తెలంగాణలో విద్యారంగాన్ని బలోపేతం చేస్తూ... ధనిక, పేద తారతమ్యం లేకుండా విద్యార్థులందరికీ నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా సంస్కరణలకు శ్రీకారం చుట్టింది తెలంగాణ ప్రభుత్వం. సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే విద్యారంగంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. దీనిలో భాగంగా సర్కార్ చదువుల్లో నాణ్యతను పెంచి, కార్పొరేట్ విద్యాసంస్థలను తలదన్నేలా చేయాలన్న పట్టుదలతో విద్యారంగంలో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టారు.
వేలాది సర్కార్ బడులు, కాలేజీలు ఉన్నా... ప్రజలు వాటిని పట్టించుకోకుండా ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల వైపుకు వెళ్తుండటం మనం చూస్తున్నాం. నెలకు పది వేల రూపాయలు సంపాదించే వ్యక్తి కూడా... తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లోనే చేర్పిస్తున్నారు. ఇటీవల విద్యా కమిషన్ ఇచ్చిన నివేదికలో సైతం ఇదే స్పష్టమైంది. ఇలా తమ పిల్లల చదువుల ఫీజుల కోసం తల్లిదండ్రులు అప్పులపాలవుతున్న పరిస్థితులు ప్రతిచోటా కనిపిస్తున్న దృశ్యాలే. వీటన్నింటిని గుర్తించిన సీఎం రేవంత్ తెలంగాణ విద్యారంగంలో సమూల మార్పులకు నాంది పలికారు.
కార్పొరేట్‌ను తలదన్నే తెలంగాణ పబ్లిక్ స్కూల్
ప్రతి ఒక్కరికీ నాణ్యమైన విద్య అందించేందుకు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌ను తీసుకొచ్చారు. ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలో నాలుగు పాఠశాలలను తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌గా ఎంపిక చేసింది ప్రభుత్వం. అవి రంగారెడ్డి జిల్లాలో ఆరుట్ల, మంచాల, ఉమ్మడి పాలమూరు జిల్లాలో వంగూరు, పోల్కంపల్లిలు. ఈ పాఠశాలలను తీర్చిదిద్దే బాధ్యతను తెలంగాణ విద్యా కమిషన్‌కు అప్పగించింది ప్రభుత్వం. కమిషన్ చైర్‌పర్సన్ ఆకునూరి మురళి పర్యవేక్షణలో... తెలంగాణ సర్కార్ బడి ఇప్పుడు కొత్త రూపును సంతరించుకుంది.
దీనికి నిదర్శనమే రంగారెడ్డి జిల్లా ఆరుట్లలోని తెలంగాణ పబ్లిక్ స్కూల్. తెలంగాణ విద్యా విధానానికి రోల్ మోడల్‌గా నిలుస్తోంది ఆరుట్లలోని టీపీఎస్. ఆధునిక వసతులు, డిజిటల్ క్లాస్‌రూములు, విద్యార్థులకు విశాలమైన ప్లేగ్రౌండ్లు, ల్యాబ్‌లు, గాలి వెలుతురు పుష్కలంగా ఉండే తరగతి గదులు, జిమ్, డైనింగ్ హాల్స్‌తో పాటు... క్రికెట్, ఫుట్‌బాల్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, టెన్నిస్, క్యారమ్స్ ఇలా ప్రతి ఆటకు సంబంధించిన మైదానాలు, ఇన్‌స్ట్రక్టర్లు కూడా విద్యార్థులకు అందుబాటులో ఉంచారు.
బస్సు సర్వీస్ పూర్తిగా ఉచితం
కుల, మత, ధనిక, పేద తేడా లేకుండా... విద్యార్థులంతా ఒకేచోట కలిసి మెలిసి ఆడుతూ పాడుతూ చదువుకునేలా చక్కటి వాతావరణం కల్పించారు. కార్పొరేట్ స్కూళ్లకు ఏమాత్రం తీసిపోని విధంగా స్కూల్ బస్సులను కూడా ఏర్పాటు చేశారు. ఆరుట్ల చుట్టుపక్కల గ్రామాల నుంచి విద్యార్థులను బడికి తీసుకురావడానికి ఐదు స్కూల్ బస్సులను నడుపుతున్నారు. ఈ బస్సు సర్వీస్ పూర్తిగా ఉచితం.
ప్రైవేట్ పాఠశాలల్లో బస్సు ఫీజుల భారం ఎక్కువగా ఉండే పరిస్థితుల్లో... ఈ నిర్ణయం తల్లిదండ్రుల్లో తెలంగాణ పబ్లిక్ స్కూల్‌పై విశ్వాసాన్ని పెంచింది. విద్యార్థుల ఆరోగ్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక వైద్య బృందం అందుబాటులో ఉంటుంది. అలాగే విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం పెంచేందుకు సైకాలజిస్టు సేవలు కూడా అందిస్తున్నారు.
ప్రైవేట్ స్కూల్ వద్దు - సర్కార్ బడి ముద్దు
ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్‌లో విద్యార్థులకు చదువుతో పాటు పౌష్టికాహారం అందిస్తున్నారు. ఉదయం బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం స్నాక్స్... ఇలా ప్రతి రోజు భిన్నమైన మెనూతో మంచి ఆహారం అందిస్తున్నారు. స్వచ్ఛమైన తాగునీరు, పరిశుభ్రమైన మరుగుదొడ్లు, పౌష్టికాహారం ఇవన్నీ విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. దీంతో ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ స్కూల్‌లో తమ పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు క్యూ కడుతున్నారు. ప్రైవేట్ స్కూళ్ల నుంచి కూడా ఈ స్కూల్‌లో అడ్మిషన్లు తీసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు.
గత అకాడమిక్ ఇయర్‌కు ముందు ప్రాథమిక పాఠశాలలో 90 మంది విద్యార్థులు ఉండగా... ఆ సంఖ్య ఇప్పుడు 514కు పెరిగింది. ఉన్నత పాఠశాలలో 250 మంది నుంచి 360 మందికి పెరిగింది. మోడల్ స్కూల్‌లో 350 నుంచి 629 మంది విద్యార్థులు చేరారు. ఇలా గతంలో మొత్తం 650 మంది విద్యార్థులు ఉండగా... ఇప్పుడు ఆ సంఖ్య 1629కు చేరింది. ఈ మారిన సంఖ్య చూస్తుంటే... సర్కార్ చదువుపై తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏ స్థాయిలో నమ్మకం పెంచిందో అర్థమవుతోంది.
విద్యారంగ బలోపేతానికి అడుగులు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విద్యారంగంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంస్కరణలు విప్లవాత్మక మార్పులకు నాంది పలికాయి. ముఖ్యంగా పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత చదువులను చేరువ చేయడంలో కీలక పాత్ర పోషించాయి.
2004లో వైఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకం... పేద విద్యార్థులకు మెడిసిన్, ఇంజినీరింగ్ చదువులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇదే ఒరవడిని కొనసాగిస్తున్నారు. విద్యా శాఖను తన దగ్గరే ఉంచుకుని విద్యారంగ సంస్కరణలను క్షేత్రస్థాయికి తీసుకెళుతున్నారు.
గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన సంక్షేమ హాస్టళ్ల డైట్ ఛార్జీలను భారీగా పెంచారు. 3వ తరగతి నుంచి 7వ తరగతి వరకు రూ.950 ఉన్న డైట్ ఛార్జీని రూ.1330కు పెంచారు. 8 నుంచి 10వ తరగతి వరకు రూ.1100 నుంచి రూ.1540కు పెంచారు. ఇంటర్ నుంచి పీజీ వరకు రూ.1500 స్థానంలో రూ.2100 అందిస్తున్నారు.
ఇలా ఒకేసారి 40 శాతం డైట్ ఛార్జీలు పెంచిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలతో కొత్త దిశగా అడుగులు వేస్తోంది. దీనికి రోల్ మోడల్‌గా ఇప్పుడు ఆరుట్లలోని సర్కార్ బడి నిలుస్తోంది.
ఏముల కొండల్ గౌడ్, జర్నలిస్ట్
* ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ openpage@v6velugu.com
* రచయితలు ‘వెలుగు’కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి.
* స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.
