ఔట్ సోర్సింగ్ పంచాయతీ సెక్రటరీలు ఇక ఇంటికే

ఔట్ సోర్సింగ్ పంచాయతీ సెక్రటరీలు ఇక ఇంటికే

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పని చేస్తున్న పంచాయతీ సెక్రటరీలను తొలగించేందుకు సర్కారు చర్యలు చేపట్టింది. ప్రస్తుతం వాళ్లు డ్యూటీ చేస్తున్న స్థానాలను వేకెన్సీగా చూపి త్వరలో ఆ పోస్టులను భర్తీకీ నిర్ణయించింది. తాజా నిర్ణయంతో ఔట్ సోర్సింగ్ పంచాయతీ సెక్రటరీల ఆశలపై రాష్ట్ర సర్కారు నీళ్లు చల్లినట్లయింది. తామూ జూనియర్ పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్ రాసిన వాళ్లమేనని.. ఆర్డర్ ఆఫ్ మెరిట్ ద్వారానే డీపీవోలు తమను రిక్రూట్ చేశారని ఔట్ సోర్సింగ్ పంచాయతీ సెక్రటరీలు తెలిపారు. తమను తొలగించేందుకు తీసుకుంటున్న చర్యలపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్రంలో 9,355 పంచాయతీ సెక్రటరీ పోస్టుల భర్తీకి 2018లో నోటిఫికేషన్ రిలీజవ్వగా..2019లో నియామకాలు జరిగాయి. కొందరు డ్యూటీలో చేరకపోవడంతో ఏడాదిలోనే సుమారు1,700 ఖాళీలు ఏర్పడ్డాయి. ఊరికో పంచాయతీ సెక్రటరీ ఉండాలనే ఉద్దేశంతో  రెండేళ్ల క్రితం 989 మందిని ఔట్ సోర్సింగ్ పద్ధతిలో రిక్రూట్ చేశారు. ప్రస్తుతం వీరు పనిచేస్తున్న స్థానాలతో కలిపితే మొత్తం పంచాయతీ సెక్రటరీ పోస్టుల ఖాళీల సంఖ్య 2,560కి చేరినట్లు తెలిసింది. ఈ పోస్టులన్నింటిని డైరెక్ట్ రిక్రూట్మెంట్ వెకెన్సీలుగానే నోటిఫై చేయాలని గతంలో ఉత్తర్వులు జారీ అయినా.. కొందరు డీపీవోలు ఔట్ సోర్సింగ్ పద్ధతిలో రిక్రూట్ చేశారని పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ హనుమంతరావు తెలిపారు. ఇప్పటికే జేపీఎస్ పోస్టుల ఖాళీలను ప్రభుత్వానికి రిపోర్ట్ చేశామని, డైరెక్ట్ రిక్రూట్‌‌మెంట్ కింద ఖాళీలను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు.