ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు కేవలం పాఠ్యపుస్తకాల పరిజ్ఞానంతో మాత్రమే ముందుకు సాగలేరు. జీవితంలో విజయవంతం కావాలంటే జీవన నైపుణ్యాలు ఎంతో కీలకమైనవి. ప్రతి విద్యార్థిలో అపారమైన ప్రతిభ దాగి ఉంటుంది. సరైన మార్గదర్శకత్వం, ప్రోత్సాహం, జీవన నైపుణ్యాలు అందిస్తే వారు గొప్ప వ్యక్తులుగా ఎదుగుతారు. విద్య అనేది జీవితాన్ని మార్చే శక్తి. విద్య అనేది కేవలం మార్కులు సాధించడానికి మాత్రమే కాకుండా, వ్యక్తిత్వ వికాసం, సామాజిక బాధ్యత, నాయకత్వ లక్షణాలు, మానవీయ విలువలను పెంపొందించేందుకు దోహదపడాలి.
నేటి పిల్లలు సాంకేతిక పరిజ్ఞానంలో ముందంజలో ఉన్నప్పటికీ, భావోద్వేగ నియంత్రణ, సమస్య పరిష్కార నైపుణ్యాలు, సమయపాలన, సహనం, క్రమశిక్షణ వంటి అంశాల్లో మరింత శిక్షణ అవసరం. చిన్నప్పటి నుంచే పిల్లలకు జీవన నైపుణ్యాలను నేర్పించడం ద్వారా వారు భవిష్యత్తులో సమాజానికి ఉపయోగపడే బాధ్యత గల పౌరులుగా ఎదుగుతారు.
ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలి
పిల్లలలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి పనిచేయాలి. పిల్లలపై అనవసర ఒత్తిడి తీసుకురాకుండా, వారి ఆసక్తులు, ప్రతిభలను గుర్తించి ప్రోత్సహించాలి.
విద్యార్థులకు పుస్తకజ్ఞానంతోపాటు నైతిక విలువలు, సేవాభావం, దేశభక్తి, పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహన కల్పించడం అత్యంత అవసరం.
సోషల్ మీడియా, మొబైల్ ఫోన్ల అధిక వినియోగం వల్ల పిల్లలు మానవ సంబంధాలకు దూరమవుతున్నారు. వేసవి కాలంలో పిల్లలను క్రీడలు, పుస్తక పఠనం, సృజనాత్మక కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాల వైపు మళ్లిస్తే పిల్లలలో వ్యక్తిత్వ వికాసం సాధ్యపడుతుంది.
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు సరైన మార్గదర్శకత్వం, కౌన్సెలింగ్ అందించడం ద్వారా వారి భవిష్యత్తును తీర్చిదిద్దవచ్చు. తల్లిదండ్రులు పిల్లల్ని గమనిస్తూ, వారు విద్యాపరంగా, సామాజికపరంగా జీవితంలో ఎదురయ్యే ఒత్తిడులు, వైఫల్యాలను ధైర్యంగా ఎదుర్కొనేలా మానసిక దృఢత్వాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉంది. కమ్యూనికేషన్ స్కిల్స్, టీమ్ వర్క్, నాయకత్వ లక్షణాలు, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం వంటి జీవన నైపుణ్యాలు భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు పొందడంలో కూడా ఎంతో దోహదపడతాయి.
డా. మొహమ్మద్ ఆజమ్ అలీ, అసిస్టెంట్ ప్రొఫెసర్, రాష్ట్రపతి సేవా పురస్కార గ్రహీత
* ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ఐడీ [email protected]
* రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి.
* స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.
