- సెనేటర్ రోనాల్డ్ అరెస్ట్ నేపథ్యంలో ఉద్రిక్తత
మనీలా: ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలోని సెనేట్ భవనం బుధవారం రణరంగంగా మారింది. సెనేటర్ రోనాల్డ్ బాటో డెలా రోసా అరెస్టు ప్రయత్నాల నేపథ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు కాల్పులకు దారితీశాయి. భవనం లోపల రెండుసార్లు తుపాకీ శబ్దాలు వినిపించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. సెనేట్ కాంప్లెక్స్ లోపల కాల్పుల శబ్దం వినిపించడమే కాకుండా, భవనం ప్రధాన ప్రవేశ ద్వారాన్ని బద్ధలు కొట్టినట్లు సమాచారం.
ఆ సమయంలో లోపల ఉన్న జర్నలిస్టులు, మీడియా ప్రతినిధులు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. అయితే, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సెనేట్ సెక్రటరీ మార్క్ లాండ్రో మెన్డోజా వెల్లడించారు. మాజీ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటెర్టే హయాంలో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో అనేక హత్యలు జరిగాయని, ఇది తీవ్ర నేరమని అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) పేర్కొంది.
ఈ క్రమంలో నాటి పోలీస్ చీఫ్, ప్రస్తుత సెనేటర్ డెలా రోసాను అరెస్టు చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు, అరెస్టు నుంచి తప్పించుకోవడానికి డెలా రోసా గత రెండ్రోజులుగా సెనేట్ భవనంలోనే తలదాచుకున్నారు.
