7 నెలల్లో.. 81 వేల మందిని కరిచినయ్

7 నెలల్లో.. 81 వేల మందిని కరిచినయ్
  • 7 నెలల్లో.. 81 వేల మందిని కరిచినయ్
  • జనం మీదికి ఎగబడుతున్న కుక్కలు
  • హైదరాబాద్​లోనే అత్యధికంగా కుక్క కాట్లు
  • ఈ ఏడాది రాష్ట్రంలో రేబిస్‌‌తో 15 మంది మృతి
  • కేంద్రం ఫండ్స్​ ఇస్తున్నా.. చర్యలు చేపట్టని ప్రభుత్వం

హైదరాబాద్, వెలుగు: రోడ్డు మీద కాలు పెడదామంటే భయం.. కుక్కలు ఎక్కడ మీదబడి కరుస్తయోనని. పగలు, రాత్రి తేడా లేకుండా వీధి కుక్కలు గుంపులు గుంపులుగా తిరుగుతూ జనాల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఒంటరిగా వెళ్లే వృద్ధులు, చిన్నపిల్ల లను వెంబడించి కరుస్తున్నాయి. రాత్రి వేళల్లో నడుచుకుంటూ వెళ్లేవారితో పాటు బైకులు, కార్లనూ వెంబడిస్తున్నాయి. అవి ఎక్కడ కరుస్తాయోనన్న భయంతో స్సీడ్‌గా వెళ్తున్న బైకులు, కార్లు అదుపుతప్పి ప్రమాదాలకు గురవుతున్నాయి. కుక్కల నియంత్రణకు సర్కార్‌ చర్యలు తీసుకోకపోవడంతో వాటి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.

హైదరాబాద్​లో అత్యధికంగా..
రాష్ట్రంలో గత 7 నెలల్లో 81,200 డాగ్ బైట్ కేసులు నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా హైదరాబాద్‌‌‌‌ జిల్లాలోనే 11,240 కేసులు ఉండగా, తర్వాత జగిత్యాల 5,521 కేసులు, సంగారెడ్డి జిల్లాలో 4,522 కేసులు నమోదయ్యాయి. కుక్క కాట్ల కారణంగా ఈ ఏడాది సుమారు15 మంది రేబిస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. కుక్క కరిచినవాళ్లు యాంటి రేబిస్ వ్యాక్సిన్ తీసుకోవాలని డాక్టర్లు చెబుతున్నప్పటికీ, అవగాహన లోపంతో కొంత మంది వ్యాక్సిన్ తీసుకోవడం లేదు. ఇటీవల జడ్చర్లలో ఒకే కుటుంబంలోని ముగ్గురిని కుక్క కరిచింది. ఇందులో ఇద్దరు వ్యాక్సిన్ తీసుకోగా, మూడో వ్యక్తి తీసుకోలేదు. ఆయనకు రేబిస్‌‌‌‌ సోకడంతో, ఇటీవల హైదరాబాద్‌‌‌‌లోని ఫీవర్ హాస్పిటల్‌‌‌‌లో అడ్మిట్ అయ్యాడు. రేబిస్ సోకిన వ్యక్తి బతికే అవకాశం తక్కువని డాక్టర్లు చెబుతున్నారు. నేషనల్ హెల్త్ మిషన్‌లో భాగంగా రేబిస్ ఎలిమినేషన్ కోసం రెండేండ్ల కింద  కేంద్ర ప్రభుత్వం ఓ కార్యక్రమం తీసుకొచ్చింది. కుక్కల దాడులను నిరోధించే చర్యల కోసం కొంత ఫండ్ కూడా ఇస్తోంది. మన రాష్ట్రంలో కుక్క కాట్లను నిరోధించే చర్యలు మాత్రం కనిపించట్లేదు. 2019లో 1.44 లక్షల మందిని, 2020లో 1.34 లక్షల మందిని కుక్కలు కరిచాయి. రాష్ట్రంలో ఈ ఏడాది ఒక్కరు కూడా రేబిస్‌‌‌‌తో చనిపోలేదని కేంద్రానికి ఇచ్చిన రిపోర్ట్‌‌‌‌లో పేర్కొన్నట్టు తెలిసింది.

ప్రతి నెల కేసులొస్తున్నయ్
రాష్ట్రంలో ప్రతి నెల 2 లేదా 3 రేబిస్ కేసులు వస్తున్నాయని ఇన్​స్టిట్యూట్‌‌‌‌ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ డైరెక్టర్ శంకర్‌‌‌‌‌‌‌‌ తెలిపారు. ఒకసారి రేబిస్ బారిన పడితే బతికే అవకాశం తక్కువని చెప్పారు. కుక్క కరిస్తే యాంటి రేబిస్ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా  అన్ని దవాఖాన్లలో కుక్క కాటు మెడిసిన్, వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఒకసారి వ్యాక్సిన్ తీసుకుంటే మూడేళ్ల వరకు రేబిస్ సోకే అవకాశం ఉండదన్నారు.