ముషీరాబాద్, వెలుగు: జీవో నంబర్ 7తో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఎత్తేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య ఆరోపించారు. అదే జరిగితే సీఎం రేవంత్‌రెడ్డి ఇంటిని ముట్టడించేందుకు సైతం వెనకాడబోమని హెచ్చరించారు. 18 బీసీ సంఘాల ప్రతినిధులతో కలిసి బుధవారం సెక్రటేరియట్ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు.
ఫీజు రియింబర్స్‌మెంట్ వల్లే బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఉన్నత చదువులు చదువుతున్నారన్నారు. గత బీఆర్‌ఎస్ ఈ పథకాన్ని పాక్షికంగా అమలుచేసిందని, ప్రస్తుత కాంగ్రెస్ పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ స్కీమ్ సంక్షేమ పథకం మాత్రమే కాదని.. భవిష్యత్‌తరాలకు పెట్టుబడి పథకం అన్నారు. ఈ పథకాన్ని కాపాడుకోవడం ప్రభుత్వ బాధ్యత అని చెప్పారు. సమావేశంలో రాజేందర్, అనంతయ్య, నీల వెంకటేశ్ పాల్గొన్నారు.
