గుండాల, వెలుగు : మేడారం మహాజాతరలో వారం రోజుల పాటు విశేష పూజలందుకున్న సమ్మక్క భర్త పగిడిద్ద రాజు ఆదివారం తన సొంత గ్రామమైన గుండాల మండలంలోని యాపలగడ్డకు చేరుకున్నారు. అర్రెం వంశీయులు మంగళవాయిద్యాల నడుమ సంప్రదాయ పద్ధతిలో స్వామివారిని గ్రామానికి తీసుకురాగా, భక్తులు నీళ్లు, పూలతో అభిషేకాలు చేసి, మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు.
పగిడిద్ద రాజు రాకతో యాపలగడ్డ గ్రామం శివసత్తుల పూనకాలతో దద్దరిల్లింది. పురాతన గుడిని శుద్ధి చేసిన అర్రెం వంశీయులు అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతర ముగించుకొని తిరిగి వస్తున్న పగిడిద్ద రాజును దర్శించుకుంటే కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. ఈ సందర్భంగా అర్రెం వంశీయులు అప్పయ్య, భిక్షం, నాగయ్య మాట్లాడుతూ వచ్చే మార్చి 4, 5, 6 తేదీల్లో యాపలగడ్డలో జాతరను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
