
- నిరుడు దాసోజు, కుర్ర సత్యనారాయణ పేర్లను నామినేట్ చేసిన బీఆర్ఎస్ సర్కార్
- సర్వీస్ అంశం లేదని ఆ ప్రతిపాదనలు పక్కనబెట్టిన గవర్నర్ తమిళిసై
- అప్పట్లోనే హైకోర్టులో పిటిషన్ వేసిన దాసోజు, కుర్ర.. 23న విచారణ
హైదరాబాద్, వెలుగు : గవర్నర్ కోటా ఎమ్మెల్సీల భర్తీపై గవర్నర్ తమిళిసై కీలక ప్రకటన చేశారు. దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ దాఖలు చేసిన రిట్ పిటిషన్పై హైకోర్టు తీర్పు వచ్చే వరకు కొత్త ప్రపోజల్స్ను తీసుకోబోనని స్పష్టం చేశారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణను నామినేట్ చేస్తూ నిరుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపగా.. అప్పట్లో గవర్నర్ పక్కన పెట్టడంతో ఆ ఇద్దరు నేతలు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై ఈ నెల 23న కోర్టులో విచారణ జరగనుంది. రిట్ పిటిషన్ పై తుది తీర్పు వచ్చే వరకు ప్రస్తుత ప్రభుత్వం నామినేట్ చేయాలని పంపే పేర్ల ప్రతిపాదనలను తీసుకోలేనని బుధవారం గవర్నర్ తమిళిసై ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. గవర్నర్ కోటాలో రెండు ఎమ్మెల్సీల భర్తీ కోసం త్వరలో రాష్ట్ర ప్రభుత్వం పేర్లను పంపనున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో గవర్నర్ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకున్నది.
సర్వీస్ రంగం చేర్చకపోవడంతో..!
దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ చేస్తూ గత ఏడాది జులైలో అప్పటి కేబినెట్ తీర్మానం చేసి గవర్నర్ కు పంపింది. అయితే ఈ ప్రతిపాదనలపై గవర్నర్ నిర్ణయం తీసుకోకుండా పెండింగ్ లో ఉంచి అదే ఏడాది సెప్టెంబర్ 19న తిరస్కరించారు. ప్రతిపాదనలోని ఇద్దరు నేతలు పొలిటికల్ లీడర్స్ అని.. సర్వీస్ రంగంలోని వారికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా చాన్స్ ఉంటుందని, కానీ, ఆ ఇద్దరు లీడర్ల సర్వీస్ గురించి ప్రభుత్వం పేర్కొనలేదని, అందుకే తాను ఆమోదించలేదని గవర్నర్ వెల్లడించారు. వీరి ప్లేస్ లో వేరే వ్యక్తుల పేర్లు పంపాలని గవర్నర్ సూచించినప్పటికీ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పంపించలేదు. కేబినెట్ ఆమోదంతో నామినేట్ చేసిన ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను గవర్నర్ తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ను ఈ నెల 23న సీజే బెంచ్ విచారించనుంది.