భారత సుప్రీంకోర్టు గురించి మాట్లాడటం అంటే కేవలం ఒక న్యాయస్థానం గురించి కాదు. ఈ దేశ రాజ్యాంగ ఆత్మ గురించి మాట్లాడటమే. పౌర హక్కులకు చివరి రక్షణగా నిలిచే అత్యున్నత న్యాయస్థానం నేడు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటోంది. తొంభై మూడు వేలకుపైగా కేసులు పెండింగ్‌లో ఉండగా... న్యాయం నిజంగా సమయానికి అందుతోందా? అనే ప్రశ్న దేశవ్యాప్తంగా వినిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం మే 2026లో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 33 నుంచి 37కు పెంచాలని నిర్ణయించడం స్వాగతించదగిన అడుగు.
అయితే ఇది పరిష్కార దిశగా వేసిన తొలి అడుగు మాత్రమే. స్వాతంత్ర్యం సమయానికి దేశ జనాభా ముప్పై నాలుగు కోట్లు. అప్పట్లో ముగ్గురు న్యాయమూర్తులతో సుప్రీంకోర్టు పనిచేసేది. నేడు జనాభా నూట నలభై కోట్లకు చేరినా, న్యాయమూర్తుల సంఖ్య ముప్పై మూడే. చట్టాలు పెరిగాయి, వ్యాపార వివాదాలు పెరిగాయి, పౌరహక్కుల చైతన్యం విస్తరించింది, కేసుల సంఖ్య విపరీతంగా పెరిగింది. కానీ, న్యాయ వ్యవస్థ అదే వేగంతో విస్తరించలేదు. ఇదే అసలు సంక్షోభం.
న్యాయమూర్తులపై పని ఒత్తిడి
ప్రస్తుతం ఒక్కో న్యాయమూర్తిపై ఉన్న భారం అసాధారణం. సంవత్సరానికి డెబ్భై వేలకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. పని దినాలు పరిమితంగా ఉండటంతో, ఒక్కో న్యాయమూర్తి రోజుకు డెబ్భై నుంచి తొంభై కేసుల వరకు పరిశీలించాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి కేసును లోతుగా అధ్యయనం చేయడం శారీరకంగా, మానసికంగా కూడా కష్టసాధ్యం. ఇది వ్యక్తుల వైఫల్యం కాదు.. వ్యవస్థపై పడిన అతిభారం. దీని ప్రభావం రాజ్యాంగ ధర్మాసనాలపైనా పడుతోంది. అయిదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ బెంచీలు ఇప్పుడు అరుదుగా కూర్చుంటున్నాయి.
ఫలితంగా దేశ భవిష్యత్తును ప్రభావితం చేసే రాజ్యాంగపరమైన అంశాలు సంవత్సరాల తరబడి పెండింగ్‌లోనే మిగిలిపోతున్నాయి. న్యాయమూర్తుల సంఖ్య పెరిగితే పరిస్థితి మారుతుంది. ఒకేసారి ఎక్కువ ధర్మాసనాలు కూర్చునే అవకాశం ఉంటుంది. రాజ్యాంగ అంశాలు, క్రిమినల్ కేసులు, సాధారణ పిటిషన్లు సమాంతరంగా విచారణకు వస్తాయి. దీంతో న్యాయమూర్తులకు ప్రతి కేసుపై ఎక్కువ సమయం కేటాయించే అవకాశం లభిస్తుంది. ఫలితంగా తీర్పుల నాణ్యత, వేగం రెండూ మెరుగుపడతాయి.
దిగువ న్యాయవ్యవస్థను బలోపేతం చేయాలి
సంఖ్య పెరిగితే నాణ్యత తగ్గుతుంది అనే వాదనలో బలం లేదు. ఉన్నత న్యాయస్థానాల్లో అనుభవం ఉన్న న్యాయమూర్తులు, అగ్రశ్రేణి న్యాయవాదులకు దేశంలో కొరత లేదు. కొరత ఉన్నది రాజకీయ సంకల్పానికి, వ్యవస్థాగత సంస్కరణకు మాత్రమే. అమెరికా, బ్రిటన్, జర్మనీ వంటి దేశాల్లో సుప్రీంకోర్టుల నిర్మాణం భిన్నంగా ఉంటుంది.
అక్కడ దిగువ న్యాయస్థానాలే బలంగా ఉండటంతో కేసులు పైస్థాయికి తక్కువగా వస్తాయి. భారతదేశంలో మాత్రం జిల్లా, ఉన్నత న్యాయస్థానాల బలహీనత వల్లే అత్యధిక కేసులు సుప్రీంకోర్టు వరకు చేరుతున్నాయి. అందుకే విదేశీ నమూనాలను యథాతథంగా అనుసరించడం కాదు. భారత పరిస్థితులకు సరిపోయే పరిష్కారం అవసరం. ఈ దేశంలో ప్రభుత్వమే అతిపెద్ద వ్యాజ్యకర్త కావడం మరో విస్మయకర వాస్తవం.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థల మధ్య జరిగే అనవసర వ్యాజ్యాలు సగానికి పైగా పెండింగ్ కేసులకు కారణమవుతున్నాయని అంచనా. ప్రభుత్వం నిజంగా సంస్కరణ కోరుకుంటే, ముందుగా తన వ్యాజ్య సంస్కృతిని మార్చుకోవాలి. అసలు పరిష్కారం దిగువ న్యాయవ్యవస్థ బలోపేతంలోనే ఉంది. దేశవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న అయిదున్నర కోట్ల కేసుల్లో తొంభై శాతానికి పైగా జిల్లా, ఉన్నత న్యాయస్థానాల్లోనే ఉన్నాయి. అక్కడ మౌలిక వసతులు, న్యాయమూర్తుల నియామకాలు, సాంకేతిక సదుపాయాలు మెరుగుపడితే ప్రజలకు స్థానికంగానే వేగవంతమైన న్యాయం లభిస్తుంది. అప్పుడు సుప్రీంకోర్టు ప్రధానంగా రాజ్యాంగ, జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశాలపై దృష్టి పెట్టగలదు.
మధ్యవర్తిత్వం, రాజీ విధానాలు విస్తరించాలి
మధ్యవర్తిత్వం, రాజీ కుదుర్పు విధానాలకు కూడా ప్రాధాన్యమిచ్చి విస్తృతంగా విస్తరించాలి. కుటుంబ, వ్యాపార వివాదాలు కోర్టు బయటే పరిష్కారమయ్యే సంస్కృతి పెరిగితే లక్షలాది కేసులు తగ్గిపోతాయి. అలాగే న్యాయమూర్తుల సంఖ్యను దశలవారీగా పెంచడం అవసరం. దానికి అనుగుణంగా కోర్టు హాళ్లు, న్యాయ పరిశోధకులు, సిబ్బంది, డిజిటల్ మౌలిక వసతులు కూడా పెరగాలి.
కొలీజియం విధానంలో పారదర్శకత తీసుకురావడం, ఎంపిక ప్రమాణాలను స్పష్టీకరించడం కూడా కాలానుగుణంగా అవసరం. పదవీ విరమణ వయసును పెంచాలనే వాదనకూ ప్రాధాన్యం ఉంది. న్యాయం ఆలస్యం అయితే నష్టపోయేది వ్యక్తి మాత్రమే కాదు.. దేశ ఆర్థిక వ్యవస్థ కూడా. పెట్టుబడులు తగ్గుతాయి, వ్యాపార విశ్వాసం దెబ్బతింటుంది, సాధారణ పౌరుడు న్యాయస్థానం పేరు వినగానే భయపడే పరిస్థితి ఏర్పడుతుంది.
వేగవంతమైన, విశ్వసనీయ న్యాయ వ్యవస్థ ప్రజాస్వామ్యానికి వెన్నెముక. ప్రభుత్వం తీసుకున్న నాలుగు న్యాయమూర్తుల పెంపు నిర్ణయం ఒక మంచి ప్రారంభం. కానీ అది అక్కడితో ఆగిపోకూడదు. న్యాయమూర్తుల సంఖ్య పెంపు, దిగువ కోర్టుల బలోపేతం, ప్రభుత్వ వ్యాజ్యాల నియంత్రణ, మధ్యవర్తిత్వ ప్రోత్సాహం, సాంకేతిక సమైక్యత.. ఇవన్నీ కలిసే నిజమైన న్యాయ సంస్కరణకు దారి తీస్తాయి. రాజ్యాంగం ప్రసాదించిన న్యాయం ప్రతి పౌరుడికీ అందాలి. సుప్రీంకోర్టు బలోపేతం కేవలం న్యాయ వ్యవస్థ అవసరం కాదు. అది భారత ప్రజాస్వామ్య భవిష్యత్తును రక్షించే జాతీయ బాధ్యత.
కాలగిరి శ్రీనివాస్ రెడ్డి, జర్నలిస్ట్
* ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ఐడీ openpage@v6velugu.com
* రచయితలు ‘వెలుగు’కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి.
* స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.
