ఉపాధి హామీ ప‌థ‌కానికి అద‌నంగా రూ.40 వేల కోట్ల కేటాయింపు

ఉపాధి హామీ ప‌థ‌కానికి అద‌నంగా రూ.40 వేల కోట్ల కేటాయింపు

మ‌హాత్మా గాంధీ జాతీయ గ్రామీణ‌ ఉపాధి హామీ ప‌థ‌కానికి అద‌నంగా రూ.40 వేల కోట్లు కేటాయించాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ తెలిపారు. దీని ద్వారా క‌రోనా లాక్ డౌన్ వ‌ల్ల ఉపాధి కోల్పోయిన వ‌ల‌స కార్మికుల‌కు ప‌నులు చూపించొచ్చ‌ని అన్నారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ మంగ‌ళ‌వారం ప్ర‌క‌టించిన రూ.20 ల‌క్ష‌ల కోట్ల‌ ఆత్మ నిర్భ‌ర భార‌త్ ప్యాకేజీలో చివ‌రిదైన ఐదో పార్ట్ పై ఆదివారం మీడియాకు వివ‌రించారు.

చివ‌రి భాగంలో ఉపాధి హామీ, వైద్య‌, ఆరోగ్య రంగం, విద్యా రంగం, వ్యాపార రంగం, డీ క్రిమిన‌లైజేష‌న్ ఆఫ్ కంపెనీస్ యాక్ట్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పాల‌సీ, ప‌బ్లిక్ సెక్టార్ సంస్థ‌ల‌కు సంబంధించిన సంస్క‌ర‌ణ‌లు, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు సాయం వంటి చ‌ర్య‌ల‌ను ప్ర‌క‌టించారు నిర్మ‌లా సీతారామ‌న్. క‌రోనా సంక్షోభాన్ని ఎదుర్కొని.. స్వ‌యం స‌మృద్ధ భార‌త్ అభివృద్ధి కోసం ప్ర‌ధాని మోడీ ఆత్మ నిర్భ‌ర్ భార‌త్ ప్యాకేజీ ప్ర‌క‌టించార‌ని తెలిపారామె. ఈ క‌రోనా స‌మ‌యంలో తీవ్ర ఇబ్బందుల‌ను ఎదుర్కొంటున్న వ‌ల‌స కార్మికుల‌కు ప‌నులు క‌ల్పించేందుకు ఉపాధి హామీ ప‌థ‌కానికి ఇచ్చే నిధుల‌ను భారీగా పెంచుతున్న‌ట్లు చెప్పారు. ఇప్ప‌టికే శ్రామిక్ రైళ్ల ద్వారా స్వ‌స్థ‌లాల‌కు చేరుకుంటున్న వ‌ల‌స కూలీల‌కు వ‌ర్షా కాలంలోనూ ప‌నులు క‌ల్పిస్తామ‌న్నారు. కొత్త‌గా రూ.40 వేల కోట్ల నిధుల పెంపుతో నిరుపేద‌ల‌కు ఏడాదిలో మొత్తంగా 300 కోట్ల ప‌ని దినాల‌ను క‌ల్పించ‌వ‌చ్చ‌న్నారు.