వర్జీనియా: అమెరికాలో ఘోరం జరిగింది. సూపర్ మార్కెట్‌లోకి చొరబడిన దోపిడి దొంగ గుజరాత్‌కు చెందిన ఒక మహిళను కాల్చి చంపేశాడు. ఈ ఘటనను బాధితురాలి కుటుంబం ధృవీకరించింది. బాధితురాలు గత 10 సంవత్సరాలుగా వర్జీనియాలోని ఆ సూపర్ మార్కెట్‌లో పనిచేస్తున్నట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ మహిళను మేఘనాబెన్ పటేల్‌గా గుర్తించారు. ఆమె వయస్సు 45 సంవత్సరాలు.
Gujarati Woman Shot Dead in America; CCTV Footage of Incident Surfaceshttps://t.co/HlMoAa1hWD pic.twitter.com/GKQH6s7pEK
— DeshGujarat (@DeshGujarat) May 26, 2026
ఆమె స్వస్థలం.. మెహసానాలోని విసాపూర్ జిల్లాలోని జంత్రల్ గ్రామం. బాధితురాలి తండ్రి కర్సన్‌భాయ్ పటేల్, తల్లి కపిలాబెన్ జంత్రల్‌లోనే నివసిస్తున్నారు. ఘటన గురించి సమాచారం అందిన వెంటనే స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దర్యాప్తు ప్రారంభించారు. అంతేకాకుండా.. కాల్చి చంపిన వ్యక్తిని అరెస్ట్ చేయడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.
యానిమల్స్ ప్రింట్తో ఉన్న ట్రాక్ ప్యాంట్, బూడిద రంగు జాకెట్ ధరించి, ముఖాన్ని కవర్ చేసుకున్నాడు. ఈ ఘటన జరిగిన సందర్భంలో ఆ సూపర్ మార్కెట్ ఖాళీగా ఉంది. దాదాపు ఖాళీగా ఉన్న దుకాణంలోకి వెళ్లి.. కౌంటర్ దగ్గర ఉన్న మేఘనాబెన్ కు హాయ్ చెప్పి.. క్షణాల్లోనే ఆమెను కాల్చి.. నిందితుడు అక్కడ నుంచి పరారైన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో స్పష్టంగా కనిపించాయి.
బాధితురాలికి.. భర్త ఉపేంద్రభాయ్ పటేల్, ఇద్దరు పిల్లలు కూతురు నక్షీబెన్, కొడుకు స్మిత్ ఉన్నారు. మేఘనాబెన్ పటేల్ కుటుంబం అమెరికాలోనే స్థిరపడింది. ఆమె ఈ ఘటన జరిగిన అదే సూపర్ మార్కెట్లో పదేళ్లుగా పనిచేస్తుండటం గమనార్హం.
