మహిళలు ప్రతిఘటన శక్తులై ముందుకు సాగుతున్నారు. ఇప్పుడు బాధిత మహిళలు కేవలం కన్నీటి ప్రతీకలు కాదు,
ప్రశ్నించే స్వరాలు. ఉద్యమాల ప్రతినిధులుగా, రాజకీయ నాయకత్వంగా, ఎదుగుతున్న శక్తులుగా నిలుస్తున్నారు. తమపై జరిగిన అన్యాయాన్ని వ్యక్తిగత విషాదంగా కాకుండా సామాజిక సమస్యగా ప్రజల ముందుపెట్టి పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో గెలిచిన ముగ్గురు బాధిత మహిళలు విజయం ఇందుకు నిదర్శనం.
ఇటీవల పశ్చిమ బెంగాల్లో కలిత మాఝీ, రేఖా పాత్ర, రత్నా దేభనాథ్.. ఈ ముగ్గురు మహిళల గెలుపు శతాబ్దాలుగా అణచివేత, అవమానం, లైంగిక హింస, సామాజిక అన్యాయాలను భరించిన అట్టడుగు వర్గాల స్త్రీల తిరుగుబాటు స్వరంగా నిలిచింది. ఈ ముగ్గురు మహిళల విజయం భారత ప్రజాస్వామ్యంలో ఒక కొత్త సంకేతం.
- బాధితుల తిరుగుబాటు విజయం
కలిత మాఝీ ఒక పేద కుటుంబ మహిళ. ఇంటి పనులు చేస్తూ నెలకు రూ.2500 సంపాదించే ఆమె జీవితం భారత గ్రామీణ పేద మహిళల వాస్తవ చిత్రం. చదువు ఆగిపోయినా, అవకాశాలు లేకపోయినా, ఆమె ఆశలు ఆగలేదు. రాజకీయం ధనికులకు, అగ్రవర్ణాలకు మాత్రమే అన్న భ్రమను ఆమె ఛేదించింది. ఆమె విజయం మహిళా కూలీల చేతుల్లో కూడా రాజకీయం ఒక ఆయుధమవుతుందని నిరూపించింది. రేఖా పాత్ర సందేశ్‌ఖాళిలో మహిళలపై జరిగిన లైంగిక దాడులు, భూకబ్జాలు, రాజకీయ అరాచకాలపై గళమెత్తింది. బాధితురాలు కేవలం కన్నీరు కార్చేది కాదు.. వ్యవస్థను ప్రశ్నించే నాయకురాలిగా కూడా ఎదుగుతుంది అని ఆమె పోరాటం నిరూపించింది. రత్నా దేభనాథ్ పోరాటం ఒక తల్లి సామాజిక తిరుగుబాటు.
తన కుమార్తెపై ఓ మెడికల్ కళాశాలలో జరిగిన దారుణ హత్యాచారాన్ని సమాజంలోని మహిళల భద్రత, న్యాయం, గౌరవానికి సంబంధించిన ప్రశ్నగా మార్చింది. ఒక తల్లి కన్నీరు ప్రజా ఆవేదనగా మారినప్పుడు అది ఉద్యమ రూపం దాలుస్తుంది. ఈ ముగ్గురు మహిళలు పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో విజయం భారత ప్రజాస్వామ్యంలో మహిళల తిరుగుబాటుకు దక్కిన గెలుపు.
- మహిళా రాజకీయాల్లో నూతన శకం
మహిళల అభివృద్ధి లేకుండా ప్రజాస్వామ్యం అసంపూర్ణమని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్పష్టంగా చెప్పారు. ‘ఒక సమాజ అభివృద్ధిని ఆ సమాజంలోని మహిళల స్థితిని బట్టి కొలుస్తాను’ అనే మాటలు మహిళా విముక్తిపై ఆయన దృక్పథాన్ని తెలియజేస్తాయి. కలిత మాఝీ, రేఖా పాత్ర, రత్నా దేభనాథ్- ఈ ముగ్గురు మహిళల రాజకీయ విజయం మహిళా రాజకీయాల్లో నూతన శకం. బాధను బలంగా మార్చుకున్నప్పుడు చరిత్ర కొత్త దారులు తెరుస్తుంది. మౌనంగా ఉన్న ప్రజలు మాట్లాడడం ప్రారంభించినప్పుడు అధికార అహంకారం కూలిపోతుంది. ఈ ముగ్గురు మహిళల విజయాల వెనుక బీఆర్ అంబేద్కర్ నిర్మించిన రాజ్యాంగం, సమానత్వం, స్వేచ్ఛ, సామాజిక న్యాయం, పూ
లే దంపతుల భావజాలం, మహిళా చైతన్యం, పెరియర్ ఇ.వి రామస్వామి ప్రేరేపించిన స్వాభిమాన ఉద్యమం- ప్రతిధ్వనిస్తున్నాయి. ఈ గెలుపులు అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన సామాన్య మహిళల ఆత్మగౌరవ గెలుపు. వ్యక్తిగత బాధను ప్రజా ఉద్యమంగా మార్చుకుని, ప్రజల మద్దతుతో ఎన్నికల్లో గెలవడం ఒక కొత్త రాజకీయ ధోరణిని సూచిస్తోంది. ఇది ప్రజల్లో కూడా ఒక చైతన్యాన్ని పెంచుతోంది.
బాధితురాలిని కేవలం జాలి చూపాల్సిన వ్యక్తిగా కాకుండా, సమాజ మార్పుకు నాయకత్వం వహించే శక్తిగా చూడడం ప్రారంభమైంది. ఆ ముగ్గురు బాధిత మహిళల గెలుపు ప్రతి మహిళకు ఆదర్శం కావాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళల ఉన్నతికి సరైన మార్గం రాజకీయ అధికారమే. దళిత, బహుజనులతోపాటు మహిళలు అధికారంలోకి వచ్చినప్పుడే సామాజిక
సమానత్వం సాధ్యమవుతుంది.
భారత ప్రజాస్వామ్యం ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించిన వ్యవస్థగా చెప్పకుంటున్నా..
వాస్తవ సమాజంలో మహిళల పరిస్థితి ఇంకా అనేక అసమానతలతో నిండి ఉంది.
ముఖ్యంగా లైంగిక హింస, కుల వివక్ష, పేదరికం, సామాజిక అవమానం, కుటుంబ అణచివేతను ఎదుర్కొన్న బాధిత మహిళల జీవితం మరింత కఠినంగా ఉంటుంది. కానీ, నేటి భారత ప్రజాస్వామ్యంలో ఆ పరిస్థితి నెమ్మదిగా మారుతోంది.
- సంపతి రమేష్
సోషల్ ఎనలిస్ట్
