‘జనగణమన’తో మార్మోగిన గ్రేటర్ సిటీ  

‘జనగణమన’తో మార్మోగిన  గ్రేటర్ సిటీ  

జాతీయ గీతం ‘జనగణమన’తో గ్రేటర్ సిటీ  మార్మోగింది.  స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా మంగళవారం నిర్వహించిన సామూహిక జాతీయ గీతాలాపనలో ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉదయం 11.30 గంటలకు ఎక్కడివాళ్లు అక్కడే నిలబడి ‘జనగణమన’ గీతాన్ని ఆలపించారు. బంజారాహిల్స్ రోడ్ నం.12లో జరిగిన ప్రోగ్రామ్​లో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి,  బల్దియా హెడ్డాఫీసు, వాటర్ బోర్డు ఆఫీసులో ఉద్యోగులు, సిబ్బంది జాతీయ గీతం పాడారు.విప్రో జంక్షన్ వద్ద ఐటీ ఎంప్లాయీస్​తో కలిసి సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీందర, ఆర్మీ జవాన్లు, బల్దియా అధికారులు జనగణమణ పాడారు. అమీర్ పేట మెట్రో స్టేషన్​లో వజ్రోత్సవాలను నిర్వహించారు.

మెట్రో 3 కారిడార్లలో తిరిగే 55 మెట్రో రైళ్లు 11.30 గంటలకు ఎక్కడిక్కడ 52 సెకండ్ల పాటు నిలిచిపోయాయి. ఎండీ ఎన్వీఎస్​ రెడ్డి, ప్యాసింజర్లు, సిబ్బంది రైలు లోపలే నిలబడి జాతీయ గీతాన్ని పాడారు. గాంధీ హాస్పిటల్ ఆవరణలో సూపరింటెండెంట్ రాజారావు, డాక్టర్లు, సిబ్బంది జాతీయ గీతాన్ని పాడారు. లంగర్ హౌస్, నానల్ నగర్,  టోలిచౌకి, గోల్కొండ కోట చౌరస్తా, మెహిదీపట్నం, మాసబ్ ట్యాంక్ లో  పోలీసుల ఆధ్వర్యంలో జాతీయ గీతాలాపన జరిగింది. సుచిత్ర సర్కిల్​లో జరిగిన ప్రోగ్రామ్​లో సింగర్ శ్రీరామ చంద్ర పాల్గొని జాతీయ గీతం పాడారు. చేవెళ్ల, శంకర్ పల్లి, షాద్ నగర్​లోనూ ప్రోగ్రామ్ జరిగింది.

ట్రాఫిక్ పోలీసులు కీ రోల్


జాతీయ గీతాలాపన ప్రోగ్రామ్​లో భాగంగా ట్రాఫిక్ పోలీసులు డిజిటల్‌‌‌‌ సిస్టమ్‌‌‌‌ను వాడారు. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే మొజంజాహి మార్కెట్, లక్డీకాపూల్, సికింద్రాబాద్ సహా గ్రేటర్​లోని అన్ని జంక్షన్ల వద్ద ఒకే టైమ్ లో రెడ్ సిగ్నల్ పడేలా బషీర్‌‌‌‌‌‌‌‌బా గ్‌‌‌‌లోని ట్రాఫిక్ కమాండ్‌‌‌‌ కంట్రోల్‌‌‌‌ సెంటర్‌‌‌‌ ‌‌‌‌నుంచి ఆపరేట్‌‌‌‌ చేశారు. 11:29:30 గంటల సమయంలో 'అందరూ దయచేసి నిలబడండి..జాతీయ గీతాలాపన చేద్దాం' అంటూ అనౌన్స్‌‌‌‌మెంట్‌‌‌‌ చేశారు. ఆ తర్వాత రెండుసార్లు సైరన్‌‌‌‌ వినిపించేలా ప్రోగ్రామింగ్ చేసినట్లు  ట్రాఫిక్‌‌‌‌ కంట్రోల్‌‌‌‌ సెంటర్‌‌‌‌ ఇన్‌‌‌‌స్పెక్టర్ నర్సింగ్‌‌‌‌రావు తెలిపారు.  

   – వెలుగు, హైదరాబాద్/గచ్చిబౌలి/పద్మారావునగర్/ముషీరాబాద్/జీడిమెట్ల/మెహిదీపట్నం/శంషాబాద్/గండిపేట/చేవెళ్ల/షాద్ నగర్