తెలంగాణ వ్యాప్తంగా 245 విద్యాసంస్థల బస్సులపై కేసులు

తెలంగాణ వ్యాప్తంగా 245 విద్యాసంస్థల బస్సులపై కేసులు

హైదరాబాద్: రవాణా శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తం గా 245 విద్యాసంస్థల వాహనాలపై కేసులు నమోదు అయ్యాయి. 2026, జూన్ 15 నుంచి రాష్ట్రంలో పాఠశాలలు, విద్యాసంస్థలు పునఃప్రారంభం అయిన నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని రవాణా శాఖ రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. ఫిట్‌నెస్ లేని వాహనాలు, అధిక సంఖ్యలో విద్యార్థులను ఎక్కించుకొని (Over Loading) నడుపుతున్న వాహనాలు, భద్రతా ప్రమాణాలు పాటించని వాహనాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి 245 విద్యాసంస్థల వాహనాలపై కేసులు నమోదు చేసి.. ఫిట్నెస్ లేని 60 బస్సులను సీజ్ చేశారు. ఈ తనిఖీలు కొనసాగుతాయని రవాణా శాఖ తెలిపింది.

ఈ ప్రత్యేక తనిఖీలలో క్రింది అంశాలను పరిశీలిస్తారు

* వాహనాలకు చెల్లుబాటు అయ్యే ఫిట్‌నెస్ సర్టిఫికేట్, పర్మిట్, ఇన్సూరెన్స్, కాలుష్య నియంత్రణ సర్టిఫికేట్ ఉన్నాయా లేదా.
* వాహనాలలో అనుమతించిన సామర్థ్యానికి మించి విద్యార్థులను ఎక్కిస్తున్నారా లేదా.
* డ్రైవర్లకు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ మరియు అనుభవం ఉన్నదా లేదా.
* ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ఫైర్ ఎక్స్టింగ్విషర్, ఎమర్జెన్సీ ఎగ్జిట్ వంటి భద్రతా సౌకర్యాలు ఉన్నాయా లేదా.
* వాహనాల బ్రేకులు, టైర్లు, లైట్లు మరియు ఇతర యాంత్రిక భాగాలు సక్రమంగా ఉన్నాయా లేదా.
* విద్యార్థుల భద్రత కోసం అటెండర్‌ను నియమించారా లేదా.

ఫిట్‌నెస్ లేకుండా నడుస్తున్న వాహనాలు లేదా ఓవర్‌లోడ్ చేస్తున్న వాహనాలను వెంటనే సీజ్ చేయడం జరుగుతుంది. మోటార్ వాహన చట్టం ప్రకారం వాహన యజమానులు, డ్రైవర్లు మరియు సంబంధిత విద్యాసంస్థల యాజమాన్యాలపై కేసులు నమోదు చేసి తగిన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి.

విద్యాసంస్థల విద్యార్థులను రవాణా చేసే వాహనాల నిర్వహణ, భద్రతా ప్రమాణాల అమలు మరియు నిబంధనల పాటింపు పూర్తి బాధ్యత సంబంధిత పాఠశాల / కళాశాల యాజమాన్యాలదేనని రవాణా శాఖ స్పష్టం చేసింది.

►ALSO READ | రాజన్న సిరిసిల్ల జిల్లాలో కోతుల బీభత్సం.. మూడేళ్ల చిన్నారిపై దాడి.. తీవ్ర గాయాలు ..

తల్లిదండ్రులకు కూడా రవాణా శాఖ ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నది. అధిక సంఖ్యలో విద్యార్థులను ఎక్కించుకునే (Over Loaded) వాహనాలలో తమ పిల్లలను పంపవద్దని సూచించింది. ఫిట్‌నెస్ లేని లేదా ఓవర్‌లోడ్ చేస్తున్న వాహనాలు తనిఖీలలో సీజ్ చేయబడిన పక్షంలో విద్యార్థులు మధ్యలో ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉందని పేర్కొంది. అందువల్ల తల్లిదండ్రులు తమ పిల్లలు ప్రయాణించే వాహనాల ఫిట్‌నెస్, భద్రతా ప్రమాణాలు మరియు అనుమతులపై ముందుగానే నిర్ధారించుకోవాలని విజ్ఞప్తి చేసింది.

అన్ని విద్యాసంస్థల యాజమాన్యాలు తమ వాహనాలను క్రమం తప్పకుండా ఫిట్‌నెస్ పరీక్షలకు హాజరు పరచి, విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని రవాణా శాఖ సూచించింది.  

ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తం గా 25,987 విద్యా సంస్థల బస్సులు ఉండగా 23,204 బస్సులు ఫిట్ నెస్ సర్టిఫికెట్ పొందాయని మిగిలిన 2783 బస్సులు సైతం ఫిట్ నెస్ సర్టిఫికెట్ పొందాలని రవాణా శాఖ సూచించింది.