నా మొగుడు పోలీస్ జాగ్రత్త: కారుతో ఢీకొట్టింది కాక రోడ్డుపై మహిళ వీరంగం

నా మొగుడు పోలీస్ జాగ్రత్త: కారుతో ఢీకొట్టింది కాక రోడ్డుపై మహిళ వీరంగం

హర్యానా: అధికారం, పలుకుబడి ఉంటే ఏం చేసినా చెల్లుతుందా..? అంటే ఓ మహిళా అవుననే అంటుంది. రోడ్డుపై వెళ్తున్న ఓ వ్యక్తిని కారుతో ఢీకొట్టడమే కాకుండా నా భర్త పోలీస్ జాగ్రత్త అంటూ బాధితుడినే బెదిరించింది. హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్‎లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‎గా మారింది. దీంతో సదరు మహిళ తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం..

గురుగ్రామ్‌లోని సెక్టార్ 62లో ఓ వ్యక్తి రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలో వేగంగా దూసుకొచ్చిన ఓ కారు అతడి కాలు మీద నుంచి దూసుకెళ్లింది. అయితే, కారుతో ఢీకొట్టినందుకు బాధితుడికి క్షమాపణలు చెప్పాల్సిన సదరు మహిళా కారు డ్రైవర్‌ దీనికి విరుద్ధంగా అతడినే బెదిరించింది. నువ్వే రోడ్డుకు అడ్డంగా నడుచుకుంటూ వెళ్తున్నావని.. అందుకే కారు తగిలిందని వాదించింది. 

తన భర్త పోలీస్ ఆఫీసర్ అని.. ఎక్కువ మాట్లాడితే బొక్కలో వేయిస్తానని బెదిరించింది. బాధితుడు ఈ సంఘటనను రికార్డ్ చేసి వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో క్షణాల్లోనే వైరల్‎గా మారింది. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భర్త పోలీస్ అయితే మనిషులను చంపొచ్చా.. తప్పు చేసేంది కాకుండా పలుబడి ఉపయోగించి బాధితులనే బెదిరిస్తావా అంటూ సదరు మహిళపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 ‘‘ఇది అహంకారానికి పరాకాష్ట. ఒకరి కాలికి దెబ్బ తగిలితే కనీస మర్యాద చూపకుండా ఆమె బూటకపు పోలీసు అధికారాన్ని ప్రదర్శిస్తుంది. భారతీయ రోడ్లపై జవాబుదారీతనం సున్నా అనడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ. ఆ వ్యక్తికి న్యాయం జరగాలని, ఆమె కారును లాక్కెళ్లాలని ఆశిస్తున్నాను’’ అని ఓ యూజర్ కామెంట్ చేశాడు.

 భారతదేశంలో చట్టాలు కేవలం సామాన్యులకు మాత్రమేనని.. అధికారం, అంగబలం ఉన్నవారికి ఎలాంటి చట్టాలు వర్తించవడానికి ఈ ఘటన నిరూపిస్తోందని ఓ నెటిజన్ అసహనం వ్యక్తం చేశాడు. తప్పు చేసి కూడా అధికార మదం ప్రదర్శించే ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.