కేటీఆర్ అహంకారంతో మాట్లాడుతున్నడు: అడ్లూరి లక్ష్మణ్

కేటీఆర్ అహంకారంతో మాట్లాడుతున్నడు:  అడ్లూరి లక్ష్మణ్

హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డిపై.. బీఆర్ఎస్ వర్కింగ్​ప్రెసిడెంట్​కేటీఆర్ అహంకారంతో మాట్లాడుతున్నాడని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ మండిపడ్డారు. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు. సోమవారం సీఎల్పీలో విప్ లు ఆది శ్రీనివాస్, రాంచంద్రునాయక్ తో కలిసి లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అన్ని వర్గాలూ రేవంత్ ను సీఎంగా కోరుకున్నాయని, ఎన్నికల ముందు  రేవంత్ రెడ్డిని సీఎం అభ్యర్థిగా ప్రకటించి ఉంటే కాంగ్రెస్ కు 100 సీట్లు వచ్చేవని పేర్కొన్నారు. 

గత పదేండ్లలో గందరగోళంగా మారిన పాలనను సీఎం రేవంత్​ గాడిలో పెడుతున్నారని ఆయన తెలిపారు. కేటీఆర్ మాటలు ప్రజల తీర్పును అగౌరవపర్చేలా ఉన్నాయని అన్నారు. ఎప్పటికైనా కేటీఆర్ కొంప ముంచేది హరీశ్​ రావే అని, జాగ్రత్తగా ఉండాలని కేటీఆర్ కు లక్ష్మణ్ సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్ కు కర్రు కాల్చి వాతపెట్టినా.. కేటీఆర్ కు బుద్ధి రాలేదని విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. సీఎంపై కేటీఆర్ వ్యాఖ్యలు ఆయన దురంహకారానికి నిదర్శనమన్నారు. 

ఓటమి బాధలో కేటీఆర్ మతితప్పి మాట్లాడుతున్నాడన్నారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే కాంగ్రెస్ కార్యకర్తలు తాట తీస్తారని ఆది శ్రీనివాస్ హెచ్చరించారు. సీఎంపై కేటీఆర్ వి సిగ్గుమాలిన మాటలని విప్ రాంచంద్రునాయక్ ఫైర్ అయ్యారు. పబ్లిక్ లో రేవంత్ రెడ్డికి ఉన్న ఆదరణ చూసి కేటీఆర్ కు మతి తప్పుతోందన్నారు. వచ్చే ఎంపీ ఎన్నికల్లో బీఆర్ ఎస్ ను పబ్లిక్ బట్టలూడదీసి నడిబజార్ లో  మరో సారి నిలబెట్టడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. అవినీతికి పాల్పడిన బీఆర్ఎస్ నేతలకు చర్లపల్లి జైలులో చిప్పకూడు తినిపిస్తామని ఆయన హెచ్చరించారు.