వైభవంగా నారసింహుడి చక్రస్నానం

వైభవంగా నారసింహుడి చక్రస్నానం
  • నేడు అష్టోత్తర శతఘటాభిషేకంతో ముగియనున్న పాతగుట్ట బ్రహ్మోత్సవాలు

యాదగిరిగుట్ట, వెలుగు: పాతగుట్ట లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి.  ఆరో రోజు సోమవారం ఆలయంలో అర్చకులు పూర్ణాహుతి నిర్వహించారు. ప్రత్యేక అలంకారంలో స్వామి అమ్మవార్లను ఆలయ తిరువీధుల్లో ఊరేగించారు. తర్వాత స్వామివారి చక్రస్నాన ఘట్టాన్ని చూడముచ్చటగా నిర్వహించారు.

ఆలయ ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యుల అర్చకత్వంలో అర్చకులు, నూతన దంపతులైన లక్ష్మీనారసింహులను ప్రత్యేక వాహనంపై అధిష్టింపజేసి పాతగుట్టపైన ఉన్న పుష్కరిణిలో చక్రస్నాన ఉత్సవాన్ని నయనానందకరంగా జరిపించారు. దేవదేవునితో పాటు భక్తులు పుష్కరిణిలో స్నానమాచరించి మొక్కులు చెల్లించుకున్నారు. నిత్యారాధనలు ముగిసిన అనంతరం.. దేవతా ఉద్వాసన, పుష్పయాగం, ద్వాదశారాధన, డోలోత్సవం వేడుకలను వైభవంగా నిర్వహించారు.