ఐపీఎల్ అంటే బ్యాటింగ్, బౌలింగ్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్న ఫ్యాన్స్ కు తొలిసారి ఒక ప్లేయర్ తన ఫీల్డింగ్ తో మైండ్ బ్లోయింగ్ చేశాడు.
నమ్మశక్యం కాని క్యాచ్ ను తీసుకొని కాసేపు ప్లేయర్స్ తో పాటు స్టేడియాన్ని షాక్ కు గురి చేశాడు. ఏదో మ్యాజిక్ చేసినట్టుగా సింగిల్ హ్యాండ్ తో క్యాచ్ పట్టి సంచలనంగా మారాడు. ఇప్పటివరకు ఈ సీజన్ లో బ్యాటింగ్ చేసే అవకాశం రాకపోయినా తన ఫీల్డింగ్ తో ఒక్కసారిగా వైరల్ అవుతున్నాడు. ఐపీఎల్ లో ప్రతి సీజన్ లో ఆడుతూ వస్తున్న ఆ వెటరన్ ప్లేయర్ ఎవరో కాదు మనీష్ పాండే. ప్రస్తుత సీజన్ లో కోల్ కతా నైట్ రైడర్స్ తరపున ఆడుతున్న మనీష్ పాండే నిన్న రాయల్ ఛాలెంజర్స్ తో జరిగిన మ్యాచ్ లో తన ఫీల్డింగ్ విన్యాసాలతో అబ్బురపరిచాడు.
193 పరుగుల టార్గెట్ ఛేజ్ చేస్తున్న RCB దాదాపు తమ విజయాన్ని ఖరారు చేసుకుంది. ఇక 14 బంతుల్లో 13 పరుగులు చేస్తే విజయం సాధిస్తుంది. అయితే కార్తీక్ త్యాగి వేసిన 18 ఓవర్ లో ఒక అద్భుతం జరిగింది. ఐదో బంతిని టిమ్ డేవిడ్ ఆఫ్ సైడ్ బలంగా కట్ షాట్ ఆడాడు. టిమ్ డేవిడ్ ఆడిన ఈ షాట్ వేగంగా పాయింట్ వైపుకు దూసుకెళ్లింది. అయితే అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న మనీష్ పాండే లెఫ్ట్ సైడ్ డైవ్ చేయడమే కాదు దూరంగా వేగంగా వెళ్తున్న బంతిని చాలా షార్ప్ గా అందుకున్నాడు. ఫుల్ లెంగ్త్ డైవ్ చేస్తూ సింగిల్ హ్యాండ్ తో బాల్ అందుకోవడం ఇక్కడ మరో హైలెట్. క్యాచ్ పట్టగానే బౌలర్ కార్తీక్ త్యాగి నమ్మలేకపోయాడు. రెండు చేతులు తలపై పెట్టుకొని షాకయ్యాడు. ఇక నాన్ స్ట్రైకింగ్ లో ఉన్న విరాట్ కోహ్లీ, బ్యాటింగ్ చేస్తున్న టిమ్ డేవిడ్ సైతం మనీష్ పాండే పట్టిన క్యాచ్ కు స్టన్నయ్యారు.
కోహ్లీ అయితే అసలు నమ్మలేకపోయాడు. క్యాచ్ తర్వాత పాండేను కోహ్లీ అభినందించాడు. ఈ క్యాచ్ ఫీల్డింగ్ దిగ్గజం జాంటీ రోడ్స్ ను గుర్తు చేసింది. 36 ఏళ్ళ వయసులో ఫిట్ నెస్ కాపాడుకొని బ్యాటింగ్ చేయొచ్చు. కొంచెం కష్టపడి బౌలింగ్ కూడా చేయొచ్చు. కానీ ఫీల్డింగ్ అంటే అది మనీష్ పాండేకు మాత్రమే సాధ్యమవుతుంది అనేలా చేసి చూపించాడు. ఈ మ్యాచ్ లో KKR ఓడిపోయినా మనీష్ పాండే క్యాచ్ మ్యాచ్ మొత్తానికే హైలెట్ గా నిలిచింది. ఈ సీజన్ ప్రారంభానికి ముందు కూడా KKR వార్మప్ మ్యాచ్ లో భాగంగా మనీష్ పాండే లాంగాఫ్ లో తన ఫీల్డింగ్ తో దుమ్ములేపాడు. ముఖ్యంగా ముందుకు డైవ్ చేస్తూ తీసుకున్న క్యాచ్ లు మైండ్ బ్లోయింగ్ అనేలా ఉన్నాయి.
►ALSO READ | IPL 2026: ముంబై కెప్టెన్‌గా బుమ్రా.. పంజాబ్‌తో మ్యాచ్‌కు పాండ్య, సూర్య దూరం..!
36 ఏళ్ళ వయసులో ఇలాంటి ఫీల్డింగ్ విన్యాసాలు అంటే మామూలు విషయం కాదు. ఫీల్డింగ్ లో తనకు తానే సాటి అని.. ఫిట్ నెస్ లో తనకు తిరుగులేదని మరోసారి మనీష్ పాండే నిరూపించాడు. ఫిట్ నెస్, ఫీల్డింగ్ విషయంలో కోహ్లీకి ఏ మాత్రం తీసిపోడని నెటిజన్స్ నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. గత సీజన్ లో మూడు మ్యాచ్ ల్లోనే ఆడే ఛాన్స్ వచ్చినా బ్యాటింగ్ లో ఆకట్టుకున్నాడు. మూడు మ్యాచ్ ల్లో 92 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. ఈ సీజన్ లో ప్లేయింగ్ 11లో ఛాన్స్ వచ్చినా ఒక్కసారి కూడా బ్యాటింగ్ ఆడే అవకాశం రాలేదు.
