ్యాంగ అధిపతిగా  బాధ్యతలు  ఏర్పరిచారు. గవర్నర్​ తటస్థంగా  ఉండాలి. రాజకీయ నాయకుడిగా కాదు. 

గవర్నర్​ గురించి కమిటీల సిఫార్సులు

గవర్నర్​అనే వ్యక్తి కేంద్రానికి ఏజెంట్​ కాదు. క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఫెడరలిజం స్ఫూర్తిని కాపాడాలని  సర్కారియా కమిషన్​ నొక్కి చెప్పింది. రాజ్యంగ విధులపై కచ్చితంగా దృష్టి సారిస్తూ రాజకీయ వివాదాలకు తెరతీసే పనులను గవర్నర్​ చేయకూడదనే సిఫారసు పుంఛీ కమిషన్​ చెప్పింది. 

గవర్నర్​ పాత్ర గురించి సుప్రీంకోర్టు తీర్పులు

తమిళనాడు రాష్ట్రం వర్సెస్​ గవర్నర్​ (2024) తీర్పు ప్రకారం.. ఎన్నికైన ప్రభుత్వ పనితీరు ఆపడానికి,  అడ్డుకోవడానికి గవర్నర్​ తన విచక్షణాధికారాలను వినియోగించకూడదు.  నబమ్​రెబియా  వర్సెస్​  డిప్యూటీ స్పీకర్​(2016) కేసు ప్రకారం గవర్నర్​ విచక్షణాధికారాలు రాజ్యాంగంలో పరిమితం చేయడమైందని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ బెంచి తీర్పుని ఇచ్చింది.  సంషేర్​సింగ్​ వర్సెస్​ స్టేట్​ఆఫ్​ పంజాబ్​(1974)  కేసులో  సుప్రీంకోర్టు ఈ విధంగా చెప్పింది. ‘గవర్నర్​ రాజ్యాంగ అధిపతి. అయితే తన విచక్షణని  మంత్రిమండలి సహాయం, సలహా మేరకు వినియోగించాల్సి ఉంటుంది.’  

రాజ్యాంగం, సుప్రీంకోర్టు తీర్పులు గవర్నర్​ విచక్షణాధికారాల గురించి  ఇంత  స్పష్టమైన  వివరణ  ఇచ్చినప్పటికీ  ఘర్షణ వాతావరణం కొనసాగుతూనే ఉంది. సంప్రదాయ ప్రసంగం గురించే కాకుండా బిల్లులకు ఆమోదం  ఇవ్వడంలో,  విశ్వవిద్యాలయ ఉప కులపతి నియామకం వంటి అంశాలమీద  గవర్నర్లకి, రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య ఘర్షణ కొనసాగుతూనే ఉంది. ఈ విషయంలో కేంద్రం పాత్ర ఉన్నదన్నది నిర్వివాదాంశం. 

బీజేపీయేతర  ప్రభుత్వాల రాష్ట్రాలలోనే...

కేంద్రం, రాష్ట్రాల మధ్య వారధిగా ఉండాల్సిన గవర్నర్​ తన పాత్రను దెబ్బతీస్తూ కేంద్ర ప్రభుత్వ రాజకీయ ప్రతినిధిగా వ్యవహరించే ధోరణి పెరిగిపోతూ ఉంది. ఈ తరహా సంఘటనలు బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలలోనే జరుగుతున్నాయి.  ఇక్కడొక  విషయం  గమనించాలి.  మంత్రులు,  ప్రధానమంత్రులు, న్యాయమూర్తులు,  ప్రధాన  న్యాయమూర్తులు  రాజ్యాంగం ప్రకారం  వ్యవహరిస్తామని  చెబుతారు.  కానీ, రాష్ర్టపతి,  గవర్నర్లు అంతకుమించి ప్రమాణం  చేస్తారు.  ఇప్పుడు  గవర్నర్లు  చేస్తున్న  పనులు  రాజ్యాంగాన్ని  రక్షిస్తున్నట్టు  అనిపించడం లేదు.  

ఈ వార్షిక  ప్రసంగాలు గవర్నర్లు చేపట్టిన రాజ్యాంగ పదవిని  దిగజారుస్తున్నాయి. ప్రభుత్వ విధానాలను వినే హక్కును  శాసన వ్యవస్థలకు  లేకుండా చేస్తున్నాయి.  రాష్ట్ర ప్రభుత్వం తయారుచేసిన  ప్రసంగాన్ని చదవాల్సిందే అని చాలామంది  రాజ్యాంగ నిపుణులు అంటున్నారు.  ప్రతిపక్ష రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్న రాష్ట్రాలలో  కేంద్ర ప్రభుత్వ విధానాలను  విమర్శించడం  జరుగుతుంది.   కేంద్ర ప్రభుత్వం  నియమించిన  గవర్నర్లకి ఇది కొంత ఇబ్బంది కలిగించే అంశమే.  కానీ, వాళ్లు రాజ్యాంగం ప్రకారం మంత్రి మండలి సలహామేరకు నడుచుకోవాల్సిందే. 

రాష్ట్ర ప్రభుత్వాల పనితీరునుఅడ్డుకోవడం సరికాదు

రాజకీయ ప్రయోజనాలతో ప్రేరేపితమైన ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాల పనితీరును అడ్డుకోవడం సమంజసం కాదు.  శాసనసభ తొలి సమావేశంలో గవర్నర్​ ప్రసంగించే  సంప్రదాయాన్ని రద్దు చేయాలని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్​ అంటున్నారు.  ఈ అసహ్యకరమైన దృశ్యాల విముక్తికి ఇది అవసరమేమో.  మరొక్క విషయం చెప్పుకోవాలి. రాజ్యాంగ పదవులు అధిష్టించిన  రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, న్యాయమూర్తులు అభిశంసన ద్వారా తొలగించే అవకాశం ఉంది. 

కానీ, అలా అభిశంసించే  అవకాశం లేని ఒకే ఒక రాజ్యాంగ పదవి గవర్నర్.   రాష్ట్రపతి  సంతృప్తి ఉన్నంతమేరకు అతను గవర్నర్​ పదవిలో కొనసాగుతారు.  కేంద్ర మంత్రిమండలి సలహా మేరకు రాష్ట్రపతి నిర్ణయాలు తీసుకుంటారు. అంటే  గవర్నర్​ని తొలగించే అధికారం ఎవరికి ఉంది.  ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 

‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌- డా. మంగారి రాజేందర్​
జిల్లా జడ్జి (రిటైర్డ్)