సిమ్లా: ఐపీఎల్ 19లో భాగంగా గురువారం (మే 14) హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతోన్న మ్యాచులో పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 200 పరుగుల భారీ స్కోర్ చేసింది. పంజాబ్ బ్యాటర్లలో ఓపెనర్ ప్రభ్సిమ్రాన్ సింగ్ (572) హాఫ్ సెంచరీతో ఆకట్టుకోగా.. ప్రియాంష్ ఆర్య (22), కన్నోలి (21), ఓమర్జాయ్ (38) రాణించారు. ముంబై బౌలర్లలో శార్ధూల్ ఠాకూర్ 4 వికెట్లతో చెలరేగగా.. దీపక్ చాహర్ రెండు, రాజ్ బవా, కార్బిన్ బాష్ చెరో వికెట్ తీశారు.
ఆకట్టుకున్న ప్రభ్‌సిమ్రాన్‌సింగ్.. చివర్లో ఓమర్జాయ్ మెరుపు ఇన్నింగ్స్
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్‌కు ఓపెనర్స్ ప్రియాంష్ ఆర్య (22), ప్రభ్‌సిమ్రాన్‌సింగ్ (57) శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు 50 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పారు. ఈ దశలో దీపక్ చాహర్ అద్భుతమైన బంతికి ప్రియాంష్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కూపర్ కన్నోలి (21) ప్రభ్సిమ్రాన్ సింగ్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. వేగంగా ఆడే క్రమంలో శార్థూల్ ఠాకూర్ బౌలింగ్‌లో ప్రభ్సిమ్రాన్ సింగ్ ఔట్ అయ్యారు.
ఈ దశలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ అయ్యర్ పూర్తిగా నిరాశపర్చాడు. కేవలం 4 పరుగులు మాత్రమే చేసి శార్థూల్ ఠాకూర్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఆ తర్వాతి ఓవర్లోనే ఇన్ఫామ్ బ్యాటర్ కన్నోలి (21) కూడా పెవిలియన్ బాట పట్టాడు. ఇక్కడి నుంచి ముంబై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పంజాబ్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. సూర్యాంష్ షెడ్జ్ (8), శశాంక్ సింగ్ (2), మార్కో యాన్సెన్ (2) వరుసగా వికెట్లు కోల్పోయారు. దీంతో పంజాబ్ తక్కువ స్కోర్‌కే పరిమితమయ్యేలా కనిపించింది. కానీ చివర్లో ఓమర్జాయ్ (38), విష్ణు వినోద్ (15) , బార్ట్లెట్ (18) మెరుపులు మెరిపించడంతో పంజాబ్ 200 పరుగుల మార్క్ చేరుకుంది.
