ఇయ్యాల,రేపు ( జూలై 21,22) స్కూళ్లు, కాలేజీలకు సెలవు

ఇయ్యాల,రేపు ( జూలై 21,22) స్కూళ్లు,  కాలేజీలకు సెలవు

హైదరాబాద్, వెలుగు: భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థలకు గురు, శుక్రవారం సెలవులు ప్రకటించింది. జీహెచ్ఎంసీ పరిధిలో విద్యాసంస్థలతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు ఆఫీసులకు శుక్ర, శనివారం హాలీడేస్ ఇచ్చింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సెలవుపై నిర్ణయం తీసుకున్నట్టు గురువారం ఉదయం 8.18 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ట్విట్టర్‌‌‌‌లో వెల్లడించారు. అయితే, ఈ సమాచారం పేరెంట్స్, టీచర్లు, మేనేజ్​మెంట్లకు ఆలస్యంగా చేరింది. దీంతో అప్పటికే చాలామంది స్టూడెంట్లు, టీచర్లు స్కూళ్లు, కాలేజీలకు వెళ్లారు. వచ్చిన విద్యార్థులతో కొన్ని స్కూళ్లు, కాలేజీలు కొనసాగాయి. కొన్ని ప్రైవేటు స్కూళ్లు పిల్లలను ఇంటికి పంపాయి. భారీ వర్షాలుంటాయని మూడు, నాలుగు రోజుల నుంచి వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నా.. సర్కారు తేరుకోకపోవడంపై పేరెంట్స్ మండిపడ్డారు.  

జీహెచ్​ఎంసీ పరిధిలో ఇయ్యాల, రేపు..

జీహెచ్ఎంసీ పరిధిలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ ఆఫీసులకు శుక్ర, శనివారాలు సెలవులు ప్రకటించారు. ప్రైవేట్​ఆఫీసులకు సెలువులు ఇచ్చేలా లేబర్​ డిపార్ట్​మెంట్ చర్యలు చేపట్టాలన్నారు. వర్షాల నేపథ్యంలో వైద్య సేవలు, ప్రజలకు అవసరమైన అత్యవసర సేవలు యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు.

మూడు వర్సిటీల్లో పరీక్షాలు వాయిదా 

సర్కారు ఆదేశాలతో ఓయూ, అంబేద్కర్ ఓపెన్ వర్సిటీతో పాటు పలు వర్సిటీల్లోని 20, 21 తేదీల్లో జరిగే పరీక్షలను వాయిదా వేశారు. త్వరలో కొత్త తేదీలను ప్రకటిస్తామని ఓయూ రిజిస్ట్రార్ లక్ష్మీనారాయణ వెల్లడించారు. వర్సిటీ పరిధిలోని అన్ని కాలేజీలు మూసివేయాలని ఆదేశించారు. జేఎన్టీయూ పరిధిలో 21న జరిగే బీటెక్, బీఫార్మసీ పరీక్షలను 26న నిర్వహిస్తామని ఆ వర్సిటీ రిజిస్ట్రార్ తెలిపారు. అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ ఆధ్వర్యంలో ఏపీ, తెలంగాణలో జరిగే పరీక్షలు వాయిదా వేస్తున్నామని ఆ వర్సిటీ రిజిస్ట్రార్ తెలిపారు.