‘లో ఎమిషన్ జోన్’ గా పుణే.. హైదరాబాద్కూ అవసరమే..

‘లో ఎమిషన్ జోన్’ గా పుణే.. హైదరాబాద్కూ అవసరమే..

మనదేశంలోని నగరాలు వేగంగా విస్తరిస్తున్నాయి. కొత్త రహదారులు, ఫ్లైఓవర్లు, ఐటీ కంపెనీలు, రియల్ ఎస్టేట్ విస్తరణ అభివృద్ధి సూచికలుగా కనిపిస్తున్నా.. మరోవైపు గాలి కాలుష్యం,  ట్రాఫిక్ సమస్యలు, నీటి కాలుష్యం, శబ్ద కాలుష్యం కూడా ఆందోళనకరస్థాయికి  చేరుతున్నాయి. ముఖ్యంగా వాహనాల పెరుగుదల భారత పట్టణ జీవనాన్ని తీవ్రమైన పర్యావరణ సంక్షోభం వైపు నెడుతోంది. ఈ నేపథ్యంలో  మహారాష్ట్రలోని  పుణే నగరం తీసుకున్న ‘లో ఎమిషన్  జోన్ (ఎల్ఇజెడ్)’ నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.  అదే సమయంలో తెలంగాణ నగరాలకు కూడా  దాని అవసరం కనిపిస్తోంది. 

పుణే  నగరంలోని  శివాజీనగర్ ప్రాంతాన్ని కేంద్రంగా తీసుకుని అత్యధిక కాలుష్యం విడుదల చేసే పాత వాహనాల  ప్రవేశాన్ని నియంత్రించేందుకు అక్కడి మున్సిపల్ సంస్థ ప్రణాళిక రూపొందిస్తోంది.  బీఎస్-3, అంతకంటే  పాత వాహనాలపై  ఆంక్షలు విధించడం, కాలుష్య ఛార్జీలు అమలు చేయడం, పబ్లిక్  ట్రాన్స్​పోర్ట్​ను  ప్రోత్సహించడం వంటి చర్యలు ఇందులో భాగం.  ఈ ప్రణాళిక అమలైతే  భారతదేశంలో అధికారికంగా ‘లో ఎమిషన్ జోన్’ అమలు చేసిన తొలి నగరంగా పుణే  నిలవనుంది. 

ఇది కేవలం ఒక పరిపాలనా నిర్ణయం మాత్రమే కాదు.  భవిష్యత్తులో  భారత నగరాలు ఏ  దిశగా వెళ్లబోతున్నాయో తెలిపే సంకేతం కూడా. ఎందుకంటే  దేశంలోని చాలా నగరాలు ఇప్పుడు గాలి కాలుష్య సమస్యను తీవ్రంగా ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా  పిల్లలు,  వృద్ధులు,  కార్మిక వర్గాలు  వాయు కాలుష్య ప్రభావానికి ఎక్కువగా గురవుతున్నారు.  ప్రపంచ ఆరోగ్యసంస్థతోపాటు పలు పర్యావరణ అధ్యయనాలు కూడా భారత నగరాల పరిస్థితిపై పదేపదే  ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి.

‘అభివృద్ధి- కాలుష్యం’
తెలంగాణ  పరిస్థితిని  పరిశీలిస్తే  ముఖ్యంగా హైదరాబాద్ నగరం  ఇప్పుడు ‘అభివృద్ధి- కాలుష్యం’ మధ్య  చిక్కుకున్న నగరంగా  మారుతోంది.  గత  రెండు  దశాబ్దాల్లో  నగరం విపరీతంగా విస్తరించింది.  గచ్చిబౌలి,  హైటెక్ సిటీ, కొండాపూర్,  ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ప్రాంతాలు ఐటీ కేంద్రాలుగా అభివృద్ధి చెందగా, మరోవైపు  ఎల్బీనగర్,  ఉప్పల్,  కూకట్‌‌‌‌‌‌‌‌పల్లి,  మియాపూర్, పటాన్‌‌‌‌చెరు వంటి ప్రాంతాల్లో  జనసాంద్రత వేగంగా పెరిగింది. ఈ విస్తరణతోపాటు వాహనాల సంఖ్య కూడా భారీగా పెరిగింది.  ప్రస్తుతం  హైదరాబాద్‌‌‌‌లో  భారీ సంఖ్యలో  ద్వి చక్ర వాహనాలు,  కార్లు,  కమర్షియల్ వాహనాలు  రోడ్లపై తిరుగుతున్నాయి.

ప్రతిరోజూ ట్రాఫిక్ జామ్‌‌‌‌ సాధారణమైపోయింది. నగరంలోని అన్ని కూడళ్ల ప్రాంతాల్లో గాలి కాలుష్యం,  వాహనాల పొగ ప్రధాన సమస్యలుగా మారుతున్నాయి. కొన్ని అధ్యయనాలు,   కాలుష్య పరిశీలన నివేదికలు  హైదరాబాద్‌‌‌‌లో వాయు నాణ్యతపై  ఆందోళనలు  వ్యక్తం చేస్తున్నాయి.  ముఖ్యంగా  ట్రాఫిక్ అధికంగా ఉండే జంక్షన్‌‌‌‌లలో పీఎం2.5,  పీఎం10 స్థాయిలు అనేక సందర్భాల్లో అనుమతించిన  ప్రమాణాలకు మించి నమోదవుతున్నాయని పర్యావరణ వర్గాలు చెబుతున్నాయి.  విజయవాడ  హైవే మార్గంలో భారీ వాహనాల రాకపోకలు, గిడ్డంగులు, రియల్ ఎస్టేట్ విస్తరణ, నిరంతర నిర్మాణ పనులు గాలి నాణ్యతపై  ప్రభావం చూపుతున్నాయి.

కాలుష్యానికి ప్రధాన కారణాలు 
హైదరాబాద్‌‌‌‌లో కాలుష్యానికి ప్రధాన కారణాలు.. వాహనాల పెరుగుదల,  నిర్మాణ పనులు,  రోడ్లపై దుమ్ము,  పరిశ్రమల కాలుష్యం,   ప్లాస్టిక్,  చెత్త దహనం.  ముఖ్యంగా  పటాన్‌‌‌‌చెరు,  బాలానగర్,  జీడిమెట్ల,  చందానగర్  పరిసర  ప్రాంతాల్లో   పరిశ్రమల  కాలుష్య ప్రభావం  కూడా  కనిపిస్తోంది.  కొన్ని ప్రాంతాల్లో నీటి కాలుష్యం  సమస్యలు కూడా  కొనసాగుతున్నాయి.  ఒకప్పుడు  హైదరాబాద్‌‌‌‌ను ‘సరస్సుల నగరం’ అని పిలిచేవారు.  కానీ,  ఇప్పుడు అనేక చెరువులు  ఆక్రమణలకు  గురయ్యాయి.  హుస్సేన్​సాగర్,  మూసీ నది  పరిసర కాలుష్యం నగర పర్యావరణ  పరిస్థితిని ప్రతిబింబిస్తోంది.

వర్షాలు పడినప్పుడు వరదలు రావడం, ఎండాకాలంలో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవడం కూడా నగర పర్యావరణ అసమతుల్యతకు సంకేతాలు.  అయితే  ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని చెప్పలేం.  హరితహారం కార్యక్రమం ద్వారా చెట్ల పెంపు, ఎలక్ట్రిక్ బస్సుల విస్తరణ,  మెట్రో రైలు అభివృద్ధి, మూసీ పునరుద్ధరణపై చర్యలు, చెరువుల సంరక్షణకు చేపడుతున్న కొన్ని కార్యక్రమాలు సానుకూల చర్యలుగానే చూడాలి.  కానీ,  నగర  విస్తరణ వేగంతో పోలిస్తే  ఈ  చర్యలు మరింత విస్తృతంగా,  సమన్వయంతో  అమలు కావాల్సిన అవసరం ఉంది.

తెలంగాణ ఇతర నగరాల్లో పరిస్థితి 
హైదరాబాద్ మాత్రమే కాదు, తెలంగాణలోని ఇతర నగరాలు కూడా కాలుష్య పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి.   వరంగల్  నగరంలో  ట్రాఫిక్ రద్దీ,  నిర్మాణ పనులు,  దుమ్ము కాలుష్యం  ప్రధాన సమస్యలుగా మారుతున్నాయి. కరీంనగర్,  నిజామాబాద్ నగరాల్లో  వాహనాల సంఖ్య  వేగంగా పెరుగుతుండగా,  సరిపడా పట్టణ ప్రణాళిక లేకపోవడం వల్ల రోడ్ల రద్దీ అధికమవుతోంది.  మార్కెట్ ప్రాంతాలు,  ప్రధాన జంక్షన్‌‌‌‌లలో  గాలి, శబ్ద కాలుష్యం ప్రభావం ఎక్కువగా  కనిపిస్తోంది.  భవిష్యత్తులో  హైదరాబాద్ ఎదుర్కొంటున్న సమస్యలే ఈ నగరాల్లో కూడా తీవ్ర రూపం దాల్చే ప్రమాదం ఉంది. 

మరోవైపు ఉత్తర తెలంగాణలోని మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి ప్రాంతాలు పారిశ్రామిక, బొగ్గు ఆధారిత కార్యకలాపాల  ప్రభావాన్ని  ఎదుర్కొంటున్నాయి.  గనుల తవ్వకాలు, థర్మల్ విద్యుత్ కేంద్రాలు, భారీ వాహనాల రాకపోకలు, పరిశ్రమల విస్తరణ కారణంగా అక్కడ గాలి, దుమ్ము కాలుష్యంపై స్థానికంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అభివృద్ధి పేరుతో పరిశ్రమలు విస్తరిస్తున్నప్పటికీ, అదే సమయంలో పర్యావరణ పరిరక్షణ,  ప్రజారోగ్య రక్షణపై  ప్రాధాన్యత  అవసరం.

పరిష్కార మార్గాలు ఏమిటి? 
కాలుష్య కట్టడికి  తెలంగాణ  ప్రభుత్వం,  నగర పాలక సంస్థలు కొన్ని కీలక చర్యలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.  ముందుగా పబ్లిక్  ట్రాన్స్​పోర్ట్​ను మరింత బలోపేతం చేయాలి.  మెట్రో సేవలు మరిన్ని ప్రాంతాలకు విస్తరించడంతోపాటు  ‘లాస్ట్ మైల్ కనెక్టివిటీ’పై దృష్టి పెట్టాలి. అంటే మెట్రో స్టేషన్ నుంచి ఇంటి వరకు  ప్రజలకు సులభ రవాణా సౌకర్యం ఉండాలి. 

ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్య పెరగాలి.  నడకకు, సైక్లింగ్‌‌‌‌కు అనుకూలమైన ఫుట్‌‌‌‌పాత్‌‌‌‌లు,  ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేయాలి. భారీ నిర్మాణ పనుల్లో దుమ్ము  నియంత్రణ తప్పనిసరి చేయాలి.  పరిశ్రమల్లో  కాలుష్య స్థాయిలను నిరంతరం  పర్యవేక్షించే స్మార్ట్ సెన్సర్  వ్యవస్థలను అమలు చేయాలి.  చెరువులను, పచ్చదనాన్ని రక్షించాలి. 

తెలంగాణకు ముందస్తు హెచ్చరిక 
తెలంగాణ నగరాల భవిష్యత్తు కేవలం ఐటీ టవర్లు, ఫ్లైఓవర్లు,  రియల్ ఎస్టేట్ మీద మాత్రమే ఆధారపడదు. ప్రజలు ఆరోగ్యంగా ఊపిరి పీల్చగల నగరాల నిర్మాణంపైనే నిజమైన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. పర్యావరణ పరిరక్షణ అనేది కేవలం రాజధాని సమస్య కాదు.  తెలంగాణలో  వేగంగా విస్తరిస్తున్న ప్రతి పట్టణీకరణతో ముడిపడిన అంశం. 

పుణే  ఇప్పుడు  ప్రారంభించిన  లో-ఎమిషన్ జోన్  చర్చ  తెలంగాణకు కూడా అవసరం.  అదే సమయంలో దీన్ని ముందస్తు అవకాశంగా చూడాలి. అభివృద్ధి అనేది ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి వచ్చేదిగా ఉండకూడదు.  స్వచ్ఛమైన గాలి,  నీరు ఉన్నప్పుడే ఆ అభివృద్ధికి అర్థం ఉంటుంది.  ప్రభుత్వ సంకల్పం, ప్రజల భాగస్వామ్యం తోడైతేనే తెలంగాణ నగరాలు రేపటి తరానికి ఆరోగ్యకరమైన వారసత్వాన్ని అందించగలవు.

పబ్లిక్​ ట్రాన్స్​పోర్టును ఉపయోగించాలి 
పుణే తరహాలో హైదరాబాద్‌‌‌‌లో కూడా కొన్ని అత్యధిక కాలుష్య ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక కాలుష్య నియంత్రణ జోన్లను ఏర్పాటు చేసే ఆలోచన అవసరం.  ముఖ్యంగా నగరంలోని ప్రతి పధాన జంక్షన్​ ప్రాంతాల్లో వాహన కాలుష్య నియంత్రణపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. 

కాలుష్య నియంత్రణ అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు.  ప్రజల భాగస్వామ్యం కూడా అంతే అవసరం. సాధ్యమైనంత వరకు ప్రైవేట్ వాహనాల వినియోగాన్ని తగ్గించడం, పబ్లిక్ ట్రాన్స్​పోర్ట్ ఉపయోగించడం జరగాలి. 15 ఏండ్లు దాటిన వాహనాలను,  బైక్​లను నగరంలో నిషేధించాల్సిన అవసరం ఉంది.

పాపని నాగరాజు

* ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ openpage@v6velugu.com

* రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి.

* స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.