పెండ్లికి వెళ్లి వస్తూ బొలెరో పల్టీ.. బాలుడు మృతి, 15 మందికి గాయాలు

పెండ్లికి వెళ్లి వస్తూ బొలెరో పల్టీ.. బాలుడు మృతి, 15 మందికి గాయాలు

మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌ అర్బన్/చిన్నచింతకుంట, వెలుగు: పెండ్లికి వెళ్లి వస్తున్న ఓ బొలెరొ వాహనం పల్టీ కొట్టడంతో ఆరేండ్ల బాలుడు చనిపోగా, మరో 15 మందికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌ కలెక్టరేట్‌‌‌‌ సమీపంలో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌ జిల్లా చిన్నచింతకుంట మండలం దమగ్నాపూర్‌‌‌‌ గ్రామానికి చెందిన ఓ యువకుడికి భూత్పూర్‌‌‌‌ మండలం మొల్గర గ్రామానికి చెందిన అమ్మాయితో పెండ్లి నిశ్చయమైంది.

బుధవారం మొల్గరలో వివాహం ఉండడంతో అబ్బాయి తరఫు బంధువులు 16 మంది బొలెరో వెళ్లారు. ఇందులో దమగ్నాపూర్‌‌‌‌ గ్రామానికి చెందిన నాగరాజు, పావణి దంపతులు, వార కుమారుడు సాయిహర్ష (6) సైతం ఉన్నారు. వివాహం అనంతరం అదే వాహనంలో తిరిగి వస్తున్నారు.మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌ కలెక్టరేట్‌‌‌‌ సమీపంలో ప్రమాదం

ఈ క్రమంలో మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌ పట్టణంలోని క్రిస్టియన్‌‌‌‌ కాలనీ కలెక్టరేట్‌‌‌‌ సమీపంలోకి రాగానే బొలెరో అదుపుతప్పి పల్టీ కొట్టింది. ప్రమాదంలో సాయిహర్ష అక్కడికక్కడే చనిపోగా.. వాహనంలో ఉన్న మరో 15 మందికి గాయాలయ్యాయి.

ప్రమాదాన్ని గమనించిన స్థానికులు గాయపడిన వారిని 108లో ప్రభుత్వ జనరల్‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌కు తరలించారు. ప్రమాదం గురించి తెలుసుకున్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌‌‌‌రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌‌‌‌రెడ్డిలు హాస్పిటల్‌‌‌‌కు వచ్చి బాధితులను పరామర్శించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసినట్లు మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌ రూరల్‌‌‌‌ పోలీసులు తెలిపారు.

డివైడర్‌‌‌‌ను ఢీకొట్టిన బైక్‌‌‌‌, భార్య మృతి, భర్తకు గాయాలు
బైక్‌‌‌‌ అదుపుతప్పి డివైడర్‌‌‌‌ను ఢీకొట్టడంతో భార్య చనిపోగా, భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం కామారెడ్డి జిల్లా పిట్లం మండలం గద్దగుండు తండా వద్ద బుధవారం జరిగింది. పిట్లం ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దకొడప్‌‌‌‌గల్‌‌‌‌ గ్రామానికి చెందిన మారేపల్లి హన్మాండ్లు భార్య లక్ష్మి (46)తో కలిసి ఎల్లారెడ్డి మండలం కళ్యాణిలో బంధువుల పెండ్లికి బైక్‌‌‌‌పై వెళ్లారు. తిరిగి వస్తుండగా.. గద్దగుండు తండా వద్దకు చేరుగోగానే బైక్‌‌‌‌ అదుపుతప్పి డివైడర్‌‌‌‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో లక్ష్మి చనిపోగా, హన్మాండ్లుకు తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు హన్మాండ్లును హాస్పిటల్‌‌‌‌కు తరలించారు.