టీఆర్ఎస్ ప్లీనరీ.. గులాబీమయమైన హైటెక్ సిటీ

టీఆర్ఎస్ ప్లీనరీ.. గులాబీమయమైన హైటెక్ సిటీ

TRS ప్లీనరీకి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. హైదరాబాద్ లోని HICCలో ప్లీనరీకి గ్రాండ్ గా ఏర్పాట్లు చేస్తున్నారు.  మూడేళ్ల గ్యాప్ తర్వాత ప్లీనరీ నిర్వహిస్తోంది అధికార పార్టీ. TRS ఏర్పాటై 20 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా ద్విదశాబ్ది ఉత్సవాలు చేస్తున్నారు. 2018 లో చివరిసారిగా కొంపల్లిలో ప్లీనరీ జరిగింది. పార్టీ రూల్ ప్రకారం ప్రతీ రెండేళ్లకోసారి ప్లీనరీ జరగాలి. 2020లో కరోనా కారణంగా ప్లీనరీ జరగలేదు. 

పది రోజులుగా ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు నేతలు. వేదిక, ప్రాంగణం, పరిసర ప్రాంతాలన్ని గులాబీ మయం అయ్యాయి. సిటీ అంతా TRS ఫ్లెక్సీలు, జెండాలతో నిండిపోయింది. ఈ ప్లీనరీకి రాష్ట్ర వ్యాప్తంగా వున్న 6500 మంది ప్రజా ప్రతినిధులు హాజరు కాబోతున్నారు. మంత్రులు, ఎంపీలు ,ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు, కార్పోరేషన్ల చైర్మన్లు, జడ్పీ చైర్మన్ లతో పాటు మండల పరిషత్ అధ్యక్షులు, జెడ్పీటీసీ సభ్యులు, కార్పొరేటర్ల స్థాయి వరకు ఈ మీటింగ్ కు ఆహ్వానించారు. మాజీ మంత్రులు, MLAలు, MLCలు, పార్టీ సీనియర్ నేతలకు ప్రత్యేక ఆహ్వానాలు అందాయి. రేపు(సోమవారం) ఉదయం 10 గంటలకు ప్రారంభం అయ్యే ప్లీనరీకి వచ్చే అహ్వానితులకు ఇప్పటికే పాసులు జారీ అయ్యాయి.  

ప్లీనరీ మొదలు కాగానే సీఎం కేసీఆర్ TRS అధ్యక్షుడిగా ఎన్నికైనట్టు ప్రకటిస్తారు. ఆ తర్వాత ప్లీనరీని ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడతారు. హుజురాబాద్ ఉపఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ స్పీచ్ పై ఆసక్తి నెలకొంది. 20 ఏళ్లలో 13 ఏళ్ల పార్టీ ప్రస్థానం, 7 సంవత్సరాల ప్రభుత్వంలో సాధించిన విజయాలు, అనుసరించిన వ్యూహాలు ఇతర అంశాలపై ఈ ప్లీనరీలో నేతల ప్రసంగాలు ఉంటాయి. సంక్షేమ పథకాలపై చర్చకు అవకాశం ఉంది. ఈ ప్లీనరీలో వివిధ అంశాలకు సంబంధించిన ఏడు తీర్మానాలను ఆమోదించనున్నారు. 

ప్లీనరీకి వచ్చే వారికి భోజన ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. 29 రకాల వంటలు సిద్ధం చేస్తున్నారు. ఒకే సారి 8 వేల మంది భోజనం చేసేలా 3 డైనింగ్ హాల్స్ సిద్ధం చేశారు. VVIPలు, ప్రజాప్రతినిధులు, మహిళల కోసం ప్రత్యేకంగా డైనింగ్ హాల్స్ రెడీ చేశారు. తెలంగాణ ప్రత్యేకమైన నాన్ వెజ్, వెజ్ వంటకాలు వడ్డించనున్నారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఫుడ్ కమిటీ ఇన్ ఛార్జిగా ఉన్నారు. చికెన్ ధమ్ బిర్యానీ, మటన్ కర్రీ, నాటుకోడి పులుసు, పాయా సూప్, బోటి ఫ్రై, ఎగ్ మసాలా, రుమాలీ రోటీ, ఆలూ క్యాప్సికం, బగారా రైస, వెజ్ బిర్యానీ, వైట్ రైస్, గుత్తి వంకాయ, చామగడ్డ పులుసు, బెండకాయ కాజు ఫ్రై, దాల్ రైస్, పాలకూర మామిడికాయ పప్పు, పచ్చి పులుసు, ముద్ద పప్పు, సాంబార్, ఉలవచారు, క్రీమ్, పెరుగు, వంకాయ చట్నీ, జిలేబీ, డబల్ కా మీఠా, ఐస్ క్రీ లాంటి వంటకాలను వడ్డించనున్నారు. ఇందుకోసం 500 మంది వంటవాళ్లను, సహాయకులను నియమించారు.  

ప్లీనరీ కోసం ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు పోలీసులు. గచ్చిబౌలి జంక్షన్  కు సైబర్  టవర్స్  మీదుగా వెళ్లేవారు అయ్యప్ప సొసైటీ, సీవోడీ జంక్షన్ , దుర్గం చెరువు నుంచి వెళ్లాలని సూచించారు. కొండాపూర్ , RCపురం, చందానగర్  నుంచి గచ్చిబౌలి వైపు వెళ్లే వాహనదారులు BHEL, నల్లగండ్ల, HCU మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. హఫీజ్ పేట, మియాపూర్ , కొత్తగూడ నుంచి సైబర్  టవర్స్  మీదుగా జూబ్లీహిల్స్  వైపు వెళ్లే వారు రోలింగ్  హిల్స్, ఐకియా, ఇనార్బిట్  మాల్  నుంచి వెళ్లాలని సూచించారు.