న్యూఢిల్లీ: పోటీ పరీక్షల్లో అక్రమాలను నివారించి మరింత పకడ్భందీగా ఎగ్జామ్స్ నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా పబ్లిక్ పరీక్షల అక్రమాల నిరోధక సవరణ బిల్లు-2026ను లోక్ సభలో ప్రవేశపెట్టింది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్. సోమవారం (జులై 27) దిగువ సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. నీట్ లీకేజీపై విపక్షాలు చర్చకు డిమాండ్ చేస్తుండగా.. విపక్షాల ఆందోళన నడుమే మంత్రి బిల్లును సభ ముందుకు తీసుకొచ్చారు. అనంతరం స్పీకర్ ఈ బిల్లుపై చర్చ ప్రారంభించగా.. నీట్ పేపర్ లీకేజీపై చర్చకు పట్టుబడుతూ విపక్షాలు ఆందోళన కొనసాగించాయి. దీంతో సభలో గందరగోళనం నెలకొనడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు.
పబ్లిక్ పరీక్షల అక్రమాల నిరోధక సవరణ బిల్లు-2026లో ఏముందంటే..
- పేపర్ లీకేజీలు, పరీక్షల అక్రమాలపై ఉక్కుపాదం మోపేలా చట్టంలో కీలక సవరణలు.
- సాధారణ అక్రమాలకు పాల్పడితే జైలు శిక్ష 5 నుంచి 10 ఏళ్లకు పెంపు.. జరిమానా రూ. 50 లక్షల వరకు విధింపు.
- ఆర్గనైజ్డ్ ముఠాలు, పేపర్ లీక్ గ్యాంగ్‌లకు గరిష్టంగా రూ. 10 కోట్ల వరకు భారీ జరిమానా.
- పరీక్షలు నిర్వహించే సర్వీస్ ప్రొవైడర్లకు రూ. 5 కోట్ల జరిమానా.. 8 ఏళ్ల పాటు బ్లాక్‌లిస్ట్.
- కేసు నమోదైన 2 నెలల లోపే విచారణ (ఇన్వెస్టిగేషన్) పూర్తి చేయడం తప్పనిసరి.
- కేసుల వేగవంతమైన విచారణ కోసం ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టుల (Special Fast Track Courts) ఏర్పాటు.
- ఛార్జ్‌షీట్ దాఖలైన 3 నెలల వ్యవధిలోనే విచారణ పూర్తి చేసి తీర్పు వెలువరించాలని నిబంధన.
- హైకోర్టులోని ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్ ద్వారానే అప్పీళ్ల విచారణ.. 3 నెలల్లోపు అప్పీళ్లు పరిష్కరించాల్సిందే.
