పాపికొండల టూర్‌కు గ్రీన్​ సిగ్నల్‍

పాపికొండల టూర్‌కు గ్రీన్​ సిగ్నల్‍

ఈ నెల 15న రాజమండ్రి నుంచి బోట్లు ప్రారంభం

భద్రాచలం వైపు నుంచి నెలాఖరుకు స్టార్ట్​

బోటు యజమానులకు స్పెషల్​ ట్రైనింగ్

భద్రాచలం, వెలుగు: పాపికొండల పర్యాటకానికి ఆంధ్రా సర్కార్​ గ్రీన్ సిగ్నల్​ ఇచ్చింది. ఏడాది తర్వాత లాంచీలు తొలిసారి గోదావరిలోకి ఎక్కనున్నాయి. గతేడాది సెప్టెంబరు నెలలో ఆంధ్రాలోని తూర్పుగోదావరి జిల్లా కచ్చలూరు వద్ద జరిగిన లాంచీ ప్రమాదంలో 47 మంది జలసమాధి అయ్యారు. నాటి నుంచి పర్యాటక లాంచీలను నిలిపివేశారు. తర్వాత కరోనా కారణంగా పర్యాటకంపై నిషేధం విధించారు. అయితే ఇటీవలే కేంద్రం పర్యాటక ప్రాంతాలకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో అనేక మార్పులు, చేర్పులతో ఆంధ్రా సర్కారు పాపికొండల పర్యాటక లాంచీలకు దశలవారీగా అనుమతులు ఇవ్వాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా తొలిదశలో రాజమండ్రి(ఆంధ్రా) నుంచి ఏపీ టూరిజం బోట్లతో పాటు మరో 4 లాంచీలకు అనుమతినిచ్చి ఈ నెల 15 నుంచి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. విలీన మండలాలైన కూనవరం, వీఆర్‍పురం నుంచి ఈ నెలాఖరుకు లాంచీలు తిప్పేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గతంలో అటు, ఇటు కలిపి మొత్తంగా 80కి పైగా లాంచీలు పాపికొండల్లో  పర్యాటకులను తిప్పేవి. అయితే ఆంధ్రా సర్కారు  తెచ్చిన కొత్త రూల్స్​తో లాంచీల సంఖ్య గణనీయంగా తగ్గనుంది.

కచ్చులూరు ఘటనతో…

2019 సెప్టెంబరు 25న ఆంధ్రాలోని పాపికొండల్లో కచ్చలూరు గ్రామం వద్ద పర్యాటకుల లాంచీ మునిగి47 మంది చనిపోయారు. గోదావిరలో ఇదే అతిపెద్ద పడవ ప్రమాదం కావడంతో ఆంధ్రా సర్కారు లాంచీల ప్రయాణాలపై నిషేధం విధించింది. సరికొత్త విధివిధానాలు రూపొందించింది. ముందుగా లాంచీలకు ఇచ్చే లైసెన్సులు నీటిపారుదల శాఖ నుంచి పోర్టు అధికారులకు బదలాయించింది. దీంతో లాంచీల డిజైన్‍పై పోర్టు అధికారులు అనేక ఆంక్షలు పెట్టారు. ఏ ప్రమాదం వచ్చినా నీరు లోనికి రాకుండా లాంచీ అడుగు భాగాన ఫైబర్‍ నిర్మాణం చేపట్టాలని సూచించారు. అన్ని లాంచీలకు రూ.5 లక్షలు వరకు వెచ్చించి డిజైన్‍ మార్చారు. ఇక బోటు యజమానులకు కూడా అవగాహన ఉండాలనే ఉద్దేశంతో బీహార్లోని పాట్నాలో 30 మందికి శిక్షణ ఇచ్చి వారం తర్వాత వారికి బోట్‍మెన్​ సర్టిఫికెట్‍ఇచ్చారు. ఇక లాంచీలు నడిపే సరంగులు, డ్రైవర్లకు పదోతరగతి విద్యార్హత పెట్టారు. కానీ బ్రిటీషు కాలం నుంచి గోదావరిలో తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలోని డ్రైవర్లు, సరంగులే లాంచీలు నడుపుతున్నారు. వారికి చదువు లేదు. అనుభవం మాత్రమే ఉంది. విద్యార్హత పెట్టడంతో సుమారు 10 మందికి పైగా నిరుద్యోగులు మాత్రమే ఇటీవల తెలంగాణలోని మెదక్‍లో సరంగు, డ్రైవింగ్‍పై శిక్షణ తీసుకున్నారు.

భద్రాద్రికి పెరగనున్న ఆదాయం

పాపికొండల టూర్​కు  గ్రీన్‍సిగ్నల్‍ రావడంతో భద్రాద్రికి ఊరట లభించింది. ఇప్పుడిప్పుడే భక్తుల సందడి మొదలైంది. పాపికొండల పర్యాటకానికి ఎక్కువ సంఖ్యలో యాత్రికులు వెళ్లేది భద్రాచలం నుంచే. వివిధ రాష్ట్రాలతో పాటు, ఫారినర్స్ కూడా భద్రాచలం వచ్చి రామయ్య దర్శనం చేసుకుని ఇక్కడే టిక్కెట్లు బుక్‍ చేయించుకుని ఆంధ్రాలో విలీనమైన కూనవరం, వీఆర్‍పురం మండలాలకు వెళ్లి లాంచీల్లో పాపికొండలు చూసి తిరిగి సాయంత్రానికి భద్రాచలం చేరుకుంటారు. శని, ఆదివారాలతో పాటు ఇతర సెలవు దినాల్లో భద్రాచలం కిక్కిరిసిపోతుంది. ఏడాదిగా కరోనాతో పాటు, పాపికొండల పర్యాటకం నిలిచిపోవడంతో దేవస్థానం ఆదాయం పడిపోయింది. భక్తుల రాక కూడా తగ్గింది. ప్రస్తుతం తిరిగి పాపికొండల టూరిజం ప్రారంభం అవుతుండటంతో ఆలయ ఆదాయం పెరుగుతుందని దేవస్థానం అధికారులు భావిస్తున్నారు.

ఇక్కడి నుంచి నెలాఖరుకు

ఈ నెలాఖరుకు పాపికొండల్లో పర్యాటక లాంచీలు తిరుగుతాయి. ప్రస్తుతం రాజమండ్రి నుంచి ఏపీ టూరిజం లాంచీలకు పర్మిషన్‍ వచ్చింది. ఈ నెలాఖరుకు కూనవరం, వీఆర్ పురంల నుంచి తిప్పడానికి సన్నాహాలు చేస్తున్నాం. – పెరుమాల్‍, లాంచీ నిర్వాహకులు

తనిఖీలు చేశాకే పర్మిషన్లు

ఈసారి ఇబ్బడిముబ్బడిగా లాంచీలకు అనుమతి ఇచ్చే పరిస్థితులు లేవు. ఎందుకుంటే కచ్చలూరు ప్రమాద ఘటన తర్వాత తెచ్చిన కొత్త మార్గదర్శకాల ప్రకారం లాంచీకి ఇన్సూరిన్స్ చేయించాలి. దాదాపు రూ.1.30 లక్షల వరకు ఈ ఇన్సూరిన్స్ఉంటుంది. దీనికి తోడు సీటింగ్‍ కూడా పూర్తిగా మార్చేయాలి. వీటికి ఉపయోగించే రేకులు 4 ఎంఎం, 6 ఎంఎం అయితేనే అనుమతి ఇస్తారు. లాంచీలో అన్ని రకాల సేఫ్టీ పరికరాలు ఉండాలి. లేనివాటికి ఎట్టిపరిస్థితుల్లోనూ పర్మిషన్ ఇవ్వరు. దీంతో ప్రస్తుతం అతి తక్కువ సంఖ్యలోనే లాంచీలు తిరిగే ఛాన్స్ ఉంది.

For More News..

క్వార్టర్లీ ఎగ్జామ్స్ పేరుతో స్కూళ్ల వసూళ్లు

అమెరికా ఎన్నికల్లో క్లీయర్​ రిజల్ట్​ రాకుంటే.. కోర్టు డెసిషనే కీలకం!

జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో ఫామ్ ధర రూ. 10 వేలు