- . కొత్తగా తెచ్చిన క్రషర్ పాలసీతో జీరో అక్రమ మైనింగ్, ఓవర్ లోడింగ్
- వివిధ కారణాలతో ఆగిన 20 కేసులకు ఇటీవల మంత్రి నేతృత్వంలోని కమిటీ పరిష్కారం
- లైమ్ స్టోన్ బ్లాకుల వేలంలో 80 శాతం సక్సెస్ రేట్
హైదరా బాద్, వెలుగు: రాష్ట్రంలో గనుల శాఖలో అమలు చేస్తున్న వివిధ పరిపాలనా పరమైన సాంకేతిక సంస్కరణలతో ఖజానాకు ఆదాయం గణనీయంగా పెరిగింది. ప్రధానంగా మైనర్, మేజర్ మినరల్స్(కోల్మినహా) ద్వారా వచ్చే ఆదాయంలో దాదాపు 22 శాతం వృద్ధి నమోదైనట్టు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి.2024–-25 ఆర్థిక సంవత్సరంలో జనవరి వరకు సాధించిన ప్రగతితో పోలిస్తే, ప్రస్తుత 2025-–26 ఆర్థిక సంవత్సరంలో ఆదాయ లక్ష్యాలను చేరుకోవడంలో గనుల శాఖ మెరుగైన ఫలితాలను సాధిస్తోంది. మేజర్ మినరల్స్‌లో 27 శాతం, మైనర్ మినరల్స్ ద్వారా వచ్చే రాబడిలో 33 శాతం, ఇసుక ద్వారా 27 శాతం వృద్ధి నమోదైంది. ప్రభుత్వం చేపట్టిన విధానపరమైన మార్పులు, పారదర్శకమైన వేలం ప్రక్రియ, లీజుల మంజూరులో వేగం పెరగడం వల్ల ఆదాయం పెరగడానికి ప్రధాన కారణాలుగా అధికారులు చెబుతున్నారు. మైనింగ్ రంగంలో జరుగుతున్న కార్యకలాపాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం ద్వారా అక్రమాలకు తావులేకుండా ఆదాయాన్ని పెంచుకునే దిశగా అడుగులు పడుతున్నాయి. భవిష్యత్తులో కూడా ఇదే తరహా వృద్ధిని కొనసాగించేందుకు శాఖాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.
ఇప్పటికే టార్గెట్‌లో 66 శాతం రీచ్
గనుల శాఖ ఆదాయం 2025 జనవరి వరకు ఉన్న గణాంకాలతో పోలిస్తే.. 2026 జనవరి నాటికి మైనర్ మినరల్స్ ద్వారా వచ్చే ఆదాయం 33 శాతం పెరిగి రూ.1,561.03 కోట్లకు చేరుకుంది. అలాగే, ఇసుక విక్రయాల ద్వారా వచ్చే రాబడి 27 శాతం వృద్ధితో 750.55 కోట్ల రూపాయలుగా నమోదైంది. బొగ్గు మినహాయించి ఇతర ప్రధాన ఖనిజాల ఆదాయం కూడా 17 శాతం పెరిగి రూ.197.68 కోట్లకు చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించుకున్న 6,100.41 కోట్ల రూపాయల లక్ష్యంలో ఇప్పటివరకు 66 శాతం సాధించినట్టు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. బొగ్గు రాబడి తగ్గినా, సంస్కరణల కారణంగా ఇతర ఖనిజాల ద్వారా వచ్చే ఆదాయం పెరుగుతుండటం గమనార్హం. అక్రమ మైనింగ్, ఓవర్ లోడింగ్‌ను అరికట్టడానికి ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన స్టోన్ క్రషర్ పాలసీ-2025 అద్భుతమైన ఫలితాలను ఇస్తోంది. ఈ నూతన విధానం ద్వారా క్రషర్ యూనిట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియను పటిష్టం చేయడంతో పాటు విద్యుత్ వినియోగం ఆధారంగా ఉత్పత్తిని లెక్కించే పద్ధతిని అమలు చేస్తున్నారు. దీంతో జీరో అక్రమ మైనింగ్, పారదర్శక రవాణాకు ఆస్కారం ఏర్పడిందని గనుల శాఖ ఉన్నతాధికారులు వెల్లడిస్తున్నారు. ఇప్పటికే క్రషర్ల రిజిస్ట్రేషన్ ద్వారా 2.69 కోట్ల రూపాయల ఆదాయం లభించగా, ఉత్పత్తి నిఘా ద్వారా మరింత రెవెన్యూ వచ్చే అవకాశం ఉంది. అలాగే, గ్రానైట్ పరిశ్రమలో ప్రవేశపెట్టిన స్లాబ్ సిస్టమ్ తో దాదాపు 29.32 కోట్ల రూపాయల మేర అదనపు ఆదాయం ఖజానాకు సమకూరింది. సీనరేజ్ ఫీజును 20 శాతం పెంచడం ద్వారా కూడా దాదాపు 100 కోట్ల రూపాయల అదనపు ఆదాయాన్ని గనుల శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. మైనింగ్ నిఘా కోసం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్ సర్వేలు, శాటిలైట్ ఇమేజరీ వంటి అత్యాధునిక సాంకేతిక పరికరాలను వినియోగిస్తున్నారు. ప్రతి వాహనానికి ఏఎస్-140 జీపీఎస్ ట్రాకింగ్ తప్పనిసరి చేయడంతో అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడి నిబంధనలు పాటించే యజమానులకు ఊరట లభిస్తోంది. పకడ్బందీ తనిఖీలు, కఠినంగా వ్యవహరించడంతో ఖజానాకు చిల్లు పడకుండా గనుల శాఖ కృషి చేస్తోంది.
మైనర్ మినరల్ బ్లాకుల వేలంతో రూ.70 కోట్లు
గనుల శాఖలో పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా మంత్రి నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. గతంలో నిబంధనల ఉల్లంఘన లేదా లీజు గడువు ముగియడం వంటి వివిధ కారణాలతో ఆగిపోయిన 20 క్వారీ కేసులను ఈ కమిటీ తాజాగా పరిష్కరించింది. ఫలితంగా మైనింగ్ కార్యకలాపాలు తిరిగి ప్రారంభమై ప్రభుత్వానికి ఆదాయం రావడంతో పాటు వేలాది మంది కార్మికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయి. అలాగే, ప్రధాన ఖనిజాల కేటాయింపులో భాగంగా చేపట్టిన సున్నపురాయి (లైమ్ స్టోన్) బ్లాకుల వేలంలో రాష్ట్ర ప్రభుత్వం 80 శాతం సక్సెస్ రేటును సాధించింది. ఐదు మేజర్ మినరల్ బ్లాకులకు వేలం నిర్వహించగా అందులో నాలుగు బ్లాకులు విజయవంతంగా అమ్ముడవ్వడం గమనార్హం. ముఖ్యంగా వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ లైమ్ స్టోన్ బ్లాక్ వేలంలో 25 శాతం బిడ్ కోట్ రావడం శాఖ సాధించిన మరో మైలురాయి. పారదర్శకమైన ఈ వేలం ప్రక్రియల ద్వారా ప్రభుత్వం ముందస్తుగా కోట్ల రూపాయల అప్‌ఫ్రంట్ పేమెంట్లను కూడా పొందింది. మైనర్ మినరల్ బ్లాకుల వేలంలో కూడా మూడు దశల ప్రక్రియను పూర్తి చేసి దాదాపు రూ.70 కోట్ల పైగా ఆదాయాన్ని ఆర్జించింది. సులభతర వాణిజ్యంలో భాగంగా మైనింగ్ అనుమతులను వేగవంతం చేస్తూనే రెవెన్యూ లీకేజీని అరికట్టడంలో ప్రభుత్వం విజయం సాధించింది. ఈ తరహా సంస్కరణల ద్వారా మైనింగ్ రంగం రాష్ట్ర ఆర్థిక వృద్ధిలో కీలక భాగస్వామిగా మారుతూ అభివృద్ధి పథంలో నడుస్తోంది.
బొగ్గు ఉత్పత్తి పెంపుపై ఫోకస్
రాష్ట్ర ఖజానాకు అతిపెద్ద ఆదాయ వనరుగా ఉన్న బొగ్గు ఉత్పత్తి, రవాణాపై గనుల శాఖ ప్రత్యేక దృష్టి సారించి కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బొగ్గు గనుల ద్వారా సమకూరిన ఆదాయాన్ని పరిశీలిస్తే, గత ఏడాదితో పోలిస్తే స్థిరమైన వృద్ధి కనిపిస్తోంది. గనుల శాఖ నివేదికల ప్రకారం జనవరి 2026 నాటికి బొగ్గు ద్వారా దాదాపు 1,489 కోట్ల రూపాయల ఆదాయం రాష్ట్రానికి చేరింది. అయితే, బొగ్గు ఉత్పత్తి ఈసారి అనుకున్న స్థాయిలో లేదు. గతేడాది కంటే 50 శాతం మేర తగ్గడంపై ఆ దిశగా మైనింగ్ డిపార్ట్మెంట్ ఫోకస్ పెట్టింది. బొగ్గు తవ్వకాల్లో ఆధునిక యంత్రాల వినియోగం, రవాణా మార్గాలను మెరుగుపరచడం ద్వారా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. సింగరేణి వంటి సంస్థలతో సమన్వయం చేసుకుంటూ బొగ్గు నిల్వలను సమర్థవంతంగా వెలికితీయడం ద్వారా దేశీయ ఇంధన అవసరాలను తీర్చడమే కాకుండా రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతున్నారు. బొగ్గు గనుల విస్తరణ కొత్త బ్లాకుల కేటాయింపు ప్రక్రియల్లో కూడా పారదర్శకతను పాటిస్తూ నిబంధనల ప్రకారం వేలం నిర్వహిస్తున్నారు. దీంతో బొగ్గు రంగం నుంచి వచ్చే రాబడి భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అక్రమ రవాణాను అరికట్టేందుకు బొగ్గు లారీలపై జీపీఎస్ ట్రాకింగ్ వంటి నిఘా వ్యవస్థలను పటిష్టం చేశారు.
