317 జీవో బాధిత టీచర్లను మరోసారి మోసం చేసిన సర్కార్

317 జీవో బాధిత టీచర్లను మరోసారి మోసం చేసిన సర్కార్

రెండేండ్ల స్టేషన్ సర్వీస్ ఉంటేనే చాన్స్

 

  •     జీరో సర్వీస్​తో బదిలీలు చేయాలని యూనియన్ల విజ్ఞప్తి 
  •     పట్టించుకోని ప్రభుత్వం.. ఆందోళనలో 25 వేల మంది టీచర్లు

హైదరాబాద్, వెలుగు: 317 జీవో బాధిత టీచర్లను సర్కార్ మరోసారి మోసం చేసింది. ప్రస్తుతం జరుగుతున్న సాధారణ బదిలీల్లో అవకాశం ఇవ్వబోమని తేల్చి చెప్పింది. 317 జీవో తెచ్చి 25 వేల మంది టీచర్లను సొంత జిల్లాలో కాకుండా ఇతర జిల్లాల్లో సర్కార్ సర్దుబాటు చేసింది. దీంతో వాళ్లందరూ తమ కుటుంబాలను వదిలి,  మారుమూల ప్రాంతాల్లో పని చేయాల్సి వస్తోంది. ఇప్పుడు జరుగుతున్న సాధారణ బదిలీల్లో అయినా సొంత ప్రాంతానికి వద్దామని అనుకుంటే, వాళ్లకు ప్రభుత్వం ఆ అవకాశమూ ఇవ్వడం లేదు. దీంతో బాధిత టీచర్లు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో 1.05 లక్షల మంది టీచర్లు ఉండగా, వీరికి 2018లో సాధారణ బదిలీలు జరిగాయి. మళ్లీ ఈ నెల 27 నుంచి బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ ప్రారంభిస్తామని సర్కార్ ప్రకటించింది. అయితే ఏడాది కింద కొత్త జిల్లాలు, జోన్లకు అనుగుణంగా జీవో 317 ద్వారా టీచర్లను కేటాయించారు. ఈ అలాట్ మెంట్ ప్రక్రియలో రాష్ట్రంలోని టీచర్లందరూ పాల్గొన్నప్పటికీ, దాదాపు 25 వేల మందికి మాత్రమే బదిలీ జరిగింది. వీళ్లందరికీ సొంత జిల్లాలో కాకుండా ఇతర జిల్లాల్లో పోస్టింగ్ ఇచ్చారు. సీనియర్లందరూ పట్టణ ప్రాంతాల్లో ఉండిపోగా, జూనియర్లు మాత్రం జిల్లాలు, ఇతర మారుమూల ప్రాంతాలకు అలాట్ అయ్యారు. ఆ టైమ్​లో టీచర్లంతా పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. కానీ సర్కార్ పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పటికీ ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. కుటుంబాలను వదిలి వందలాది కిలోమీటర్ల దూరంలో పని చేయాల్సి వస్తోందని బాధిత టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క 13 జిల్లాల్లో స్పౌజ్ బదిలీలు బ్లాక్ చేయగా, ఆ జిల్లాల్లోని స్పౌజ్ టీచర్లూ పోరాటం చేస్తున్నారు.

జీరో సర్వీస్ తో చేయరట!

రూల్స్ ప్రకారం స్టేషన్ సర్వీస్ 8 ఏండ్లు పూర్తయినోళ్లు తప్పనిసరిగా స్కూల్ మారాల్సి ఉంటుంది. ఇక రెండేండ్ల స్టేషన్ సర్వీస్ పూర్తయినోళ్లే బదిలీలకు అర్హులు. దీని ప్రకారం ఏడాది కింద 317 జీవో ద్వారా బదిలీ అయినోళ్లకు ఇప్పుడు అవకాశం ఉండదు. అయితే ఇటీవల అధికారులు, టీచర్ల సంఘాలతో మంత్రి సబితారెడ్డి సమావేశాలు నిర్వహించినప్పుడు దీనిపై చర్చ జరిగింది. జీరో సర్వీస్​తోనే బదిలీలు చేయాలని టీచర్ల సంఘాలు కోరాయి. అప్పుడు పరిశీలిస్తామని చెప్పిన సర్కారు పెద్దలు.. ఇప్పుడు ఒప్పుకోవడం లేదు. కాగా, జీవో 317 అలాట్మెంట్ల టైమ్ లో కేవలం మూరుమాల ప్రాంతాల్లోని ఖాళీలనే చూపించారని.. పట్టణ ప్రాంతాల్లోని ఖాళీలను చూపించలేదని టీచర్లు ఆరోపిస్తున్నారు. జీవో 317తో సాధారణ బదిలీలు జరగలేదని, కేవలం కొత్త జిల్లాలకు అలాట్మెంట్ మాత్రమే చేశారని అంటున్నారు. వాటిని బదిలీలుగా ఎలా చూస్తారని ప్రశ్నిస్తున్నారు. 

మాకూ చాన్స్ ఇవ్వాలి..

సాధారణ బదిలీలు 2018లో జరిగా యి. 317 జీవో ద్వారా కేవలం జిల్లాల అలాట్మెంట్ ప్రక్రియ మాత్రమే జరిగింది. ప్రభుత్వం మమ్మల్ని బలవంతంగా పక్క జిల్లాలకు పంపించింది. దీంతో ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో ఉన్న స్టేషన్ సర్వీస్ కోల్పోవాల్సి వచ్చింది. 317 జీవో కింద ప్రభుత్వమే బదిలీలు చేసింది. అది మేం కోరుకున్నది కాదు. కాబట్టి ఉమ్మడి జిల్లా స్టేషన్ సర్వీస్ ను పరిగణనలోకి తీసుకొని ఇప్పుడు జరుగుతున్న సాధారణ బదిలీల్లో అవకాశం ఇవ్వాలి. జీవో 317 బాధిత టీచర్లకు న్యాయం చేయాలి. 

‑ నందారం జైపాల్ రెడ్డి, బాధిత టీచర్