భద్రాచలం,వెలుగు : సీతారామచంద్రస్వామి దేవస్థానంలోని గాలిగోపురానికి ఎదురుగా ఉన్న ఆంజనేయస్వామికి మంగళవారం పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. గోదావరి నుంచి తీర్ధబిందెను తీసుకొచ్చి గర్భగుడిలో సీతారాములకు సుప్రభాత సేవ చేసి బాలబోగం నివేదించారు. అనంతరం ఆంజనేయస్వామికి పంచామృతాలు, సమస్త నదీజలాలతో అభిషేకం, స్నపన తిరుమంజనం చేసి అప్పాలు, నిమ్మకాయలు, తమలపాకుల మాలలను నివేదన చేశారు.
భక్తులు హనుమాన్చాలీసా పారాయణం నిర్వహించారు. సీతారాముల కల్యాణమూర్తులను ఊరేగింపుగా బేడా మండపానికి తీసుకొచ్చి నిత్య కల్యాణం వైభవంగా చేశారు. భక్తులు కంకణాలు ధరించి క్రతువును నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. మాధ్యాహ్నిక ఆరాధనలు తర్వాత రాజబోగం నివేదన చేశారు. సాయంత్రం దర్బార్ సేవ చేసి స్వామికి దివిటీ సలాం సమర్పించారు.
