ట్రీట్​మెంట్​ కోసం వస్తే ఈడ్చి పారేసిన్రు!

ట్రీట్​మెంట్​ కోసం వస్తే ఈడ్చి పారేసిన్రు!

భోపాల్(మధ్యప్రదేశ్): అనారోగ్యంతో ఆస్పత్రికి వచ్చిన పేషెంట్లకు డాక్టర్లు వీలైతే ట్రీట్​మెంట్​ చేసి పంపిస్తరు.. లేదంటే వేరే ఆస్పత్రికి పోవాలని సూచిస్తరు. మధ్యప్రదేశ్​లో ఓ ఆస్పత్రిలో మాత్రం పేషెంట్​ను ఈడ్చి అవతల పారేసిన్రు. మహిళ అని కూడా చూడకుండా.. ఆస్పత్రి లోపల నుంచి బయట గేటుదాకా దాదాపు 300 మీటర్ల దూరం మట్టి, బురదలో నుంచి సెక్యూరిటీ గార్డు ఈడ్చుకుంటూ తీసుకపోయిండు. భోపాల్​కు 320 కిలోమీటర్ల దూరంలోని ఖర్గోనె సిటీలో జరిగిందీ దారుణం. ఈ సంఘటనను కొంతమంది ఫొటో తీసి, సోషల్​ మీడియాలో పెట్టడంతో వైరల్​గా మారినయ్. దీనిపై ఆస్పత్రి మేనేజ్​మెంట్​ స్పందించింది. ఆస్పత్రి గేటుకు అడ్డంగా కూర్చున్న మహిళను సెక్యూరిటీ గార్డు పక్కకు జరిపాడని, ఈడ్చడంలాంటిదేమీ జరగలేదని చెప్పింది. మెంటల్​ ప్రాబ్లంతో బాధపడుతున్న ఆ మహిళను గుర్తుతెలియని వ్యక్తులు తీసుకొచ్చి ఆస్పత్రిలో వదిలేసి వెళ్లారని పేర్కొంది. బాధిత మహిళ ఆస్పత్రి సిబ్బందిని తిడుతూ, మిస్​బిహేవ్​ చేస్తుంటే అవతలికి తీసుకెళ్లాలని చెప్పినట్లు అక్కడి అధికారులు చెప్పారు. దీంతో సెక్యూరిటీ గార్డ్​ వచ్చి ఆమెను బయటికి తీసుకెళ్లాడని అన్నారు. బయటికి తీసుకెళుతుంటే ఆమె గేటు ముందు కూర్చుండిపోవడంతో గార్డ్​ పక్కకు జరిపాడని తెలిపారు. అయితే, ఈ ఫొటోలు వైరల్​ కావడంతో సదరు సెక్యూరిటీ గార్డును హాస్పిటల్​ మేనేజ్​మెంట్​ తొలగించింది.