5 నెలలుగా జీతాలు రాక అవస్థలు పడుతున్నరు

5 నెలలుగా జీతాలు రాక అవస్థలు పడుతున్నరు
  • పాఠాలు చెప్పిస్తున్నా.. శాలరీలు మాత్రం పెండింగ్ 
  • సర్కార్ జూనియర్ కాలేజీ 
  • గెస్ట్ లెక్చరర్ల అవస్థలు 

హైదరాబాద్, వెలుగు: సర్కారు జూనియర్ కాలేజీల్లో పని చేసే గెస్ట్ లెక్చరర్లు ఐదు నెలలుగా జీతాలు రాక అవస్థలు పడుతున్నరు. ఇంటర్మీడియెట్ అధికారులు మాత్రం జీతాలు త్వరలోనే వస్తాయని చెప్తూ రెండు, మూడు నెలలుగా సమాధానం దాటవేస్తున్నారు. రాష్ట్రంలోని 405 గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో 1,654 మంది గెస్ట్ లెక్చరర్లు పని చేస్తున్నారు. వీరంతా పేరుకు గెస్ట్ లెక్చరర్లే అయినా.. రెగ్యులర్ ఎంప్లాయీస్ మాదిరిగానే క్లాసులు తీసుకుంటారు. నిరుడు కరోనా సాకుతో మూడు నెలలు మాత్రమే వీరిని విధుల్లోకి తీసుకున్నారు.

ఈ విద్యా సంవత్సరంలో అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకూ ఐదు నెలల పాటు విధుల్లో కొనసాగేలా అధికారులు గతంలో ఉత్తర్వులు ఇచ్చారు. విద్యా సంవత్సరం పెరగడంతో ఇటీవల వీరి సేవలను ఏప్రిల్​ వరకూ వినియోగించుకోవాలని ఆదేశాలిచ్చారు. కానీ, ఈ ఏడాది ఇప్పటి వరకూ గెస్ట్ లెక్చరర్లకు జీతాలు రాలేదు. జీతాలను రిలీజ్ చేయాలని సర్కారుకు ప్రతిపాదనలు పంపామంటూ అధికారులు చేతులు దులుపుకొంటున్నారు. మరోవైపు వీరిలో కొందరికి పోయిన ఏడాదికి సంబంధించి కూడా మూడు నెలల జీతాలు పెండింగ్ లో ఉన్నాయి. 
గెస్ట్ లెక్చరర్లు 1,654 మంది ఉంటే 1,430 మందికి మాత్రమే సర్కారు వేతనాలు ఇచ్చింది. దీంతో మిగిలిన వారి జీతాలు పెండింగ్ లో పడ్డాయి. ఇటీవల కొన్నిజిల్లాల వారికి జీతాలు ఇచ్చామని, ఇంకొన్ని జిల్లాల్లో బడ్జెట్​ రాగానే ఇస్తామని 
ఆఫీసర్లు చెప్తున్నారు.   
అప్పులతో నెట్టుకొస్తున్నరు 
గెస్ట్ లెక్చరర్ జాబ్​ పైనే ఆధారపడిన వాళ్లు జీతాలు రాక అప్పుల పాలవుతున్నరు. నెలల తరబడి జీతాలు రాకపోవడంతో కుటుంబం గడవడం కోసం తెలిసిన వాళ్ల దగ్గర అప్పులు చేస్తూ నెట్టుకొస్తున్నరు. పండుగలను కూడా సంతోషంగా జరుపుకొలేని పరిస్థితి తమకు వచ్చిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
జీతాలు వెంటనే ఇవ్వాలి 
గెస్ట్ లెక్చరర్లకు ఐదు నెలలుగా జీతాలు ఇవ్వడంలేదు. నిరుడు నాతో పాటు చాలామందికి మూడు నెలల శాలరీలు రాలేదు. నెలల తరబడి జీతాలు రాక  తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. జీతాల కోసం ఇంటర్ బోర్డుకు, ఫైనాన్స్ ఆఫీసుకు తిరిగితిరిగి అలసిపోయినం. ఇప్పటికైనా సర్కారు స్పందించి పెండింగ్ లో ఉన్న జీతాలను వెంటనే ఇవ్వాలి.  - దేవేందర్, గెస్ట్ లెక్చరర్ల జేఏసీ ప్రతినిధి