ప్రభుత్వ హాస్టల్ లో రెంటు దందా

ప్రభుత్వ హాస్టల్ లో రెంటు దందా

సూర్యాపేట : ప్రభుత్వ హాస్టల్ లో బయటి వ్యక్తులకు వసతి కల్పిస్తూ వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్న వార్డెన్ ఉదంతమిది. ఎస్సీ హాస్టల్ లో అడ్మిషన్ తీసుకోవాలంటే ఇంటర్ లేదా డిగ్రీ, పీజీ చదువుతున్న అమ్మాయిలు అర్హులు. ఏదైనా కాలేజీలో అడ్మిషన్ పొందినట్లు రశీదు, కాలేజీ గుర్తిం పు కార్డు ఇస్తే హాస్టల్ లో అడ్మిషన్ ఇవ్వాలి. అర్హత ఉన్నవారికైతే ప్రభుత్వమే స్కాలర్ షిప్ ఇస్తుంది. దీంతోవారికి ఫ్రీగా ఇక్కడ భోజనం, వసతి సదుపాయం కల్పిస్తారు. స్కాలర్ షి ప్ రానివారి నుంచి నామమాత్రపు ఫీజు వసూలు చేసి వసతి, భోజన సౌకర్యం కల్పిస్తారు. అయితే సూర్యాపేట హాస్టల్ లో 10 నుంచి 20 మంది ప్రైవేటు ఉద్యోగం చేసే అమ్మాయిలకు వసతి కల్పించారు. వారి నుంచి రూ. 3 వేల నుంచి 5 వేల వరకు ఫీజుగా వసూలు చేస్తున్నారు.

విషయం తెలిసి ‘వీ6 వెలుగు’ టీమ్ అక్కడకు వెళ్లి వార్డెన్ ను ప్రశ్నించింది. ముందుగా అలాంటిదేంలేదని దబాయించిన వార్డెన్ తర్వాత కొన్ని కులసంఘాల వాళ్లు సిఫార్సు చేస్తే ముగ్గురిని తీసుకున్నానని ఒప్పుకున్నారు. వారి నుంచి రూ. 1500 మాత్రమే తీసుకుంటున్నట్లు తెలిపారు. విషయం బయటకు తెలిసిందంటూ అమ్మాయిలను హాస్టల్ నుంచి ఖాళీ చేయించారు. దీంతో వారంతా సూర్యాపేట రోడ్లమీద హాస్టల్స్ కోసం ఎండలో తిరగాల్సి వచ్చింది. అయితే వేసవి సెలవులు కావడంతో ఎవరూ హాస్టల్ నడపడం లేదు. ఒకరిద్దరికోసం హాస్టల్ నడపలేమని చెబుతుండడంతో 20మంది అమ్మాయిలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.

బతిమాలినా పట్టించుకోలేదు

ఇక్కడైతే సెక్యూరిటీ ఉంటుందని ముందుగా వచ్చి అడిగితే మేడమ్ నెలకు రూ. 3 వేలు చెల్లిం చమన్నారు. ఏడాదిగా అంతా బాగానే ఉంది. ఇపుడు ఏమైందో తెలియదు. ఒక్కసారిగా ఖాళీ చేయమన్నారు. పదేపదే చిరాకుపడుతూ ఇంకెన్ని రోజులు ఉంటారని వార్డెన్ బెదిరిస్తున్నారు. సరే బయటకు వెళ్దామంటే హాస్టల్స్ అన్నీ మూసేశారు. ఇప్పటికిప్పుడు మేం ఎక్కడికి వెళ్లాలి. పైగా నెల అడ్వాన్స్ డబ్బులు కూడా ముందుగానే చెల్లించాం. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని మాకు న్యాయం చేయాలి. – ప్రైవేటు ఉద్యోగిని