- సుప్రీంకోర్టులో అటవీ శాఖకు దక్కిన విజయం
- త్వరలో హైదరాబాద్ సిటీకి మరో గ్రీన్ లంగ్ స్పేస్
హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలంలోని అటవీ భూములకు ఎట్టకేలకు మహర్దశ వచ్చింది. ఆక్రమణదారుల కబంద హస్తాల్లో చిక్కుకున్న గుర్రంగూడ అటవీ ప్రాంతానికి పూర్తి స్థాయి రక్షణ లభించనుంది. ఆమంగల్ డివిజన్ పరిధిలోని ఈ అటవీ భూమిని ‘రిజర్వ్ ఫారెస్ట్’ గా గుర్తిస్తూ తెలంగాణ ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.
మొత్తం 424 ఎకరాల 31 గుంటల భూమిని రిజర్వ్ ఫారెస్ట్ హోదాలోకి మారుస్తూ పర్యావరణ, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ శుక్రవారం జీఓ జారీ చేసింది. తెలంగాణ ఫారెస్ట్ చట్టం–1967లోని సెక్షన్ 15 ప్రకారం ఈ ఉత్తర్వులు ఇచ్చింది. గుర్రం గూడ అటవీ భూమికి సంబంధించి దశాబ్దాలుగా న్యాయపోరాటం సాగుతోంది. ముఖ్యంగా సాహెబ్‌నగర్ కలాన్ గ్రామంలోని సర్వే నంబర్ 201/1లో ఉన్న 102 ఎకరాల భూమిపై ప్రైవేటు వ్యక్తులతో వివాదం నడిచింది.
సాహెబ్‌నగర్ కలాన్ కేసుగా ప్రసిద్ధి చెందిన ఈ వ్యవహారంలో అటవీ శాఖ అధికారులు పక్కా ఆధారాలతో కోర్టులో పోరాటం చేశారు. చివరకు సుప్రీంకోర్టు అటవీ శాఖ వాదనతో ఏకీభవిస్తూ తీర్పు ఇచ్చింది. దీంతో ఆ భూములపై ప్రభుత్వ హక్కులు ఖరారయ్యాయి. అటవీ భూములను ఆక్రమణల నుంచి కాపాడటంలో ఈ తీర్పు కీలక మలుపుగా నిలిచింది.
నగరం చెంతన మరో పచ్చని వనం
హైదరాబాద్ నగరం కాంక్రీట్ జంగిల్‌గా మారుతున్న తరుణంలో గుర్రంగూడ అటవీ ప్రాంతాన్ని ప్రభుత్వం ఒక భారీ అర్బన్ ఫారెస్ట్ పార్క్‌గా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. 424 ఎకరాల భూమి నగర ప్రజలకు ఒక అద్భుతమైన గ్రీన్ లంగ్ స్పేస్ లా మారనుంది. ప్రకృతి ప్రేమికులు, పర్యావరణ ప్రియులు, కుటుంబాలతో కలిసి సేదతీరేందుకు వీలుగా ఇక్కడ సౌకర్యాలు కల్పించనున్నారు. పర్యావరణంపై అవగాహన కల్పించే కేంద్రంగా కూడా దీనిని తీర్చిదిద్దనున్నారు.
అటవీ సంరక్షణకు ప్రాధాన్యం: పీసీసీఎఫ్ డాక్టర్ సువర్ణ
రిజర్వ్ ఫారెస్ట్ హోదా లభించడంపై అటవీ దళాల ముఖ్య సంరక్షణాధికారి (పీసీసీఎఫ్) డాక్టర్ సి.సువర్ణ స్పందించారు. ఈ నిర్ణయంతో అటవీ భూములకు చట్టపరమైన రక్షణ లభిస్తుందని ఆమె తెలిపారు. ప్రభుత్వ మద్దతు, అధికారుల కృషితోనే ఈ భూములను కాపాడుకోగలిగామని చెప్పారు. ఇకపై ఇక్కడ ఆక్రమణలకు తావు ఉండదని, సీఎం ఆదేశాల మేరకు అటవీ భూముల పరిరక్షణకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్ చుట్టూ ఉన్న ఇలాంటి అటవీ ప్రాంతాలను అర్బన్ పార్కులుగా మార్చి పచ్చదనాన్ని పెంచుతామన్నారు.
