గవర్నర్లను బీజేపీ ఏజెంట్లలా వాడుకుంటోంది : మంత్రి జగదీష్ రెడ్డి

గవర్నర్లను బీజేపీ ఏజెంట్లలా వాడుకుంటోంది : మంత్రి జగదీష్ రెడ్డి

రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడానికి గవర్నర్లను బీజేపీ ఏజెంట్లలా వాడుకుంటోందని మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. కేంద్రంలో ప్రధాని మోడీ కార్యక్రమాలను రాష్ట్రపతి అడ్డుకోనప్పుడు రాష్ట్రాలలో గవర్నర్లు అడ్డుకోవడం ఎందుకు అని ప్రశ్నించారు. నిర్ణీత వ్యవధిలో బిల్లుల ఆమోదం కోసం సుప్రీంని ఆశ్రయించాల్సి వస్తోందన్న ఆయన.. ప్రభుత్వ కార్యక్రమాలను అడ్డుకోవడం గవర్నర్ పని కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వాల కంటే మెరుగ్గా పనిచేస్తోన్న ఇతర పార్టీల ప్రభుత్వాల అభివృద్ధిని కేంద్ర అడ్డుకుంటోందని మంత్రి కామెంట్ చేశారు.

తెలంగాణ మోడల్ అభివృద్ధిని దేశమంతా అడుగుతున్నారని అక్కసుతో దుర్మార్గం చేస్తున్నారని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ ని, తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవాలనే ఆలోచనతో కేంద్రం నాటకాలు చేస్తోందన్న ఆయన.. శాసన సభ ప్రసంగంలో చెప్పిన అభివృద్ధి కార్యరూపం దాల్చకుండా గవర్నర్ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఉపన్యాసంలో ఒకటి చెప్పి రాజ్ భవన్ లో చేసేది మరొకలా ఉందంటూ మంత్రి మండిపడ్డారు. గవర్నర్ తీరు భారత రాజ్యాంగం వ్యవస్థకు మంచిది కాదని, గవర్నర్ చర్యలు రాష్ట్ర అభివృద్ధికి ఆటంకంలా మారుతున్నాయని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి అడ్డుకోవడమంటే దేశ అభివృద్ధిని అడ్డకోవడమేనని ఆయన వ్యాఖ్యానించారు.