భారత రాజ్యాంగం కేవలం పరిపాలనా నియమావళి మాత్రమే కాదు, శతాబ్దాలుగా కొనసాగిన అసమానతలను తొలగించి, అణగారిన వర్గాల్లో వెలుగు నింపే సామాజిక విప్లవ పత్రం. రాజ్యాంగ co నిర్మాణానికి కేంద్ర బిందువు ‘సామాజిక న్యాయం’. ఇది వ్యక్తుల మధ్య చట్టపరమైన సమానత్వంతోపాటు సమాజంలో ఉన్న నిర్మాణాత్మక అసమానతలను సరిదిద్దడమే దీని లక్ష్యం. భారతదేశంలో ఇప్పటివరకు పార్టీలన్ని సామాజిక న్యాయం పేరుతోనే అధికారంలోకి వచ్చాయి. అనేక పథకాలు, ప్రకటనలతో సామాజిక సమానత్వం దిశగా అడుగులు వేస్తున్నట్లు భ్రమ కల్పించారు.
గరీబ్ హటావో పేరుతో కాంగ్రెస్ పార్టీ, అంత్యోదయ పేరుతో బీజేపీ, సమ సమాజం పేరుతో పలు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన కమ్యూనిస్టు పార్టీలతో సామాజిక న్యాయం నెరవేరలేదు. ఈ దేశంలో ఇప్పటికీ 80 కోట్ల మంది రేషన్ బియ్యం మీద ఆధారపడి జీవిస్తున్నారు. ఇది సామాజిక న్యాయ వైఫల్యానికి సజీవ సాక్ష్యం. గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి మొదట దళిత ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి మాట తప్పడం కూడా ఇందుకు నిదర్శనం. సమాన అవకాశాల కల్పనే సామాజిక న్యాయంతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2024 ఫిబ్రవరి 4న కులగణన చేయాలని కేబినెట్లో తీర్మానం చేసింది. ఈ క్రమంలో 2025 ఫిబ్రవరి 4న కులగణనపై చర్చించారు. మరోవైపు షెడ్యూల్డ్ కులాల ఉప వర్గీకరణకు సంబంధించిన సిఫార్సులను తెలంగాణ ప్రభుత్వం ఆమోదించింది. ఈ అంశాలను పురస్కరించుకొని ప్రభుత్వం అన్ని వర్గాలకు సమానత్వం, సాధికారత వైపు నడిపించడానికి గతేడాది ఫిబ్రవరి 4వ తేదీన ‘తెలంగాణ సామాజిక దినోత్సవం’గా ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయ ప్రయత్నాలు ఏ మేరకు సఫలీకృతం అయ్యాయి అనే అంశం పట్ల చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. సామాజిక న్యాయం అనేది పాలనా విధానాల్లో, చట్టాల అమలులో, అవకాశాల సమాన పంపిణీలో స్పష్టంగా కనిపించాలి. జనాభా ప్రకారం అందరికీ సమాన అవకాశాలు కల్పనే సామాజిక న్యాయం. ఈ క్రమంలో ప్రభుత్వం కులగణన నిర్వహించి బీసీలకు విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఇది సబ్బండ కులాల చారిత్రక అన్యాయాన్ని సరిచేసి ఒక అధికారిక అంగీకారం. కానీ చట్టరూపం దాల్చి క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. బీసీ రిజర్వేషన్ బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్లోనే ఉండటమే దీనికి నిదర్శనం.
ఉద్యోగ నియామకాలు జరగాలి
ఉప వర్గీకరణ జరగాలని మూడు దశాబ్దాల పోరాటం జరిగింది. ఎట్టకేలకు సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వడంతో తెలంగాణ ప్రభుత్వం మొదటిసారి ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగింది. ఎస్సీ ఉప వర్గాలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో జరిగిన వర్గీకరణ నిర్ణయం స్వాగతార్హమే. కానీ, ఆ నిర్ణయం అమలులోకి రావాలంటే ఉద్యోగ నియామకాలు జరగాలి, ఖాళీలు భర్తీ కావాలి. వర్గీకరణ జరిగి సంవత్సరం గడుస్తున్నా ఉద్యోగాలు వేయకపోవడం వల్ల రాజకీయ ప్రచారానికి మాత్రమే అనే విమర్శకు తావిస్తోంది. ఈ క్రమంలో కులగణన ఫలితాల ఆధారంగా రిజర్వేషన్లు అమలు చేయడం, ఎస్సీ ఉప వర్గీకరణ తర్వాత తక్షణమే ఉద్యోగ నియామకాలు చేపట్టడం వంటి చర్యలు తీసుకోనంతవరకు సామాజిక న్యాయ దినోత్సవం అసంపూర్తిగానే మిగిలిపోతుంది. సామాజిక న్యాయం అంటే ఒక వర్గానికి సానుభూతి చూపించడం కాదు, వ్యవస్థాపరమైన అసమానతలను సరిదిద్దడం. సామాజిక న్యాయం అనేది ఎన్నికల సమయంలో వినిపించే నినాదం కాదు. వెనుకబడిన 90 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఎదుర్కొంటున్న నిరుద్యోగం, విద్యావకాశాలు, పరిపాలనలో తగిన ప్రాతినిధ్యం దక్కాలి. ఈ దేశంలో సామాజిక న్యాయం పాలకపార్టీల దయతో రాదు. అది బహుజన వర్గాల చేతిలో రాజ్యాధికారం ఉన్నప్పుడే సాధ్యం. ఈ క్రమంలో బీసీ, ఎస్సీ, ఎస్టీల హక్కులు, రాజ్యాధికార సాధన కోసం లక్ష కిలోమీటర్ల రథయాత్ర చేస్తున్న డాక్టర్ విశారదన్ మహరాజ్ ‘మా భూమి యాత్ర’ సామాజిక న్యాయ పోరాటంలో మరో కీలక మలుపు. ఇది ఒక యాత్ర కాదు. బహుజనుల భవిష్యత్తు కోసం సాగుతున్న రాజకీయ యుద్ధం.
న్యాయ వివాదాలు
స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ అమలు చేయడానికి తెచ్చిన జీవో సైతం న్యాయ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. సంస్థాగతంగా నిబద్ధత కొరవడిన బీసీ రిజర్వేషన్ల బిల్లు తేవడమే దీనికి ప్రధాన కారణం. మరోవైపు బీసీ కోటా కోసం బీఆర్ఎస్, బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలు మొసలి కన్నీరు కార్చడం శోచనీయం. ఈ పార్టీలన్నీ రాష్ట ప్రభుత్వాన్ని ప్రశ్నించకపోవడం, అన్నీ కలిపి కేంద్రంపై బీసీ రిజర్వేషన్ల చట్టబద్ధతకు ధిక్కార స్వరం వినిపించకపోవడం ఇందుకు నిదర్శనం. దీంతో సబ్బండ కులాలకు రాజ్యాంగ పరంగా చెందాల్సిన హక్కులను వ్యతిరేకిస్తున్నట్లు నిర్ధారణ అయిపోయింది. బీసీ రిజర్వేషన్లు తొమ్మిదో షెడ్యూల్లో చేర్చి చట్టబద్ధత కల్పించాలని బీసీ, ఎస్సీ , ఎస్టీ జేఏసీ, బీసీ రిజర్వేషన్ల సాధన సమితి పెద్ద ఎత్తున ఉద్యమించింది. అయినప్పటికీ ప్రభుత్వం బీసీల రిజర్వేషన్ అంశం పక్కన పెట్టి గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. ఈ బీసీ ఉద్యమ ప్రభావంతో బీసీ, ఎస్సీ, ఎస్టీలు 86.4 శాతం సర్పంచ్ గా గెలవడం భారతదేశంలో అతి పెద్ద బహుజనుల సామాజిక విజయం. ఇదే సందర్భంలో ఎస్సీ రిజర్వేషన్ల విషయంలో రిజర్వేషన్ ఫలాలు అందరికీ సమానంగా పంపిణీ జరగలేదు.
- సంపతి రమేష్ మహారాజ్,
సోషల్ ఎనలిస్ట్
