
- కాంగ్రెస్‌లో మళ్లా లొల్లి
- రాహుల్టూర్ టైమ్‌లోనూ ఒక్కతాటిపైకి రాని నేతలు
హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర కాంగ్రెస్ నేతల మధ్య మళ్లీ లొల్లులు రచ్చకెక్కాయి. వారం రోజుల్లో రాహుల్ గాంధీ రానుండగా.. ముఖ్య నేతల మధ్య రోజుకొక్క పంచాది నడుస్తున్నది. అందరూ ఒక్క తాటి మీద నిలబడి పని చేయాల్సిన సమయంలో రెండు వర్గాలుగా చీలిపోవడం ఏమిటని కేడర్ ఆందోళన చెందుతున్నది. నేతల మధ్య ఉన్న గ్యాప్ రాహుల్ పర్యటన సన్నాహాక సమావేశాల్లో స్పష్టంగా బయటపడుతున్నది. శుక్రవారం నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ సమావేశం దాన్ని మరింత తారా స్థాయికి తీసుకుపోయింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శిస్తూ స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ మీటింగ్‌కు వెళ్లలేదు. గాంధీభవన్‌లో జరిగిన పీఏసీ సమావేశానికి వచ్చిన నేతలు నల్గొండ ఎపిసోడ్‌పై తలోవిధంగా స్పందించారు. రాష్ట్ర నేతల మధ్య పంచాది మళ్లోసారి ఏఐసీసీ దృష్టికి వెళ్లింది.
చీఫ్ ఎక్కడైనా తిరగొచ్చు.. కానీ..
నాగార్జునసాగర్ సన్నాహక సమావేశం ముగిసిన తర్వాత పార్టీ ముఖ్య నేతలంతా సాయంత్రం గాంధీభవన్‌లో జరిగిన పీఏసీ సమావేశానికి తరలివచ్చారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మణిక్కం ఠాగూర్, ఏఐసీసీ సెక్రటరీలు కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంలో మీటింగ్‌కు వచ్చిన నేతల్ని నల్గొండ ఎపిసోడ్‌పై మీడియా కదిలిస్తే.. తమ అభిప్రాయాలు చెప్పారు. పీసీసీ మాజీ చీఫ్, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. పీసీసీ ప్రెసిడెంట్ రాష్ట్రంలో ఎక్కడైనా తిరగవచ్చని, అయితే ఆ జిల్లా నేతలకు సమాచారం ఇచ్చి వెళ్లాలన్నారు. తమ మధ్య విభేదాలు లేవని ఆయన చెప్పారు. పీఏసీ చైర్మన్ షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. పీసీసీ అధ్యక్షుడ్ని జిల్లాలకు రాకుండా అడ్డుకునే హక్కు ఎవరికీ లేదన్నారు. నిజామాబాద్‌లో పార్టీ బలహీనంగా ఉందనే కోమటిరెడ్డి వ్యాఖ్యల్ని ఆయన ఖండించారు. అదే జిల్లాకు గతంలో ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ స్పందిస్తూ.. నిజామాబాద్‌లో పార్టీని బలోపేతం చేయాల్సి ఉందన్నారు. కోమటిరెడ్డి నిజామాబాద్ వస్తా అంటే స్వాగతిస్తానని చెప్పారు. తాను గత ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కొందరు కోవర్ట్ ఆపరేషన్ చేశారని ఆయన ఆరోపించారు. నల్గొండలో కాంగ్రెస్ బలంగా ఉంటే ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఎంపీగా ఉండి హుజూర్నగర్ ఎన్నికల్లో పార్టీ ఎలా ఓడిపోయిందని ప్రశ్నించారు. జిల్లాల్లో బలంగా ఉన్నామని వాపును చూసి బలుపు అనుకోవద్దన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. పీసీసీ అధ్యక్షుడు ఏ జిల్లాకు పోవాలన్నా డీసీసీకి ఇన్ఫర్మేషన్ ఇస్తారని, ఇలా ఇవ్వకుండా వెళ్తే మాత్రం తప్పన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటించే హక్కు ఆయనకు ఉందని చెప్పారు. కోమటిరెడ్డి, ఇతర నాయకులు మాట్లాడిన మాటల్ని ఏఐసీసీ పరిశీలిస్తోందన్నారు.
ఇదీ పంచాది..!
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మే 6, 7 తేదీల్లో రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. మొదటి రోజు వరంగల్‌లో రైతు సమస్యలపై సంఘర్షణ సభ తలపెట్టారు. దీనికి భారీగా జన సమీకరణ చేయాలని నేతలంతా నిర్ణయించారు. ఐదు లక్షల మంది సభకు వస్తారని ప్రకటించారు. ఈ ఏర్పాట్లకు సంబంధించి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి జిల్లాల్లో సన్నాహాక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో స్థానిక నేతలతో కలిసి మీటింగ్‌లు ఏర్పాటు చేశారు. ఇదే క్రమంలో ఈ నెల 27న నల్గొండ జిల్లా సమావేశం ఏర్పాటు చేయాలని రెండు రోజుల ముందు నిర్ణయించారు. అయితే దీనికి సంబంధించిన సమాచారాన్ని జిల్లా నేతలైన సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి, ఎంపీలు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ఇవ్వలేదు. ఇది తెలుసుకున్న వీరు సమావేశాన్ని వాయిదా వేయించారు. దాంతో అదే జిల్లాకు చెందిన నేతలు అద్దంకి దయాకర్ తదితరులు కొందరు కార్యకర్తలతో భేటీ ఏర్పాటు చేసి.. రేవంత్‌ను జిల్లాకు రాకుండా అడ్డుకునే హక్కు ఎవరికీ లేదని ప్రకటించారు. ఈ లోపు పార్టీ నేతలు నల్గొండ జిల్లా సమావేశ నిర్వహణ బాధ్యతను జానారెడ్డికి అప్పజెప్పారు. ఆయన శుక్రవారం నాగార్జున సాగర్‌లో మీటింగ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గురువారం స్పందిస్తూ.. నల్గొండ కాంగ్రెస్‌కు కంచుకోట అనీ, ఉద్ధండులైన నాయకులున్న జిల్లాల్లో సమావేశం అవసరం లేదని ప్రకటించారు. జన సమీకరణ తాము చూసుకుంటామని, పార్టీ వీక్‌గా ఉన్న నిజామాబాద్, ఆదిలాబాద్ లాంటి జిల్లాల్లో రేవంత్ సమావేశాలు నిర్వహిస్తే బాగుంటుందన్నారు. తాను నల్గొండ జిల్లాలో జరిగే మీటింగ్‌కు వెళ్లడం లేదని కూడా ప్రకటించారు. స్టార్ క్యాంపెయినర్‌గా నియమితులయ్యాక కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హైదరాబాద్ వచ్చిన సందర్భంలో మాట్లాడుతూ.. తమ మధ్య విబేధాలు సమసిపోయాయని, అందరం కలిసి కట్టుగా పని చేస్తామన్నారు. కానీ పది రోజులకే పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. దీనికి రేవంత్ రెడ్డి వైఖరే కారణమని కోమటిరెడ్డి వర్గీయులు ఆరోపిస్తున్నారు. నల్గొండ సమావేశం గురించి కనీస సమాచారం ఇవ్వకుండా ఎట్లా తేదీలు అనౌన్స్ చేస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. అంతేకాక వరంగల్ సమావేశంలో రేవంత్.. జన సమీకరణ గురించి తాను చూసుకుంటానని, దానికి తాను బాధ్యత వహిస్తానని ప్రకటించడాన్ని కోమటిరెడ్డి వర్గీయులు తప్పుబడుతున్నారు. రేవంత్ ఆ కామెంట్ చేసే సమయానికి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా పక్కనే ఉన్నారు. సమిష్టి నాయకత్వంలో జరగాల్సిన రాహుల్ సభ నిర్వహణ విషయంలో రేవంత్ వన్ మ్యాన్ షో చేస్తున్నారంటూ ఆరోజు నుంచే ఆయన గుర్రుగా ఉన్నారు. అగ్గి మీద ఆజ్యం పోసినట్లు నల్గొండ సభ గురించి ముందే చెప్పకపోవడంతో వివాదం మరింత ముదిరింది. కరీంనగర్లో జరిగిన సమావేశంలో కూడా ఫ్లెక్సీల్లో జీవన్ రెడ్డి ఫొటో లేదని కొందరు విమర్శించారు. ఖమ్మంలో భట్టి, రేణుకా చౌదరి వర్గీయుల బల ప్రదర్శనతో జిల్లా పార్టీ ఆఫీసులో తోపులాట జరిగింది. రాహుల్ సభకు ఇంకా వారం సమయం ఉంది. అప్పటి వరకు ఇంకెన్ని విభేదాలు బయటపడతాయోనని కొందరు పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.