గ్రీన్ ఇండియా చాలెంజ్‌‌‌‌‌‌‌‌తో పర్యావరణ మార్పు రావాలి : భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

గ్రీన్ ఇండియా చాలెంజ్‌‌‌‌‌‌‌‌తో పర్యావరణ మార్పు రావాలి : భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
  •     రాష్ట్రపతి ముర్ముతో జోగినపల్లి సంతోశ్ కుమార్ బృందం భేటీ
  •     రాష్ట్రపతి చేతుల మీదుగా ‘వృక్ష వేదం 2.0’ పుస్తకావిష్కరణ 

న్యూఢిల్లీ, వెలుగు: ప్రకృతిని గౌరవిస్తూ, పర్యావరణాన్ని సంరక్షించుకున్నప్పుడే మానవ జీవితం సుభిక్షంగా ఉంటుందని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. గురువారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌‌‌‌‌‌‌‌లో రాజ్యసభ మాజీ ఎంపీ, గ్రీన్ ఇండియా చాలెంజ్ (జీఐసీ) వ్యవస్థాపకుడు జోగినపల్లి సంతోశ్ కుమార్‌‌‌‌‌‌‌‌ తన బృందంతో కలిసి రాష్ట్రపతిని మర్యాదపూర్వకంగా కలిశారు. 

ఈ సందర్భంగా సంతోశ్ కుమార్ రూపొందించిన ‘వృక్ష వేదం 2.0’ పుస్తకాన్ని రాష్ట్రపతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడారు. మనిషి స్వార్థం, లాభాపేక్షను వీడి పంచభూతాలను గౌరవించాలని పిలుపునిచ్చారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా దేశవ్యాప్తంగా పర్యావరణ మార్పు రావాలని ఆమె కోరారు. గడిచిన ఎనిమిదేండ్లలో సుమారు 19 కోట్ల మొక్కలు నాటేలా ప్రజలను చైతన్యపరచడంపై సంతోశ్ కుమార్‌‌‌‌‌‌‌‌ను రాష్ట్రపతి ప్రత్యేకంగా అభినందించారు. 

‘భూమి పచ్చగా ఉంటేనే బతుకు పచ్చగా ఉంటుంది’ అన్న వృక్ష వేదంలోని మాటను ఆయన ఆచరణలో చూపిస్తున్నారని, సంతోశ్ కుమార్ నిజమైన పర్యావరణ పరిరక్షకుడని కొనియాడారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ చేస్తున్న వినూత్న కార్యక్రమాలు దేశవ్యాప్తంగా స్ఫూర్తిని నింపుతున్నాయని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, కేఆర్. సురేశ్ రెడ్డి, బండి పార్థసారథి రెడ్డితో పాటు ‘ఇగ్నైటింగ్ మైండ్స్’ వ్యవస్థాపకుడు ఎం. కరుణాకర్ రెడ్డి, గ్రీన్ ఇండియా చాలెంజ్ సహ వ్యవస్థాపకుడు సంజీవుల రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.