గురునానక్ కాలేజీలో హై టెన్షన్.. స్టూడెంట్స్ పై లాఠీఛార్జి

గురునానక్ కాలేజీలో హై టెన్షన్.. స్టూడెంట్స్ పై లాఠీఛార్జి

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం గురునానక్ కాలేజీ దగ్గర హై టెన్షన్ నెలకొంది. కాలేజీలో కోర్సుల కోసం లక్షల రూపాయలు ఫీజు వసూలు చేసి.. ఇప్పుడు అనుమతి లేదంటూ యాజమాన్యం చేతులెత్తేయటంపై ఆగ్రహంతో రగిలిపోయారు స్టూడెంట్స్. జూన్ 22వ తేదీ గురువారం వందల మంది స్టూడెంట్స్, వారి పేరంట్స్ కాలేజీ ఎదుట ఆందోళనకు దిగారు. న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదని బైఠాయించారు. 

గురునానక్ కాలేజీ యూనివర్సిటీ పేరుతో మోసం చేసిందని.. యాజమాన్యం చేసిన పని వల్ల ఏడాది విద్యా సంవత్సం కోల్పోయామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు స్టూడెంట్స్. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామంటూ కాలేజీ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలోనే పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. స్టూడెంట్స్, వాళ్ల పేరంట్స్ తో మాట్లాడారు. ఆందోళన విరమించాలని.. యాజమాన్యంతో చర్చించుకుని పరిష్కరించుకోవాలని సూచించారు. దీనికి ఆందోళనకారులు ససేమిరా అనటంతో.. లాఠీలకు పని చెప్పారు పోలీసులు. బలవంతంగా అక్కడి నుంచి తరిమికొట్టారు. లాఠీఛార్జి చేసి చెదరగొట్టారు. 

పోలీసులు వైఖరిపైనా విమర్శలు వస్తున్నాయి. స్టూడెంట్స్ కు న్యాయం చేయాల్సిన పోలీసులు.. బాధితులపైనే లాఠీఛార్జీ చేస్తారా అంటూ నిలదీస్తున్నారు. లక్షలకు లక్షలు ఫీజు రూపంలో డబ్బులు కట్టామని.. ఇప్పుడు యూనివర్సిటీ హోదా లేదని.. కోర్సులకు అనుమతి లేదని చెప్పటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. న్యాయం చేయాల్సిందే అంటూ స్టూడెంట్స్ తల్లిదండ్రులు కాలేజీ ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్నారు.