టూరిస్ట్ వీసాతో వచ్చి 15 ఏళ్లుగా రెస్టారెంట్ నడిపిస్తున్న ఫ్రెంచ్ వ్యక్తి.. కోర్టు సంచలన తీర్పు!

టూరిస్ట్ వీసాతో వచ్చి 15 ఏళ్లుగా రెస్టారెంట్ నడిపిస్తున్న ఫ్రెంచ్ వ్యక్తి.. కోర్టు సంచలన తీర్పు!

కర్ణాటకలోని గోకర్ణలో గతచిన 15 ఏళ్లుగా రెస్టారెంట్ నడుపుతున్న ఒక ఫ్రెంచ్ పౌరుడికి కర్ణాటక హైకోర్టు షాకిచ్చింది. టూరిస్ట్ వీసాపై భారతదేశంలో ఉంటూ వ్యాపారం చేయడం చట్టవిరుద్ధమని స్పష్టం చేస్తూ.. అతడికి జారీ చేసిన ‘లీవ్ ఇండియా’ నోటీసును సమర్థించింది. ఏప్రిల్ 22, 2026న వెలువరించిన ఈ కీలక తీర్పులో విదేశీయుల హక్కులపై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

ఈ కేసు వివరాల్లోకి వెళ్తే..  ఫ్రెంచ్ వ్యక్తి టూరిస్ట్ వీసాపై భారత్‌కు వచ్చి.. గోకర్ణలో స్థిరపడి సుమారు 15 ఏళ్లుగా రెస్టారెంట్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. అయితే టూరిస్ట్ వీసా రూల్స్ ఉల్లంఘించి వాణిజ్య కార్యకలాపాలు సాగిస్తున్నట్లు రాష్ట్ర నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ మేరకు ఫారిన్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్(FRRO) మార్చి 16, 2026న అతడికి వాట్సాప్ ద్వారా నోటీసు పంపి, వెంటనే దేశం విడిచి వెళ్లాలని ఆదేశించారు. దీనిని సవాలు చేస్తూ అతడు హైకోర్టుకు వెళ్లాడు.

తనకు కనీసం వివరణ ఇచ్చుకునే అవకాశం ఇవ్వలేదని బాధిత విదేశీయుడు కోర్టులో వాదించాడు. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం తన ‘జీవించే హక్కు’కు భంగం కలిగించడమేనని ధర్మాసనం ముందు పేర్కొన్నాడు. అయితే హైకోర్టు ఈ వాదనలను తోసిపుచ్చింది. ఆర్టికల్ 21 కింద లభించే రక్షణ కేవలం ప్రాణానికి, వ్యక్తిగత స్వేచ్ఛకు మాత్రమే పరిమితమని.. అది విదేశీయులకు ఇక్కడ బిజినెస్ చేసేందుకు శాశ్వత హక్కును కల్పించదని కోర్టు స్పష్టం చేసింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(e), 19(1)(g) ప్రకారం దేశంలో ఎక్కడైనా నివసించే లేదా వ్యాపారం చేసుకునే హక్కు కేవలం భారత పౌరులకు మాత్రమే ఉంటుందని జస్టిస్ కృష్ణ దీక్షిత్ నేతృత్వంలోని బెంచ్ తేల్చి చెప్పింది.

కేవలం వీసా రూల్స్ అతిక్రమించటమే కాకుండా.. సదరు ఫ్రెంచ్ వ్యక్తి స్థానిక భూ వివాదాల్లో తలదూర్చడం, ఇతరులను బెదిరించడం వంటికి పాల్పడినట్లు కూడా కోర్టు దృష్టికి వచ్చింది. ఇటువంటి చర్యలు సమాజ శాంతికి భంగం కలిగిస్తాయని కోర్టు అభిప్రాయపడింది. టూరిస్ట్ వీసాను వ్యాపారం కోసం వాడటం మార్చుకోవడం చట్టవిరుద్ధమని, ఇలాంటి కేసుల్లో ముందస్తు విచారణ అవసరం లేదని కోర్టు పేర్కొంది. సహజ న్యాయ సూత్రాలు పరిపాలనాపరమైన అత్యవసర పరిస్థితులకు లొంగి ఉండాలని వ్యాఖ్యానిస్తూ.. ఆ ఫ్రెంచ్ పౌరుడిని 7 రోజుల్లోగా భారతదేశం వదిలి వెళ్లాలని హైకోర్టు ఆదేశించింది. విదేశీయులు తమ వీసా పరిమితులకు లోబడి ఉండాలని లేదంటే చట్టపరమైన చర్యలు తప్పవని ఈ తీర్పు హెచ్చరిస్తోంది.