ముషీరాబాద్, వెలుగు: ఉప సర్పంచ్‌లకు సంతకం చేసే అధికారం కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ఉప సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు బొట్ల కార్తీక్, కార్యదర్శి మట్ట శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్‌లో ఫోరం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉప సర్పంచ్‌ల చెక్ పవర్‌ను రద్దు చేస్తున్నారనే ప్రచారంపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలన్నారు.
తమకు నెలకు రూ.5 వేలు, వార్డు సభ్యులకు రూ.3 వేలు గౌరవ వేతనం ప్రకటించాలని కోరారు. స్టాండింగ్ కమిటీలలో ఉప సర్పంచ్‌లను వైస్ చైర్మన్‌లుగా నియమించాలని, పంచాయతీ తీర్మానాలపై సర్పంచ్, కార్యదర్శితో పాటు ఉప సర్పంచ్‌లకు కూడా సంతకం చేసే అధికారం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కమలాకర్ రెడ్డి, కె.స్వప్న, కవిత, కుమార్, గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పాషా, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.
