ఎఫ్‌‌ఎంజీ హౌజ్ సర్జన్లకు 80 శాతం కోత

ఎఫ్‌‌ఎంజీ హౌజ్ సర్జన్లకు 80 శాతం కోత

హైదరాబాద్, వెలుగు: మెడికోల స్టైపండ్‌‌ను ఇటీవల15 శాతం (రూ.3,379) పెంచిన ప్రభుత్వం అంతలోనే యూటర్న్‌‌ తీసుకుంది. విదేశాల్లో మెడిసిన్ చేసి రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఇంటర్న్‌‌షిప్ చేస్తున్న హౌజ్ సర్జన్ల స్టైపండ్‌‌లో 80 శాతం(రూ.20,596) కోత పెట్టింది. నేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనల ప్రకారం.. లోకల్‌‌ స్టూడెంట్స్‌‌తో సమానంగా ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్‌‌(ఎఫ్ఎంజీ)కు స్టైపండ్ చెల్లించాలి. ఈ లెక్కన ఒక్కో హౌస్​ సర్జన్‌‌కు నెలకు రూ.25,906 చొప్పున ఇవ్వాలి. కానీ, ఇందుకు విరుద్ధంగా ఇకపై రూ.5 వేల చొప్పున మాత్రమే ఇవ్వాలని సర్కార్ నిర్ణయించింది.

ఈ మేరకు గతంలో ఇచ్చిన జీవోలో మార్పులు చేసి కొత్త జీవో విడుదల చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఇంటర్న్‌‌షిప్ చేస్తున్న ఎఫ్‌‌ఎంజీలకు ఇకపై రూ.5 వేల చొప్పున మాత్రమే స్టైపండ్ ఇవ్వాలని జీవోలో పేర్కొన్నారు. ఈ జీవోను ఎఫ్ఎంజీలతో పాటు, లోకల్ స్టూడెంట్స్‌‌ కూడా వ్యతిరేకిస్తున్నారు. ప్రైవేటు మెడికల్ కాలేజీల యాజమాన్యాలకు లబ్ధి చేకూర్చేందుకే సర్కార్ ఈ నిర్ణయం తీసుకుందని డాక్టర్లు ఆరోపిస్తున్నారు. ఎఫ్‌‌ఎంజీలు కూడా లోకల్‌‌ ఇంటర్న్స్‌‌తో సమానంగా డ్యూటీలు చేస్తారని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని హెల్త్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది.