
ఐపీఎల్ 2025లో భాగంగా గురువారం (మే 22) గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జయింట్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ లో గిల్ సేన సరికొత్త జెర్సీలో మైదానంలోకి దిగబోతుంది. లావెండర్ కలర్ లో ఉన్న గుజరాత్ కొత్త జెర్సీ క్రికెట్ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. క్యాన్సర్ పై అవగాహన కల్పించేందుకు.. క్యాన్సర్ రోగులను ఆదుకునేందుకు ఇది తమ ప్రత్యేక ప్రచారమని తెలుస్తుంది. లావెండర్ రంగు జెర్సీ ధరించి గుజరాత్ ఆటగాళ్లు గత సీజన్ లో సన్ రైజర్స్ పై మ్యాచ్ ఆడారు. ఈ సారి అదే జెర్సీతో లక్నోపై మ్యాచ్ ఆడేందుకు సిద్ధమవుతున్నారు.
లావెండర్ సాధారణంగా అన్నవాహిక క్యాన్సర్‌కు రంగు. కానీ ఇప్పుడు ఇది అన్ని రకాల క్యాన్సర్‌లకు ఉపయోగిస్తున్నారు. లావెండర్ జెర్సీని ధరించి గతంలో ఢిల్లీ డేర్‌డేవిల్స్ జట్టు కూడా ఆడింది. 2015 సీజన్‌లో మాజీ భారత స్టార్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ నేతృత్వంలో ఈ జెర్సీలో మ్యాచ్ ఆడింది. స్వయంగా క్యాన్సర్‌ను జయించిన యువరాజ్ సింగ్ చొరవతో ఢిల్లీ జట్టు లావెండర్ జెర్సీ ధరించి క్యాన్సర్‌పై ప్రచారం నిర్వహించింది. లీగ్ దశలో హోమ్ గ్రౌండ్‌లో మ్యాచ్ ఆడుతోన్న గుజరాత్ టైటాన్స్.. సరికొత్త జెర్సీలో కనిపించనుంది.
►ALSO READ | Virat Kohli: చిన్నస్వామి స్టేడియం దద్దరిల్లాల్సిందే.. హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్న కోహ్లీ టెస్ట్ జెర్సీలు
ప్రస్తుత సీజన్ లో గుజరాత్ టైటాన్స్ హవా కొనసాగుతోంది. ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్ ల్లో 8 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో కొనసాగుతోంది. ఈ టోర్నీలో గిల్ సేన మరో మూడు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఒక మ్యాచ్ గెలిచినా ప్లే ఆఫ్స్ చేరడం గ్యారంటీ. రెండు మ్యాచ్ ల్లో గెలిస్తే టాప్ 2 లో నిలవొచ్చు. గుజరాత్ తమ తదుపరి మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ తో ఆదివారం (మే 18) తలపడనుంది. ఆ తర్వాత సొంతగడ్డపై లక్నో సూపర్ జయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ తో ఆడుతుంది.