పుల్కల్, వెలుగు: ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు ఉచితంగా మెరుగైన వైద్య సేవలు అందజేస్తున్నామని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. గురువారం అందోల్ మండలం డాకూర్ గ్రామంలో ధర్మ శాస్త్ర ఫౌండేషన్, సహారా హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా హెల్త్ క్యాంప్ ను మంత్రి ప్రారంభించి మాట్లాడారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైద్య, ఆరోగ్యరంగాన్ని బలోపేతం చేస్తున్నామని తెలిపారు.
క్యాన్సర్, డయాలసిస్, గుండె, ఎన్సీడి చికిత్సను కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందిస్తున్నామన్నారు. డాకూర్ గ్రామానికి చెందిన ప్రజల ఆరోగ్య స్థితిగతులను తెలుసుకొనేందుకు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రజలు వెన్ను, కీళ్ల నొప్పులు తగ్గేందుకు డాక్టరు సూచనలు లేకుండా పెయిన్ కిల్లర్ వాడడంతో కిడ్నీ సమస్యలు వస్తాయని చెప్పారు. సంగారెడ్డి డీఎంహెచ్ వో వసంత్ కుమార్ ఉన్నారు.
