ఉద్యో గులు ఆందోళన చెందొద్దు : జేఏసీ సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు

ఉద్యో గులు ఆందోళన చెందొద్దు : జేఏసీ సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు
  •     ప్రభుత్వం ఒక్కో సమస్యనూ పరిష్కరిస్తోంది
  •     ఉద్యోగుల జేఏసీ సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు వెల్లడి 

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్ర ప్రభుత్వం సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తోందని, ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన చెందవద్దని ఉద్యోగుల జేఏసీ సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు చెప్పారు. మంగళవారం నాంపల్లి టీఎన్జీవో భవన్ లో జేఏసీలోని యూనియన్ నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న క్యాష్​లెస్ హెల్త్ స్కీంకు ఇటీవల క్యాబినెట్ ఆమోదం తెలిపిందని.. ఇందుకుగాను సీఎం, డిప్యూటీ సీఎం, హెల్త్ మినిస్టర్, సీఎస్ కు జేఏసీ తరపున కృతజ్ఞతలు తెలిపారు. 

తెలంగాణ వైద్య విధాన పరిషత్ పేరును డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ గా మారుస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసు కోవడంపై సంతోషం వ్యక్తంచేశారు. గత ప్రభు త్వం ప్రపంచ బ్యాంకు షరతులతో వైద్య విధాన పరిషత్ ఏర్పాటు చేసి ఎంతో మంది ఉద్యోగులను మానసిక ఒత్తిడికి గురిచేసిందన్నారు. వైద్యవిధాన పరిషత్ ఉద్యోగులకు ఫస్ట్​కు జీతాలు రాక, ఇతర బెనిఫిట్స్​అందక ఇబ్బందులు పడేవారన్నారు. ఈహెచ్ఎస్ పై త్వరలో ఉద్యోగ సంఘాలు సమావేశమై, ఈహెచ్ఎస్ ట్రస్ట్ చైర్మన్ గా ఉన్న సీఎస్ ను కలుస్తామని శ్రీనివాసరావు వెల్లడించారు. 

పీఆర్సీ, పెండింగ్ డీఏలు, మెడికల్ బిల్స్ పై ఉద్యోగుల్లో అసంతృప్తి ఉందని, వీటిని కూడా త్వరలో ప్రభుత్వం పరిష్కరిస్తుందన్న నమ్మకం ఉందన్నారు. కాగా, 2008 నుంచి పెండింగ్ లో ఉన్న ఈహెచ్ఎస్ సమస్యను సీఎం రేవంత్ రెడ్డి పరిష్కరించాలని టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి ముజీబ్ కోరారు. ఉద్యోగులు మెడికల్ బిల్స్ కట్టలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. సమావేశంలో శ్యామ్, కస్తూరి వెంకట్, శ్రీకాంత్​తో పాటు జేఏసీ నేతలు పాల్గొన్నారు.